MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
అక్బర్ శాస్త్రి
తమిళ మూలం : జయకాంతన్
అనువాదం: రంగన్ సుందరేశన్
మాయవరం జంక్షన్ లో దిగి, భోజనం చేసి, నేను మళ్ళీ నా కంపార్టుమెంటు చేరుకున్నప్పుడు ఒక మూడో మనిషి నా తోలు సంచీని, దుస్తుల సంచీని, పక్కకి నెట్టేసి, నా జాగాలో కూర్చొని, పూరీ, బంగాళ దుంప కూర తింటున్నారు.
ఊరికే తినడం లేదు. కూర అంటుకున్న చేయి వేళ్ళని అలా,ఇలా ఊపుతూ మాటాడుతున్నారు. కంఠధ్వని కంచు మోగుతున్నట్టుంది. అందులో ఠీవీ, వయస్సుకి తగిన గర్వమూ కలిసి ఉన్నాయి.
Excise Department అంటున్నారు, మరి మీ ఉద్యోగం ఏమిటో చెప్పరేం?” అని అతను గదమాయించగానే, వినయంతో, చిరునవ్వుతో ఎవరో అధికారికి జవాబు చెప్తున్నట్టు “సూపరింటు!” అన్నారు ఆ చివరన కూర్చున్న అతను.
షీర్గాళి స్టేషన్ లో ఎక్కి, అక్కడినుంచీ రైలు ప్రయాణం చేస్తున్న నన్ను కనీసం లెక్కయినా చేయకుండా రైలు గైడులో మొహం దాచుకున్న అతనికి ఈ కొత్త మనిషిని చూడగానే ఎంత మర్యాద, ఎంత వినయం?
ఎదుట బెంచీలో కాలు చాచి నిద్రపోతున్న ‘సూపరింటు’ భార్య ఒకసారి కళ్ళు తెరిచి చూసింది. మళ్ళీ కళ్ళు మూసుకుంది.
ఆవిడ కాలు పక్కనే కూర్చున్న ఇద్దరు పిల్లలు బంగాళ దుంప కూర తింటున్న అతన్నీ, అతనికి జవాబు చెప్తున్న నాన్నగారినీ ఒకరు మార్చి ఒకరు చూస్తున్నారు.
“ఎక్కడనుంచి వస్తున్నారు?”
“మద్రాసునుంచి.”
“పగటివేళ ఎవరైనా మద్రాసునుంచి రైలు ప్రయాణం చేస్తారా?”
“లేదు, నిన్న రాత్రి బయలుదేరాం. కడలూరులో నా మరదలుకి అస్వస్థగా ఉందని అన్నారు. దాన్ని చూసి ఇవాళ మధ్యాహ్నం బయలుదేరాం.”
“ఎంతవరకూ ప్రయాణం?”
“తంజావూరుకి. అమ్మకి జబ్బుగా ఉంది, చూడాలని వెళ్తున్నాం.”
“అలాగా?” అంటూ అతను లేచి, చేయిలోని ఆకుని కిటికీ ద్వారా బయటకి రువ్వారు. అది గాలిలో తేలుతూ నామీద పడుతుందేమో అనే భయంతో తలుపు దగ్గఱ నిలబడివున్న నేను కొంచెం లోపలికి కదిలాను. అప్పుడే బండి స్టేషన్ని వదిలి, లెవల్ క్రాసింగ్ దాటి ప్రయాణం చేస్తోంది. అతను తలుపు తెరచుకొని చేయి కడుక్కోడానికి వెళ్ళారు.
మధ్యనే ఉన్న నా తోలు సంచీని, దుస్తుల సంచీని కదిపి ఖాళీ జాగాలో నేను మళ్ళీ కూర్చున్నాను. అతను తిరిగివచ్చి, నన్ను చూసి, ఉపేక్షతో, తన జాగాలో కూర్చున్నారు.
మంచి పొడుగైన ఆకారం. ఎత్తు ఆరడుగులకి తగ్గదు. లావైన దేహం అనలేం, చిక్కిన దేహమూ కాదు. వీపు బిగువుగా, కొరడాలాగ అతను కూర్చున్నప్పుడుకూడా నిక్కబొడుచుకొని ఉంది. దీర్ఘమైన ముక్కు, చేతులు, కాళ్ళు. కంఠధ్వని చెలాయించే అధికారంకి సముచితంగా అతని శరీరం కనిపిస్తోంది.
