top of page

కథా​ మధురాలు

అజ్ఞేయవాది?

 

- నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్)

nirmaladitya_edited.jpg

"నేను ఓ గుడి కట్టాల్సి వచ్చింది!" అంది కిరణ్మయి.

 

"కిరణ్మయి. డాక్టర్ కిరణ్మయి! నువ్వేంటి, గుడి కట్టడం ఏమిటి?" అన్నాను నేను,  నా గొంతులోని వెటకారం ఏమాత్రం దాచకుండా.

 

"నేనో అజ్ఞేయవాదినే. అగ్నోస్టిక్. కానీ, నేను గుడి కట్టింది నిజమేనే.  జాహ్నవి, పిల్లలు కనేందుకని వైద్యం కోసం నువ్వు పంపావని వచ్చింది. నేను నాకు తెలిసిన విద్యలన్నీ ప్రయోగించి,ప్రయత్నించాను. విఫలమయ్యాను. అందుకే గుడి కట్టడమే శరణ్యమనుకున్నాను.థట్ ఈజ్ ది బాటమ్ లైన్."

 

కిరణ్మయి, నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. అమెరికాకు దాదాపు ఒకే సారి వచ్చినా, మా భాగ్య రేఖలమీది ప్రయాణం ఒకటే వేగంలో జరుగలేదు.  నేను పైకి చూపెట్టకపోయినా, అదో చిన్న అసంతృప్తి ఉంది నాకు. ఎంత దాచుకుందాం అనుకున్నా, అప్పుడప్పుడు నా వెటకారం లో బయట పడుతూనే ఉంటుంది. 

 

నేను ఇంజినీరింగ్ లో పి.హెచ్. డి. చేసి యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేరాను. ఆ యూనివర్సిటీలో తరువాత టెన్యూర్ దొరకడంతో నా లైఫ్ సెటిల్ అయిపోయింది. 

 

కిరణ్ మెడికల్ కాలేజీ లో చదివి, ఈ దేశంలో రెసిడెన్సీ చేసి డాక్టర్ గా స్థిర పడింది. కిరణ్ హాస్పిటల్ సెట్టింగ్ లో ఇమడలేకపోయి, సొంతంగా క్లినిక్ పెట్టడం, వచ్చిన డబ్బుతో ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మొదలు పెట్టడం, అటు తరువాత మరిన్ని బిజినెస్ లు మొదలు పెట్టడం తో చాలా డబ్బులు సంపాదించేసింది.  ఇక్కడ తను కట్టించిన మెడికల్ కాలేజీ కి అనుబంధంగా  ఇండియా లోనూ ఓ మెడికల్ కాలేజి, హాస్పిటల్ మొదలెట్టింది. రెండు దేశాల నుంచి మంచి సంపాదన. ఏమి చేయాలో తెలియని పరిస్థితి లో బీచ్ పక్కన్న ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ కట్టి, అందులోనూ డబ్బులు విరగబూయిస్తున్నది.  

 

ఇప్పుడు మేమిద్దరం ఆ రిసార్ట్ లోనే టెర్రెస్ పైన కూర్చుని అప్పెటైజర్లు, డ్రింక్స్ సేవిస్తున్నాము. ఇదో అలవాటు. ప్రతీ శుక్రవారం సాయంత్రం ఐదుకల్లా మేమిద్దరం ఎన్ని పనులు ఉన్నా, అవి ప్రక్కన బెట్టి ఎక్కడో ఓ బార్ లో కలిసి ఓ డ్రింక్ తాగుతూ, కబుర్లు చెప్పుకుంటాము. కిరణ్మయి కొత్త రిసార్ట్ కట్టిన తరువాత ఇద్దరమూ ఇక్కడే కలుస్తున్నాము. మాకోసమని ప్రత్యేకంగా ఓ టేబిల్ కూడా కేటాయించి ఉంచింది కిరణ్మయి. 

