top of page

కథా​ మధురాలు

        అహల్య అంతరంగం.     

 

గిరిజా హరి కరణం

girija hari.PNG

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

బ్రహ్మదేవుని భవనం.

ఆ భవన ప్రాంగణంలో నున్న తామర కొలను గట్టున చలువరాతి అరుగుపై కూర్చుంది అహల్య.

వుదయించిన బాల భానుడు ఆమె అందానికి ముగ్ధుడై పచ్చని కాంతిని పుప్పొడిలా మెత్తగా ఆమెపై జల్లుతున్నాడు.

 

చుట్టూ పరుచుకున్న జలతారు అంచు పరికిణీ మధ్యన మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టి కూర్చుంది అహల్య.

 

ఆమె బ్రహ్మ మానస పుత్రిక. పాల కడలిలో పుట్టిన అమృతాన్ని దేవదానవులకు పంచుటకై విష్ణుమూర్తి మోహినీస్వరూపం దాల్చాడు. లోకంలోని సర్వులూ మోహినివంటి మహాసౌందర్యరాశి సృష్టిలోనే లేదన్నారు. అప్పుడు బ్రహ్మ తన అపూర్వ సృష్టిని అందరూ చిన్నబుచ్చినట్లుగా భావించి పౌరుషంతో మోహినియంతటి అందగత్తెను సృష్టించాలని తలపెట్టి, అహల్యను సృష్టించాడు. అందుకే మోహినిరూపానికి ధీటయిన సౌందర్యం అహల్యలో.

 

అలా ఆ పాలరాతి అరుగుపై కూర్చున్న అహల్య, పాలకడలిలో వుద్భవించిన లక్ష్మీదేవిలా, చందన శీతల చంద్రకళలా వుంది. ఆమె ముఖంలో అసహనం కనిపిస్తూంది, విరిసిన తామరల వంక తదేకంగా చూస్తోంది. 

అహల్య ప్రతి దినం సాయంత్రం తన చెలులతో కలిసి ఆడుకుంటుంది. అప్పుడేమో తామరమొగ్గలు కొలనులో ఆకుల మధ్యన యెక్కుపెట్టిన బాణాల్లా నిలబడి వుంటాయి. తెల్లవారగానే పరుగెత్తి వచ్చిచూస్తేనేమో విచ్చిన కమలాలు కొలనంతా పరుచుకుని వుంటాయి. అవి యెలా వికసిస్తాయో చూడాలన్నది అహల్య కోరిక.

 

ఆ రోజున చెలులందరితో సమాలోచన చేసింది. ఆ రాత్రి తెల్లవారక ముందే వచ్చి పద్మాలు వికసించడం చూడాలి అని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి అతి కష్టమ్మీద నిద్రనాపుకుని చివరికెలాగైతేనేం చెలులందరూ కొలను గట్టుమీద చేరారు. అర్ధరాత్రి గడిచాక, చీకటిగా వుండటంవల్ల యేమీ కనిపించడంలేదు. గుంపుగా కూర్చుని గుస గుసగా కబుర్లాడుకుంటూ కొలనువైపే దృష్టి వుంచి కూర్చున్నారందరూ.

 

దేవేంద్రుడు తన ఐరావతముపైనెక్కి ఆకాశయానం చేస్తూ కొలనుగట్టున కూర్చున్న కన్య లను చూసి దిగి వచ్చాడు. అహల్య అందానికి పరవశుడైనాడు. తనతో ఆకాశవిహారానికి ఆమెనాహ్వానించాడు. 

సౌష్ఠవ శరీరుడై వజ్రాభరణాలతో ధగద్ధగాయమానంగా మెరిసిపోతున్న యింద్రుని చూసి మనసు పడింది అహల్య "మా తండ్రిగారి అనుమతి కావాలి" అంది సిగ్గుతో.  మైమరచి చూస్తున్న దేవేంద్రుడి చూపులు తప్పించుకోవటానికి చెలుల వెనక నిలబడింది నునుసిగ్గుతో తలవంచుకుని.

 

“దేవకన్యలూ అప్సరసలూ నేను పిలవడమే మహా భాగ్యమనుకుంటారట.  సరే, మీ తండ్రి అనుమతితో నేను నిన్నువివాహం చేసుకుంటాను" అంటూ ఆమెలో నాటిన చూపులతూపులను బలవంతాన పెరికి వెనుతిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు ఇంద్రుడు.