కూర్చున్న మనిషి ‘వీడెవడో కుర్రవాడు!’ అని మళ్ళీ తిరిగి నా వీపుని చూసారు.
“అమ్మగారిని చూడడానికి వెళ్తున్నారా? ఏమిటి సంగతి?” అని అతన్ని అడిగారు.
“కిందటి నెల జబ్బుతో మంచమెక్కింది. అప్పుడు వెళ్ళడానికి నాకు వీలవలేదు. ఇప్పుడే శెలవు దొరికింది. మీరు. ” అలా అడిగినప్పుడూ అదే వినయం, చిరునవ్వు.
“నేనా? నాకు సొంత ఊరు మదురై. పేరు గోవింద శాస్త్రి. వకీలుగా పని చేస్తున్నాను. ఒక కేసు కోసం మద్రాసు వెళ్ళి తిరిగి వస్తున్నాను. మాయవరంలో నా చెల్లెలు ఉంది. దాన్ని చూసి రైలెక్కాను. First Class లో టికెట్ లేదన్నాడు. ‘సరే’ అని Second Class టికెట్ కొని ఎక్కేసాను. నాకు రాత్రి భోజనం చేసే అలవాటు లేదు. నా చెల్లెలు “అన్నయ్యా, ఫలాహారం చెయ్యనా?” అని నన్ను అడిగింది. “వద్దు, నీకేం మతి పోయిందా?” అని వచ్చేసాను. రెండు పూరీలు కొన్నాను, తినేసాను. ఒంటరి మనిషికోసం ఎందుకయ్యా ఫలాహారం చెయ్యాలి? నేనేం చచ్చిపోయానా?” అని అంటూ గోవింద శాస్త్రి తన పరిసరాలపై కళ్ళు ఒకసారి మళ్ళించారు. ఆ పిల్లల్ని చూసారు.
“మీ పిల్లలా?”
“అవునండి.”
“ఎన్నేళ్ళు నిండాయి?”
“వాడే పెద్దవాడు, పది నిండాయి. అమ్మాయికి ఇప్పుడే ఏడు నడుస్తోంది. ”
“ఇద్దరినీ చూస్తే మలేరియా జబ్బులో గుంజుకున్నట్టు కనిపిస్తున్నారే. ఒరేయ్, ఇలా రా. భయం ఎందుకు? ఇలా రా. నేనేం చెయ్యను.”
పిల్లవాడు వచ్చి నిలబడ్డాడు. సన్నగిల్లిన వాడి చేయిని పట్టుకున్నారు గోవింద శాస్త్రి. ఒక సారి వాడి చేయిని పూర్తిగా నిమిరారు .
“ఏదీ, నీ నాలిక చూపించు. నీ కళ్ళు చూడనీ. ”
“అదేం లేదండి. వాడు సరిగ్గా భోంచెయ్యడు. భోజనంకి కూర్చుంటే ‘పప్పు బాగా లేదు’, ‘నెయ్యి కంపు కొడుతోంది!’ - అని ఏమేమో చెప్పుకుంటూ లేచిపోతాడు,” అన్నారు ఆ చివరన ఉన్న మనిషి.
“చొక్కాని ఎత్తు. ”
పిల్లవాడు చొక్కాని ఎత్తి, పొట్టని చూపాడు. దాన్ని ఒకసారి గోవింద శాస్త్రి నొక్కి వాడి మొహం చూసారు.
“ఇదేంట్రా, మోకాలు, ముంజెయిలో ఎముకలు నిక్కపొడుచుకున్నట్టున్నాయే? కళ్ళు సున్నంలాగ తెల్లపారిపోయాయి! అబ్బాయికి రోజూ ఒక గుడ్డు ఇవ్వాలి!”
“అవన్నీ చేసాం. వాడు ఏదీ ముట్టుకోడు, సార్. ”
“Cod liver oil?”
“అదీ ఇచ్చాం. లాభం లేదండి!”
“Cod liver oil ని మాల్ట్ గా ఇవ్వాలి. తీపిగా ఉంటుంది.”
“అలాగా? ఏమో చూడాలి. ”
“లేకపోతే. ఇంకో పని చేస్తారా?. ”
“చెప్పండి. ”
“మీకు oats తెలుసుకదా?”
“..?”