 

బాల్య సఖి తో మాట్లాడుతూ, మిచెలిన్ రేటెడ్ రెస్టారెంట్లో సూషి తింటూ, మాకంటూ ప్రత్యేకంగా చేసిన కాక్టెయిల్ త్రాగుతూ, సూర్యుడు అస్తమించడం  చూడటం ఎంత ఆనందంగా ఉంటుందో నేను చెప్పలేను. ఎదురుగా ఆకాశం ఇంకా నీలంగానే ఉంది. ఆకాశం బుగ్గలకు బ్లషర్, పెదాలకు లిప్స్టిక్ రాసి సూర్యున్ని పార్టీకి పిలవడానికి ఇంకా సమయం ఉంది. సముద్రం ఇంకా నీలంగా ఉంది. సముద్రాన్ని చూస్తూంటే, మళ్లీ జాహ్నవి గుర్తుకు వచ్చింది.

 

***

 

సముద్ర తీరంలో ఉండడం లోని ఆనందం, అది అనుభవించిన వారికే తెలుస్తుంది. జీవితంలో నేను నివసించిన నగరాలన్నీ సముద్రం పక్కన ఉండడం నా అదృష్టం. అందమైన ప్రకృతి, ఫ్రెష్ సీ ఫుడ్ తో బాటు, సముద్ర విహారానికి ఈ నగరాలలో క్రూయిజ్ ఓడలు ఉంటాయి. మామూలుగా మనం ఓ హోటల్ కు పెట్టే ఖర్చులోనే విందు భోజనాలు, వినోదం, విహార యాత్రలు, వింత దేశాల సందర్శన అన్నీ దొరకడం అరుదే. అది క్రూయిజ్ వల్ల సాధ్యం. అందుకే అడపాదడపా నేను క్రూయిజ్ లో ప్రయాణం చేయడానికి మక్కువ చూపుతాను.

 

నా మొదటి క్రూయిజ్ కేప్ కేనావ్రెల్ నుండి బహమా ద్వీపాలకు.  ప్రతీ క్రూయిజ్ ఓడా ఓ నగరమే. ఓ రెండువేల చిలుకు ప్రయాణికులుంటే, అంతకంటే ఎక్కువే పనివారుంటారు. ఆ పనివారిలో ఎక్కువ మంది మన ఆసియా వాసులే. చాలామంది భారతదేశీయులు కూడా కనబడుతుంటారు. 

 

నాకు కొత్త వారితో పరిచయం చేసుకోవడం, మాట్లాడడం ఇష్టం కాబట్టి అక్కడి పనివారితో తరచు కబుర్లు వేసుకొనేదాన్ని. మన వారితో మాట్లాడేటప్పుడు ఈ సంభాషణలు మరింత సమయం తీసుకొన్నా, నాకు, వారికి ఆ పరిచయాలు ఆనందం కలిగించేవి. ప్రయాణం చేసినన్ని రోజులు వారిని పేరుతో పిలవడం, ఆప్యాయంగా మాట్లాడడంతో, వాళ్ళు నన్ను కొంత ప్రత్యేకంగా చూసేవారు.

 

పూల్ పక్కనున్న బార్లో కేరళ నుంచి వచ్చిన సందీప్, ఫోటో బూత్ లో, పడవ దిగేటప్పుడు ఎస్. ఎల్. ఆర్ కెమెరాతో నవ్వుతూ ఎదురుపడే హైదరాబాద్ నివాసి షరీఫ్, డ్యూటీ ఫ్రీ షాప్ లో పనిచేసే బీహారీ రాజ్ అందరూ బాగా ఫ్రెండ్స్ అయ్యిపోయారు. ఆసియావాసులలో ఎక్కువ మంది మగవారే కనబడేవారు. కానీ, ఓ సాయంత్రం ఫార్మల్ డైనింగ్ కని రెస్టారంట్ కి పోతే అక్కడ తటస్థపడింది, జాహ్నవి. వచ్చిన అతిథుల పేర్లు కనుక్కొని, వారికి కేటాయించిన టేబిల్ నంబర్ దగ్గరికి వారిని తీసుకెళ్ళి వారిని కూర్చో పెట్టడం తన పని. మన దేశం నుంచి అబ్బాయిలనే చూసిన నాకు జాహ్నవి కనపడటం ఆనందంగా ఉంది. పేరడిగి నా పరిచయం చేసుకున్నాను. 