 

వెళ్ళాడే కానీ అతని మనసు అహల్య పైనుండి మళ్ళడం లేదు. దేవతలందరితో కలిసి బ్రహ్మకొలువుకు వెళ్ళి అహల్యను తనకిచ్చి వివాహం జరిపించమని అడిగాడు.

చతుర్ముఖునికి అది నచ్చలేదు. శరీర సౌందర్యమూ బలదర్పాలూ కాక తపశ్శక్తీ జ్ఞానసంపదా వున్నవానికే తన పుత్రికనివ్వాలన్నది ఆయన కోరిక. కానీ దేవేంద్రుడే స్వయంగా వచ్చి కన్యనిమ్మని అడిగితే కాదనలేక వొక వుపాయం ఆలోచించాడు యిలా అన్నాడు.

 

"మహేంద్రా! భూ ప్రదక్షిణం చేసి యెవరు ముందుగా వస్తారో వాళ్ళకు నా బిడ్డనివ్వాలని నియమం పెట్టుకున్నాను. అహల్యను కోరుకొనే వరులందరూ భూ ప్రదక్షిణం చేసి రావలిసిందని ప్రకటిస్తాను" అన్నాడు.

 

ఆ ప్రకారంగా నిర్ధేశించిన సమయానికి అందరూ భూమిని చుట్టిరావటానికి బయల్దేరారు. జరిగిన విషయం తండ్రి శారదామాతతో చెపుతుండగా విన్నది అహల్య. ఆమె మనసులో కలవరం బయలుదేరింది. తండ్రి గారి అభిప్రాయంతో యేకీభవించలేకపోతూంది. వరునిలో వధువు కోరుకొనేవి విజ్ఞానమూ తపస్సూ మాత్రమేనా, అందమూ బలమూ అక్కరలేదా? నేనేమి కోరుకుంటున్నానని అడగరే? యీ విధమైన తలపులతో అహల్య తలమునకలౌతున్నది. ఆమె మనసు ఇంద్రుడు పోటీలో గెలవాలని ఆశిస్తూ యెదురుచూస్తూంది ఆత్రుతగా. 

 

బ్రహ్మ గారు తన పుత్రిక నివ్వటానికి పెట్టిన షరతును అక్కడేవున్న గౌతముడు విన్నాడు. తన ఆశ్రమంలో వున్న గోమాతను పూజించి భక్తితో ప్రదక్షిణం చేసి బ్రహ్మవద్దకు వచ్చాడు.

“మహాత్మా! గోమాత ప్రదక్షిణ,భూమాత ప్రదక్షిణం కంటే గొప్పది కదా! అందుకే,నేను గోప్రదక్షిణ చేసి వచ్చాను అన్నాడు.

భూప్రదక్షిణ చేసి దేవతలు తిరిగి వచ్చే సరికి అహల్యా గౌతముల కళ్యాణం జరిగిపోయింది.

అడవిలోని గౌతముని పర్ణశాలకు అహల్య కాపురానికి వెళ్ళి పోయింది.

ఇంద్రుడు అహల్య దక్కలేదన్న కోపంతో రగిలిపోతున్నాడు.

 

గౌతముని తపోబలాన్ని నాశనం చేయాలని సంకల్పించాడు. వొకనాటి తెల్లవారుఝామున గౌతముడు నదికి వెళ్ళిన సమయంలో గౌతముని రూపంలో ఆశ్రమంలో ప్రవేశించాడు. చూడగానే అతడు గౌతముడు కాదని అహల్య తెలుసుకుంది.

 

అతడామెను కోరినాడు "నేను కన్యగా నిన్ను వలచి  వుండవచ్చు. యిప్పుడు నేను గృహిణీధర్మంలో వున్నాను. పతివ్రతనైన నన్ను యీ విధంగా నీవు అవమానించరాదు. నేనెన్నటికీ నా ధర్మాన్ని తప్పను" అని హితవు చెప్పింది. యింతలో స్నానానికి వెళ్ళిన గౌతముడు తిరిగి వచ్చాడు. తన రూపంలో వున్నఇంద్రుని చూచి భగ్గుమన్నాడు. శపించాడు. ఆ క్రోధాన్నిఆపుకోలేక తాను నిరపరాధినని అహల్య చెప్తున్నా వినిపించుకోకుండా ఆమెనూ శపించాడు.