గుర్రాలకి పెట్టే ధాన్యం. ”
“...”
“రోజూ ఒక గరిటె oats తీసుకొని వేడినీళ్ళలో ఉడకబెట్టి ఆ నీరు తాగమనండి. ఆ తరువాత తరచుగా ఆ oatsని ఉప్పుతో కలిసి తినమనండి! పిల్లవాడు అరబ్బు గుర్రంలాగ గెంతుతాడో లేదో చూడండి! నేనిప్పుడు వీడిని మా ఇంటికి తీసుకొనివెళ్ళి మూడు నెలలు అలా చేసానంటే, ఆ తరువాత వాడు మీ అబ్బాయే అని నేను ప్రతిజ్ఞ చేస్తేనే మీరు నమ్ముతారు! చెప్పండి, నేను చెప్పినట్టు చేస్తారా?” అని బెదిరిస్తున్నట్టే అడిగారు శాస్త్రి.
“చేస్తాను.”
“వినండి, నేను డాక్టరు కాదు! దానికోసం నేనేం చదువుకోలేదు! కాని చాలామందికి మా ఇంటిలోనుంచి మందులు ఇవ్వడం జరుగుతూనే ఉంది! నేను చెప్పేది ప్రకృతి వైద్యం. మా ఇంటిలో అంతా అమ్మమ్మ వంటకాలే! కరివేపాకు పులుసంటే నాకు చాలా ఇష్టం. నియమం తప్పకుండా అదే నా భోజనం. ఆ తరువాత వేప పువ్వులని నేతిలో దోరగా వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కారం చల్లి అన్నంలో కలుపుకుని తింటాను, రుచిగా ఉంటుంది. ఇంతవరకూ డాక్టరుకని ఒక దమ్మిడీ ఖర్చు చెయ్యలేదంటే మీరు నమ్ముతారా? పెద్దల పుణ్యంలో నాకు ఎకరాలకెకరాలు పొలాలున్నాయి. కాని అందులోనుంచి ధాన్యం అమ్మిన డబ్బు డాక్టరికి ఇవ్వడం జరగనే లేదు. ”
“మంచి పుణ్యం చేసారు మీరు. హి హి హి .. . ”
“ఇందులో పుణ్యమూ లేదు, గిణ్యమూ లేదు. అంతా మన మనోబలంలో ఉందయ్యా. ”
“అదేంటో సార్! నా సంగతి వినండి. నేను పుట్టిన రోజునుంచి డాక్టరు మా ఇంటికి రాని రోజు లేదు! అదిగో, మా ఆవిడని చూస్తున్నారుగా, ఎదుట చిరిగిన చాప లాగ పడుకొనివుంది. కడలూరులో మేం బండి ఎక్కాం, అప్పుడు పడుకుంది, ఇంకా లేవనేలేదు! ఇతర మగవాళ్ళ ముందు నిలబడేందుకూ ఇబ్బందిపడేది, ఆ రోజుల్లో. అదే ఇప్పుడిలా ఐపోయింది! నేనేమి చేయగలను , చెప్పండి!” అని భార్యను చూసారు ‘సూపరింటు.’
సూపరింటు భార్య లేతగా కళ్ళు తెరిచి చూసింది. మళ్ళీ కళ్ళు మూసుకుంది.
“ఆ రోజుల్లో బొంగరంలా ఎంత చురుకుగా పని చేసేది! ఒకరోజు ఉన్నట్టుండి ‘కడుపులో నొప్పి’ అంది. డాక్టరు Appendicitis అన్నారు. ఆపరేషన్ చేసారు. ఆ తరువాత నాలుగు సంవత్సరాలు భ్రమతో ఏమీ మాటాడకుండా కూర్చుండేది. ఎవరు ఎది అడిగినా మాటాడాదు. ఇంజెక్షన్లూ, మందులూ అన్నీ ఇచ్చాం, లాభం లేదు.
ఇప్పుడేమో పది సంవత్సరాలుగా రోజూ తలనొప్పి, కాళ్లనొప్పి అని అంటోంది. లేచి నడవడం చేతకాదు. కాఫీ, వంట, అన్నీ నేనే చేస్తున్నాను.”
సూపరింటు భార్య కళ్ళు మూయకుండా అంతా వింటూనేవుంది.