 

"నా పేరు జాహ్నవి. నేను కాకినాడ నుంచి వచ్చాను," అంది జాహ్నవి తన షర్టు మీద ఉన్న నేమ్ టాగ్ చూపెడుతూ. 

 

"కాకినాడ నుంచి నాకు చాలా మంది స్నేహితులున్నారు. ఈ ఓడలో, మన దేశం నుంచి వచ్చినవాళ్ళలో, అమ్మాయివి నువ్వు ఒక్కతే ఉన్నట్లు ఉన్నావు. భయం లేదా నీకు?" అన్నాను నేను.

 

"దేనికి భయం? పడవ ప్రయాణం అనా? నేను కాకినాడ లో పెరిగాను. పడవ ప్రయాణం, సముద్రం రెండూ నాకు ఇష్టమే. ఇక ఇక్కడి పని చేసే వారందరూ మంచివారే," నవ్వుతూ అంది జాహ్నవి. 

 

మరుసటి రోజు పొద్దున్నే ఐదున్నర సమయంలో పూల్ పక్కన ఉన్న కాఫీ స్టేషన్ లో ఓ వేడి వేడి కాఫీ ఓ కప్పులో పోసుకొని, పై అంతస్తులో ఉన్న డెక్ కి వెళ్ళాను. నా భుజం మీద తగిలించిన కెమెరా బ్యాగ్ అక్కడే ఉన్న ఓ లౌంజ్ చైర్ పైన పెట్టి, నా ఎస్.ఎల్.ఆర్ కెమెరా తీసి టెలీ ఫోటో లెన్స్ అమర్చాను. సూర్యోదయానికి ఇంకా సమయం ఉంది. అక్కడే కుర్చీ లో కూలబడి కప్పులో నుంచి కాఫీ తాగుతూ, రంగులు మారుతున్న తూర్పు ఆకాశాన్ని ఫోటోలు తీయడం మొదలెట్టాను. 

 

"ఎంత అందంగా రంగులు మారుతున్నాయి కదూ" పరిచయమున్న కంఠం వినబడింది. తల తిప్పి చూస్తే జాహ్నవి. 

 

"అవును. అప్పుడే లేచావా జాహ్నవి," ఆనందంతో పలకరించాను నేను.

 

"అవునండీ. తెల్లవారే లేస్తాను. సూర్యోదయం చూడడానికే. సముద్రం మీద నుంచి సూర్యోదయం చూడడం ఎంత అందంగా ఉంటుంది. ఇంత అరుదైన అవకాశం ఉన్నా, దాదాపు ఐదు వేల పై చిలుకున్న ప్రయాణికులలో, ఓ పది మంది కూడా ఈ డెక్ పైన కనపడరు." నవ్వుతూ అంది జాహ్నవి.

 

తరువాత అరగంట జాహ్నవి తో కబుర్లు చెబుతూ, సూర్యోదయం ఫోటోలు తీస్తూ ఇట్టే గడిపేసాను.

 

టెలిఫోటో లెన్స్ తో తీయటం వల్ల సూర్యోదయం ఫోటోలు చాలా అందంగా వచ్చాయి. ప్రతీ ఫోటో పోస్టర్ గా కొట్టి అమ్మివేయవచ్చునేమో. అంత అందంగా వచ్చాయి ఫోటోలు. జాహ్నవికి కూడా ఫోటోగ్రఫీ ఇష్టం అవ్వడంతో నేను తీసిన ఫోటోలు తను చూసి, తన అభిప్రాయాలు పంచుకొనేది.

 

జాహ్నవి వల్ల తెలిసిన విషయం వారి కాంట్రాక్ట్ సామాన్యంగా 8 నెలలుంటుందని. ఈ సమయం మొత్తం ఓడలోనే గడుపుతారు. తరువాత ఆ చిన్న వెకేషన్ తీసుకొని, ఇండియాకి వెళ్లి, తిరిగి ఓడకే వచ్చి పనిలో చేరిపోతారు. అప్పుడప్పుడు పోర్టులో దిగి ప్రదేశాలు చూడగలిగినా కూడా, ఓడలో పని విపరీతంగా ఊపిరి సలపనంతగా ఉంటుంది. 'ఇంటికి డబ్బు పంపగలుగుతున్నాము, నా వారంతా దాని వల్ల ఆనందంగా ఉన్నారు'  అన్న ఒక ఆలోచన వారికి శ్రమ బడలిక నుండి సేద తీరుస్తుంది.