కొంతసేపటికి అహల్య చెప్పిన నిజాన్ని గ్రహించి శాంతించి పశ్చాత్తాపంతో యిలా అన్నాడు "నేను నా శాపాన్నివెనక్కి తీసుకోలేను. ఒకనాడిక్కడికి భగవత్స్వరూపుడైన  వొక మహా పురుషుడు వస్తాడు. ఆ మహాత్ముని పవిత్ర పాదధూళితో నీ శాపం తొలగిపోతుంది” అనిచెప్పాడు.

 

కోపం వలన తాను కోల్పోయిన తపశ్శక్తిని తిరిగి పెంపొదించుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు.

అహల్యని ఆతని శాపం నివ్వెరపరిచింది. అసలు శాపమేమిటో బోధపడింది. సృష్టిలో సౌశీల్యమూ ఓ బాధ్యతే. స్త్రీకైనా, పురుషునికైననూ.  సత్సంతానాన్ని తన గర్భంలో వహించి సుఫలం చేసి జాతికవసరమైన,సుబలులై సజ్జనులను యేర్పరచటాన్నే పవిత్ర కార్యంలా భావించే తనలాంటి  స్త్రీ మనసు శరీరం కూడా సుశీలంగా వుండటాన్ని కోరుకుంటుంది. అందుకవసరమైన రక్షణను, గౌరవాన్ని అవసరపడితే పురుషుడామెకు కల్పించాలి. అంతేకానీ ఆధిక్యభావంతో శిక్షించుటకు అతనికి హక్కు లేదు. కానీ, జరుగుతున్నది రక్షణ కాదు. తండ్రికూడా ఆనాడు ఆమె వివాహ విషయంలో అహల్య అంతరంగాన్ని తెలుసుకోలేదు. కట్టుకున్నవాడు, తొలిప్రేమను పంచుకున్నవాడు కూడా ఆమె మనసును ఛిద్రం చేశారు.

 

నిర్దోషియైకూడా శిక్షించబడిన అహల్య హృదయం కరుడుకట్టి రాయిలా మారింది. 

ధూళి ధూసరితయై నిశ్చలంగా ఆ ఆశ్రమంలో పడివుంది. 

 

రాజర్షి యైన జనకుని, ఆయన వద్దనున్న మహా శివధనువును చూచుటకై విశ్వామిత్రుని వెంట మిథిలానగరానికి వస్తున్నాడు దాశరధి. నగర పొలిమేరల్లో వొక పాడుపడిన పర్ణశాలను  చూచి రామలక్ష్మణులు ఆ ఆశ్రమం యెందుకలా వుందని అడిగారు.

విశ్వామిత్రుడు కారణం చెప్పి పర్ణశాలలోనికి వెళ్ళమని కోరగా పర్ణశాలలో ప్రవేశించాడు రామభద్రుడు.  అతని వునికి సోకి  రాయిలా పడున్న అహల్య శరీరంలో చిన్న కదలిక.

శ్రీ రాముడు భక్తితో ఆమె పాదాలు తాకి "మాతా!" అని సంబోధిస్తూ నమస్కరించాడు. సపర్యలు చేశాడు. ఆమె శాపం తొలగింది. నిర్వేదాన్ని తొలగించుకుంది. స్వయంగా కదిలింది. మనుషులలో పడింది. అహల్య స్పందనతో, సహజ సౌందర్యంతో ఆశ్రమం పల్లవించింది. గౌతముడు తిరిగివచ్చాడు. కరిగిన అహల్యను కలిసి, తప్పిదాన్ని మన్నించమన్నాడు.

 

శ్రీ విశ్వనాధ సత్య నారాయణగారు రామాయణ కల్ప వృక్షం లో అహల్య శాప విమోచనం రాస్తూ యిలా మనోజ్ఞంగా నుతించారు .

              

           ప్రభు మేనిపై గాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చె

          ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగె

          ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన యశ్మంబు ఘ్రాణేంద్రియమంబుచెందె

          ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు గనవచ్చి రాతికి కనులు గలిగె

          ఆప్రభుండు వచ్చి ఆతిధ్యమును స్వీకరించినంత వుపల హ్రుదయ వీధి

        నుపనిషద్వితానమొలికి శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచు తోచె !

                      || శ్రీ రామ జయం ||

 

                       *****

bottom of page