“ప్రతీవారం తైలస్నానం చెయ్యాలి”, అన్నారు గోవింద శాస్త్రి.
“బాగా చెప్పారు! ఒక చెంచా తైలం తలలో పెడితే చాలు, ‘అయ్యో, గునపంలాగ భారంగా ఉందే?’ అని గోల పెడుతుంది. తైలం దానికి శత్రువు. ”
“నాకు వింతగా ఉంది. oil bath కి లొంగని దేహమంటూ ఎక్కడైనా ఉందా? తలనొప్పికి అది సర్వసంజీవనీ అని అంటారే?”
“అదేంటో, తైలం తప్పిస్తే మరేదైనా చెప్పండి. నేను అన్ని ఇంజెక్షనులూ తీసుకున్నాను, అన్ని మందులూ వాడాను. ఈ తలనొప్పి ఆగితే చాలు!” అని పడుకుంటూనే, నోరు తెరిచింది ‘సూపరింటు’ భార్య.
ఆవిడ మాటలు విన్నతరువాతనే ఆమెలో ఉన్న వయసుకు మీరిన వృద్ధాప్యం, మొహంలో అలసట స్పష్టంగా తెలిసింది. నోటినుంచి మాటలు సరిగ్గా పెగల్లేదు. అందమైన ముత్తైదువ ఇప్పుడు వికారంగా కనిపించింది.
“తలనొప్పిని ఆపాలి, అదేకదా మనకి కావాలి?” అని అంటూ గోవింద శాస్త్రి బయటకి చూసారు.
బండి కుత్తాలంలో ఆగింది. ఒక అణాకి వేరుశెనగల పొట్లం కొని, నమలుతూ, ఏదో ఆలోచిస్తూ అతను కూర్చున్నారు.
“సరే, చెప్తాను, వినండి,” అని అతను ఆరంభించగానే తొందర తొందరగా ‘సూపరింటు’ తన బుష్ కోటునుంచి ఒక డైరీ, పెన్సిలు బయటకి తీసుకొని సిద్దమయ్యారు.
“రాసుకోండి. వేప పప్పు, తెల్ల మిరియాలు, గస గసా, అల్లం... ” అతను ఇంకా ఏవో నాలుగైదు చెప్పారు. నాకు గుర్తు లేదు. “ఇవన్నీ పాలులో ఊరబెట్టి, దంచి, రుబ్బుఱోలుతో, బంతులు బంతులుగా చేసి, ఎండబెట్టుకోవాలి. ఆ తరువాత, రోజూ, ఒక బంతిని పాలుతో కలిపి, తలకి రుద్దుకొని స్నానం చెయ్యాలి. ఒక నెల తరువాత నాకు రాయండి.”
అమృతం దొరికినట్టు ‘సూపరింటు’ దాన్ని రాసుకుంటూ నాలుగుసార్లు సంశయాలు తీర్చుకొని, ఇంకొకసారి డైరీ చదువుకోని, జేబులో పెట్టుకున్నారు.
“అమ్మా, మీ తలనొప్పికి ఇదే ఔషధం. అన్ని complaints కి నివారణలూ ఇందులో కలిసి ఉన్నాయంటే నమ్మండి. ఈ రోజుతో మీ తలనొప్పి పోయినట్టే. ” అన్నారు గోవింద శాస్త్రి.
‘సూపరింటు’ భార్య లేచి కూర్చొని “అతన్ని ఇంకొకసారి బాగా అడిగి తెలుసుకోండి,” అని భర్తని వేడుకుంది.
శాస్త్రి మరికొన్ని రహస్యాలు తెలియజేసారు. మొటిమలు, గజ్జి, asthma - ఇలా చాలా వ్యాధులకి అతని దగ్గర నివారణ మార్గాలున్నాయని తెలిసింది.
‘సూపరింటు’ కళ్లు స్థిరంగా శాస్త్రి మీదనే నిలబడిపోయాయి. అలాంటి భ్రమ అతన్ని ఆవరించుకుంది. ధన్వంతరితోబాటు దైవ వైద్యులందరూ తనమీదున్న కారుణ్యంవలన ఆ కంపార్టుమెంటులో ఒక సహ ప్రయాణికుడుగా తనకి దర్శనమిచ్చారని అతను మురిసిపోయారు. శాస్త్రిగారంటే మర్యాద, వినయం బాగాపెరిగిపోయాయి.