 

మాటల్లో జాహ్నవి తన పెళ్లి నిశ్చయమైనట్లు, పెళ్లి కొడుకు మర్చంట్ నేవీలో పని చేస్తున్నట్లు చెప్పింది. నేను తనకు బెస్ట్ విషెస్ చెప్పి అక్కడే షిప్ లో ఓ చిన్న బ్రేస్లెట్ కొని ఇచ్చాను. 

 

"అబ్బే ఇదేంటి?" అని తత్తర పడిపోయింది జాహ్నవి.

 

"చా ఆ కన్నీళ్ళేంటి. కళ్ళు తుడుచుకో," అన్నాను నేను.

 

"ఇంత మంది ప్రయాణికులు ఉన్నా, ఆప్యాయంగా పలకరించే వారు తక్కువ. చాలా మటుకు మేము కనిపించము. మీరు ఇలా పలకరించడం, తెలుగులో మాట్లాడటం నాకెంతో సంతోషమనిపిస్తున్నది. చాలా థాంక్స్," కళ్ళు తుడుచుకుంది జాహ్నవి.

 

ఆఖరి రోజు రెస్టారెంట్ లో భోజనం చేసిన తరువాత, డెసెర్ట్ తినేటప్పుడు జాహ్నవి మా టేబిల్ దగ్గరికి వచ్చి వీడ్కోలు తీసుకుంది. మరుసటి రోజు పొద్దున్నే ఓడ దిగి, పార్కింగ్ లో ఉన్న కారు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను.

 

మళ్లీ జాహ్నవిని చూడడం ఓ పదేళ్ల తరువాతే వీలు పడింది. కోవిడ్ రాకముందు సంవత్సరం టాంప నుంచి మెక్సికో లో ఉన్న కాసుమెల్ కు క్రూయిజ్ ఉందంటే, ఓ ఐదు రోజులు వెకేషన్ తీసుకొని టికెట్ బుక్ చేసాను. ఇది మరో ఓడ. కొత్తది కాబట్టి మార్పులు చేర్పులు బాగానే చేశారు. ఆరంతస్తుల ఎత్తు ఉన్న అట్రియం నాకు తెగ నచ్చింది. అక్కడ తిరుగుతూ ఉంటే మూడో అంతస్తు లోని కారిడార్ లో ఉన్న ఫోటో స్టూడియో నన్నాకర్షించింది. అటు వైపు నడుస్తుంటే ఎదురుగా జాహ్నవి. ఇద్దరం ఒకరిని ఒకరు చూసుకొని ఆగిపోయాం. జాహ్నవి లో బాగా మార్పు వచ్చింది. స్కర్ట్ కోట్ వేసుకొని ఓ మేనేజర్ లాగా ఉంది. కొద్దిగా వళ్ళు చేసినా ఆకర్షణీయంగానే ఉంది.

 

"జాహ్నవి? వాట్ ఎ సర్ప్రైజ్? ఏంటి రూట్ మార్చావు. టాంపకు, ఈ కొత్త రూట్ కి ఎప్పుడు మారావు? యు లుక్ గుడ్," నేనే జాహ్నవిని ముందు పలకరించాను.

 

"నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేనే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ట్రైనింగ్ తీసుకొని ఇలా మారాను. నాకు మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు. నా ఓడ, రూటు రెండూ మారిపోయాయి," నవ్వుతూ అంది జాహ్నవి.

 

ఫోటో సెషన్ అంటూ జనం వేచి ఉండడంతో, తరువాత కలుద్దాం అని పెద్దగా మాట్లాడకుండా వీడ్కోలు తీసుకున్నాను.

 

మరుసటి రోజు సూర్యోదయానికి నా కెమెరా, కప్ నిండా కాఫీ తో డెక్ కి వెళ్ళాను. నేను అనుకున్నట్లు అప్పటికే జాహ్నవి అక్కడుంది.