“ఇంతకీ నేను డాక్టరు కాదు!. ” అని మళ్ళీ అన్నారు శాస్త్రి. “ఏదీ, నాకు వయస్సు ఎంత అని చెప్పండి, చూద్దాం!”
‘సూపరింటు’ ఆశ్చర్యపడుతూనే నవ్వారు. మరేం అనక ఊరుకున్నారు.
“చెప్పండి. విందాం. ”
“యాభై. ?”
“యాభై అంటున్నారా? నాకు షష్ఠి కళ్యాణం జరిగి ఎనిమిది సంవత్సరాలైపోయాయంటే నమ్ముతారా. ”
“అరవై ఎనిమిదా? మీకా?”
అతని వీపుని చూస్తున్న నేనూ నమ్మలేకున్నాను.
“అవును. నా పెద్దమ్మాయికే ఇప్పుడు నలభైయైదు నిండాయి. దాని కొడుకు మొన్ననే Accounts Officer గా పనిలో చేరాడు. నా పెద్దబ్బాయికి నలభై నిండాయి. మీరు ఎమాత్రం కాదు. నన్ను చూసినవాళ్ళందరూ ఇలాగే ఆశ్చర్యపడుతూంటారు.”
అతన్ని అలాగే ఒక నిమిషం చూస్తూ ‘సూపరింటు’ నవ్వుతూ అన్నారు: “మీరందరూ పాతకాలపు మనుషులు. ”
“ఏమంటున్నారు మీరు? అది ఈ రోజుల్లోనూ సాధ్యం. ” ఉన్నట్టుండి కంఠధ్వని తగ్గించి గోవింద శాస్త్రి ఇంగ్లీషులో మాటాడారు: “రహస్యమేమిటో తెలుసా? మా ఎనిమిదవ సంతానంతో నేను మా ఆవిడని చూసాను. ‘ఇక మనకి వద్దు, సరేనా?’ అని అడిగాను. ‘సరే’ అంది. అంతే, దానితో మేం మానుకున్నాం. అప్పుడు నాకు ముప్పైయెనిమిది నిండాయి. ”
“అలాగా?”
“అవును. మా అమ్మా, నాన్నా చేసిన తప్పు నేను తెలుసుకున్నాను. నాకు పదిహేనేళ్ళో పెళ్ళిచేసారు, అదే చెప్తున్నాను. నా అబ్బాయిలకి ముప్పైయేళ్ళ తరువాతే పెళ్ళి. అమ్మాయిలకి ఇరవైరెండు నిండాలి, అదే నా ప్లాను. మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. ‘ఇదేంట్రా, ఇతనేమో కరివేపాకు పులుసు గురించి ముసలమ్మలాగ మాటాడుతున్నారు, కాని ఇంకొక పక్క చాలా ultra గా కనిపిస్తున్నారే?, అని. అవునా?”
“అవును, నిజం. హి హి హి. ”
“అందువలనే కదా మా వియ్యంకుల్లో ఒకతను నన్ను అక్బర్ శాస్త్రి అని పిలవడం ఆరంభించారు? ‘ఏం, ఎందుకు?’ అని అడిగాను. ‘అక్బర్ చక్రవర్తి ఎలా ఉండేవాడని మీకు తెలుసుకదా? ప్రపంచంలో ఉన్న శ్రేష్ఠతలన్నీ తనలో కూడబెట్టుకొని అతను జీవించాడు. మీరూ అలాగే ఉన్నారు’, అన్నారు అతను. నేను అమ్మాయిలకి పెళ్ళిచేసాను, అబ్బాయిలకి పెళ్ళిచేసాను, కాని పెళ్ళి ఊరేగింపులు ఆపేసాను. ఆ రోజుల్లో పిల్లలకి పదేళ్ళలో పెళ్ళిచేసేవారు. దృష్టికని పిల్లలకి ఊరేగింపు ఏర్పాటు చేసారు. ఇప్పుడు పెళ్ళికొడుక్కికి 35, పెళ్ళికూతురుకి 25. మరెందుకు ఊరేగింపు? మా రెండవ అమ్మాయి పెళ్ళి సమయంలో ఒక ముసలావిడ వచ్చింది. ‘ఏమిటయ్యా, ఈ పెళ్ళిలో ఊరేగింపు లేదని విన్నాను. ఏం, ఎందుకు?’ అని అడిగింది. ‘ఊరేగింపా? కావాలంటే నీకని ప్రత్యేకంగా నాలుగు వీధుల్లో ఊరేగింపు ఏర్పాటు చేస్తాను. నువ్వు రెడీయా?’ అని అడిగాను. అంతే, ఆవిడ నోరు మూసుకుంది. మన తాత ముత్తాతలు చేసినవన్నీ మనం చెయ్యాలంటే ఎలాగ? రోజులు మారుతున్నాయి, మన బుద్ధీ మారాలి, అవునా?ఒక ఉదాహరణ వినండి. మగవాళ్ళు భోజనం చేసినతరువాతే ఆడవాళ్ళు భోజనం చెయ్యాలని చాలామందికి ఒక నియమం ఉంది. అది ఏ శాస్త్రంలో రాసిపెట్టారు? నీకన్నీ వడ్డించి మిగిలివున్న ఆ తునకలు, పిసరు ఆడవాళ్ళు తినాలా? ఇదేం న్యాయం?