 

సూర్యుడిని ఎదురు చూద్దాం అని వెళ్లిన నాకు పున్నమి చంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంకా అందంగా వెన్నెల కాస్తున్నది. మెరిసిపోతున్న చంద్రుడు, అలా షికారుకి వెళ్తున్న పిల్ల మేఘాలు, చంద్రుని కాంతి వలన సముద్రం మీద వేసిన వెండి బాట పైన దోబూచులాట ఆడుతుంటే, అది చూసిన ఆకాశం బుగ్గలు మెల్లగా సిగ్గుతో ఎర్రబడిపోతున్నాయి.

 

ఇద్దరం మాట్లాడలేదు. నేను అప్పుడప్పుడు ఫోటోలు తీసుకుంటున్నాను.

 

"ఎంత సర్రియలిస్ట్ గా, అందంగా ఉంది కదా. నీవు తీయలేదా ఫోటోలు? నీవు ఇప్పుడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కదా?" అడిగాను నేను.

 

"అవును అందంగా ఉంది. గత ఐదు ఏళ్లుగా కార్తీక పున్నమి రాత్రుల, శరద్ రాత్రుల, మరిన్ని పున్నమి రాత్రుల ఫోటోలు చాలానే తీసాను. అన్నట్టు, ఆ కనిపిస్తున్న వెండి మార్గం మీద, కొన్ని వందల సంవత్సరాలకు ముందు, పెళ్లి అయిన యువతులు పడవల మీద ప్రయాణం చేసేవారని మీకు తెలుసా. వారంతా కాసుమెల్ ద్వీపానికి పోయే వారు," అంది జాహ్నవి

 

"ఓ,అయితే నీ ఫోటో కలెక్షన్ చూడాల్సిందే జాహ్నవీ. ఇంతకీ, ఈ యువతుల కథ ఏమిటి?," కాఫీ తాగుతూ అడిగాను నేను.

 

"మీరు మొదటి సారి కాసుమెల్ ద్వీపానికి వస్తున్నట్లున్నారు. ద్వీపంలో మాయన్ గుడి ఒకటి ఉంది. ఆ గుడి 'ఈషెల్' దేవతకోసం కట్టారు. గుడి నిర్మాణం నాలుగు ప్రాకారాలు, మండపాలు, బలి పీఠం, గర్భగుడి లతో మన హిందువులు ఆగమ శాస్త్రలకనుగుణంగా  కట్టిన గుడిలాగే ఉంటుంది. ద్వీపం ఒడ్డున  నుండి, ద్వీపం లోపల కట్టిన గుడి వరకు వేసిన శ్వేత గవ్వల బాట, గవ్వల మెరుపుతో , ఈ సముద్రం మీదున్న వెండిబాటతో కలిసిపోయినట్టుగా కనబడుతూ ఒకటే దారి లాగా అనిపిస్తుంది." ఆనందంగా ఆ గుడి అందాలు వర్ణించడం మొదలెట్టింది.

 

"అవును, ఇలాంటివి విన్నప్పుడు మన మానవులందరూ ఒకే సంస్కృతి తో మొదలెట్టి క్రమంగా దూరాభారాల వల్ల విడి పోయామనిపిస్తోంది. అయినా నువ్వు నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు," అన్నాను నేను 

 

"దానికే వస్తున్నా. ఈ ద్వీపంలో ఉన్న దేవత సంతానోత్పత్తికి మూల విరాట్టు. అందుకే మాయన్ ల కాలంలో,కెరీబియన్ ద్వీపాల నుండి, దక్షిణ అమెరికా పలు దేశాల నుండి యువతులు పెళ్లి అయిన వెంటనే, పిల్లలు కావాలని ఈ గుడికి తీర్థ యాత్రలు చేసే వారట" అంది జాహ్నవి. తన కంఠం లో జీర, బాధ. వెంటనే కళ్ళు తిప్పి జాహ్నవిని  చూసాను. తన కంట్లో నీరు.

 

వెంటనే తనను దగ్గరకు తీసుకొని, "పిచ్చి పిల్ల. ఏందుకా కన్నీళ్ళు? అంతా బాగే కదా?" జాహ్నవిని సేదతీర్చ ప్రయత్నించాను.

 

"పెళ్లి అయ్యి ఎనిమిది యేళ్ళయింది. ఇంకా పిల్లలు లేరు. ఈ కాసుమెల్ రూటు దొరికినపుడు- ఇదో అదృష్టమే. ఈషెల్ దేవత దయతో నాకు పిల్లలు పుడతారనే అనుకున్నాను. ఆ ఆశ తీరలేదు" అంది ఇంకా ఏడుస్తూనే.


 

"పిల్లలు పుట్టాలంటే నువ్వు మీ వారితో ఉండాలి కదా. నీవు ఈ పడవ మీద, మీ ఆయనేమో మర్చంట్ నేవి లో ఉంటే, అదెలా సాధ్యం," అన్నాను కొంత కవ్వింపుగా. అలాగైనా జాహ్నవి నవ్వుతుందేమో అని.

 

"అది సమస్య కాదు. మేము సంవత్సరంలో 4 నెలల దాకా సెలవు తీసుకొని ఇండియాలో కలిసే ఉంటున్నాము. ఈ పాటికి మాకు పిల్లలు పుట్టి ఉండవలసిందే." అంది జాహ్నవి.

 

"నీ బెంగంతా పిల్లల కోసమేనా? నా స్నేహితురాలే అయిన మంచి డాక్టర్ ఊశ్ లో ఇలాంటి సమస్యల తీర్చడంలో దిట్ట. తను ఈ మధ్యే ఓ హాస్పిటల్,  హైదరాబాద్ లోనూ కట్టింది. ఫెర్టిలిటీ నుంచి, ఇన్ విట్రో, ఫీటల్ మెడిసిన్, నియో నేటల్, కాంప్లెక్స్ ప్రెగ్నెన్సీలంటూ అన్నిటికీ ఓ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది. నేను తనతో మాట్లాడుతాను. ఆ సారి నువ్వు వెళ్ళి కలువు" అని సముదాయించాను. 

 

జాహ్నవి ముఖంలో కొత్త ఆశ చిగురించడం, విషాద ఛాయలు మాయమవ్వడం నాకు ఆనందం కలిగించింది. ఇది జరిగి రెండు ఏళ్ళు అయ్యింది.

 

అదే జాహ్నవి, ఫేస్ బుక్ లో పాప బొమ్మ పెట్టి తనకూ ఓ వారసురాలు జన్మించిందని పోస్ట్ పెడితే చాలా సంతోషం కలిగింది. వెంటనే కంగ్రాట్స్ అండ్ బెస్ట్ విషెస్ అని రాసాను. కిరణ్మయి చేస్తున్న సేవ ఇంత మందికి ఊరట, సంతోషం కలిగిస్తున్నందుకు మనస్సులోనే నా జోహార్లు అప్పగించుకొన్నాను.

 

ఈ సారి కిరణ్మయి ని కలిసినప్పుడు నేరుగా థాంక్స్ చెప్పాలి అనీ అనుకున్నాను. 

 

***

 

"కిరణ్మయి, జాహ్నవి నీ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంది కదా. నీ ట్రీట్మెంట్ వల్లే తనకు పాప పుట్టిందనుకున్నాను. మరి ఆవిడకి పాప పుట్టడం నీ వైద్యం వల్ల కాదంటావు ఏమిటి?," అన్నాను నేను.

 