మా ఇంటిలో అలవాటు మీకు తెలుసా? నేనూ నా భార్య కలిసే భోంచేస్తాం. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే, నేను పిల్లలందరినీ కూర్చుండబెట్టుకొని భోజనం చేస్తాను. వచ్చినతని భార్యని మా ఆవిడతో కలిసి భోజనం చెయ్యమంటాను.
కుంబకోణంలో మా మూడవ వియ్యంకులున్నారు. అతను బట్టల వ్యాపారం చేస్తున్నారు. చక్రపాణి అయ్యరని పేరు. నేనిలాగ ఉన్నానని తెలిసి అతను నాగురించి ఏమిటో ఎగతాళిగా అన్నారట.
నేను అతనికి కరారుగా చెప్పేసాను: ‘చూడండి సార్, నేను మీ ఇంటికి వస్తే మీరలాగే చెయ్యాలి. లేకపోతే నేను మీ ఇంటికి రానేరాను!’ ఆఖరికి అతనూ 'సరే' అన్నారు.
నాగురించి ఎవరేమన్నా నాకు లెక్కలేదు. నాకు ఏ భయమూ లేదు.
ముప్పైయెనిమిదేళ్ళ తరువాత నేనెలాగ ఉన్నానని నాకు తెలుసు. నలుగురుతో కలిసి, భోంచేసి, ముచ్చటలాడుతూ, నవ్వుతూ సంతోషంగా రోజులు గడపడం నాకు ఎంత హాయిగా ఉంది! అది సాధ్యం కాకపోతే మరెందుకీ బ్రతుకు? ఎవరేమన్నా అదే నా లక్ష్యం. అలాగే ఉంటున్నాను. అందుకే నాకు అరవైయెనిమిది నిండాయంటే మీకు వింతగా ఉంది.
నేను మాత్రం కాదయ్యా. నా భార్యా, పిల్లలూ ఇలాగే ఉంటారు. డాక్టరుకని నేను ఒక దమ్మిడికూడా ఖర్చు చెయ్యలేదు. ఒట్టు పెట్టమంటావా?” అని అడిగారు శాస్త్రి.
‘అదేం వద్దు!’ అని నేనుకూడా అనుకున్నాను. అతన్ని చూస్తే చాలు. అతను నన్ను చూడకపోతేనేం, నాతో మాటాడకపోతేనేం, దాని గురించి నాకు ఏ అగత్యమూ లేదు. ఈ వయస్సులో ఇంత బిగువైన వీపు. కంచు మోగుతున్నట్టు కంఠధ్వని. డాక్టరుకి రవంత ధాన్యం ఇవ్వని పొలాలకి ఇతను అధిపతి. మరేం కావాలి?
వీళ్ళందరి మధ్యా అక్బర్ శాస్త్రి అర చేయి చొక్కాయి, పంచె ధరించిన ఒక సిద్ధదేవుడులాగ కూర్చొనివున్నారు.
అతని వెనుక నా కడుపునొప్పి - మూడు సంవత్సరాలుగా నేనూ, నా భార్య, రాత్రివేళ నిద్ర రాకుండా దగ్గుతూ పడుతున్నవేదన గురించి అతనికి చెప్పాలని నన్ను పురికొల్పుతోంది. నేనూ ‘చెప్తానులే, చెప్తానులే’ అని నాలో అనుకుంటున్నాను.
కాని, ఉన్నట్టుండి ఎలా చెప్పడం? ముందు అతనితో రెండు మాటలైనా మాటాడాలి. సమయం తప్పక దొరుకుతుందని నేను కాచుకొనివున్నాను.
“ఎప్పుడైనా మదురై వచ్చారంటే మా ఇంటికి రండి. ధృడగాత్రమంటే ఏమిటో మీకు బోధపడుతుంది. డాక్టరుని పిలవకుండా ఎలా బతకడమని తెలుసుకుంటారు. భయం వద్దు. వస్తారా?” అని ‘సూపరింటు’ని శాస్త్రి అడిగారు.
“తప్పకుండా వస్తానండి.”
“మీ ఆవిడతో రండి.”
నాకూ అక్బర్ శాస్త్రి ఇంటికి వెళ్ళాలని ఉంది. కాని అతను పిలవలేదే? అకస్మాత్తుగా కూడా అతను నా పక్క తిరిగి చూడరేమో అనిపించింది. నేనతనికి జాగా ఇవ్వలేదని కోపమా?
తిరువిడైమరుదూర్ స్టేషన్ వచ్చింది. “ఈ ఊరు పొగడ పువ్వులకి ప్రసిద్ధికదూ?” అని అంటూ అక్బర్ శాస్త్రి లేచారు. కిటికీ దగ్గర వెళ్ళి నిలబడి పిలిచారు.
అతనికి కంఠధ్వనిలో బడలిక వచ్చేసింది. పిల్లల పక్కన కూర్చున్నారు. ‘సార్!’ అని పిలవకుండా చేయితో సైగ చేస్తూ నన్ను పిలిచారు. ఆతని కళ్ళుచూసి,
ఆందోళనగా నేను పరుగెత్తుకొని వెళ్ళాను. “నా గుండెని రుద్దండి!” అని సైగ చేసారు. నేను హడావిడిగా షర్టు గుండీలు విప్పి అతని గుండె రుద్దాను.
“కుంబకోణంలో. .” అతను మరేం అనలేకపోయారు.
“కుంబకోణంలో ఏంటి?”
“చక్ర. చక్ర. చక్ర. ”
మరేం అనక అతను అలాగే వాలారు. పిల్లవాడి చేయి అతని వీపుకి, కిటికీకి మద్య చిక్కుకుంది. పిల్లవాడు చేయిని లాగ్గున్నాడు.
“ఏమైంది సార్?” అని సూపరింటు లేచి వచ్చారు. “గోవింద శాస్త్రి. గోవింద శాస్త్రి . ” అని అతను బిగ్గరగా రెండుసార్లు పిలిచారు.
అతని భార్య లేచి, కళ్ళు తెరిచి, ఏమైందో తెలుసుకుంది. కూర్చొని “ఏయ్ కిచ్చా, గౌరీ - ఇలా రండి,” అని పిల్లల్ని తన దగ్గరకి పిలిచింది.
నేను గుండెని రుద్దుతూనే ఉన్నాను.
“ఏమైంది సార్?”అని ‘సూపరింటు’ ఉలికిపడ్డారు.
నేను ముక్కు వద్ద వేలు పెట్టి చూసాను.
“ఏమైంది సార్?”
“కుంబకోణంలో అతని వియ్యంకుల పేరు ఏమని చెప్పారు?”
“చక్రపాణి అయ్యర్. బట్టల వ్యాపారం అని అన్నారు”.
“మీరు వెళ్ళి స్టేషన్ మాస్టర్ ని కలుసుకోండి. చక్రపాణి అయ్యర్ కుంబకోణం స్టేషన్ కి రమ్మని ఒక message ఇవ్వాలని చెప్పాలి.”
“ఎందుకు? ఏమైంది?”
“ఏమీ లేదు.”
“అంటే?”
అతని భార్య దగ్గరకి వచ్చింది. “అయ్యో, భగవంతుడా!” అని అంటూ శాస్త్రిని చూసింది.
“ఏమైంది?” అని ‘సూపరింటు’ మళ్ళీ అడిగారు.
డాక్టరు సాయం లేకుండానే అక్బర్ శాస్త్రి మానవుడు చేసే ఆఖరి పని తనే పూర్తి చేసేసారని అతనికి అర్ధం కాలేదు.
******