"అవును హైదరాబాద్ లోని డాక్టర్లు నేను చెప్పిన ప్రకారమే జాహ్నవి తో పనిచేశారు. మేము వారం, వారం జూమ్ కాల్స్ లలో తన కేసు కూడా తప్పక చర్చించేవాళ్ళం. అందరికీ నా ఫ్రెండ్ గా నువ్వు రిఫర్ చేసిన కేస్ అని చెప్పేసాను. నాలుగు సార్లు ఇన్ విట్రో చేసి టెస్ట్ ట్యూబ్ బేబి కోసం ప్రయత్నించాం. అన్నీ ఫెయిల్ అయ్యాయి. మళ్లీ రెండు మూడు ఇతర ట్రీట్మెంట్ లు కూడా ప్రయత్నించాం. అన్నీ ఫెయిల్ అయ్యాయి. నీకు తెలుసా, ఇన్ విట్రో చేసినా, దాదాపు నలభై శాతం వారికి పిల్లలు పుట్టరు. అక్కడ మనకు తెలిసిన సైన్స్ నుండి సమాధానాలు లేవు.  అందుకే జాహ్నవి కి ఇక లాభం లేదని చెప్పి పంపివేసాము. ఆశ్చర్యంగా అది జరిగిన మూడు నెలల్లోనే జాహ్నవి నెల తప్పింది. కొన్ని విషయాలు సైన్స్ కి అంతుబట్టవు," అంది కిరణ్మయి.

 

"అది సరే, మరి నువ్వు గుడి కట్టే ప్రసక్తి ఎలా వచ్చింది?" అడిగాను నేను.

 

"దేవుడిని నమ్మని వారు నాస్తికులు, అతీస్ట్స్. నేనో అగ్నోస్టిక్ ని, అదే నువ్వంటున్న అజ్ఞేయవాది. దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఇక గుడి అంటావా, నేను పుట్టిన పల్లెటూరు నీకు తెలిసిందే కదా. నేను చిన్నప్పుడు ఊరికి వెళ్తే, ఊరి చివరన గ్రామ దేవతలకు కొన్ని గుళ్ళు ఉండేవి. అందులో నాకు బాగా గుర్తుండిపోయింది, ముత్యాలమ్మ గుడి. మశూచి వచ్చిన వాళ్ళు ఈ దేవతకు పొంగలి పెట్టి మొక్కుతారు. చిన్నప్పుడు కళ కళ లాడుతున్న ఈ గుడి ఇప్పుడు పూర్తిగా శిథిలమయిపోయింది," అంది కిరణ్మయి.

 

"ఎందుకంటావు. బహుశా ఊరి జనం ఊరు వదలి పట్టణాల్లో స్థిర పడటంవల్లేమో?" అన్నాను నేను.

 

"అలా అయితే ఊరిలో ఉన్న గుళ్ళు అన్నీ పాడి పడి ఉండాలి. పడలేదే. రాముల వారి గుడి, గణపతి, ఆంజనేయ స్వామి గుళ్ళు నిత్య పూజలతో, భక్తుల రాక పోకలతో బాగా నడుస్తున్నాయి," అంది కిరణ్మయి.

 

"మరి ఆ పరిస్థితికి నీ కారణాలేమిటి" కొంచెం అసహనంగానే అన్నాను నేను.

 

"నీకు గోవర్ధన గిరి కథ తెలుసు కదా. ప్రకృతి వల్ల వాటిల్లే ప్రమాదాలకు ఇంద్రాది దిక్పాలకులకు సంబంధం లేదని కృష్ణుడు ఋజువు చేసిన వెంటనే ప్రజలు వాళ్ళని దేవుళ్ళుగా కొలవడం మానేసారు. అలానే, మశూచి నిర్మూలన తరువాత ముత్యాలమ్మ అవసరం తీరిపోయింది. ఆ గుడికి పూజలు చేయడం మానేసారు. గుడి పాడైపోయింది. నా అభిప్రాయం సైన్స్ ఎప్పుడూ నిజం. తగిన ఋజువులతో పాటు పంచుకుంటుంది. తరచూ ఆ ఋజువు మన మతంలో చెప్పిన విషయంలో లేదనిపించినపుడల్లా మనం అంత వరకు నమ్మిన అంశంపై నమ్మకం సడలుతుంది." అంది కిరణ్మయి.

 

"అంటే మతం, దేవుడు అవసరం లేదంటావా?" అన్నాను నేను.

 

"అలా అంటే నేను అగ్నోస్టిక్ ఎలా అవుతాను? సైన్స్ కు అంతుబట్టని విషయాలు ఎన్నో ఉన్నాయి. అలా అర్థం కాకపోయినా, స్థిమితంగా ఉండడానికి మతం, దేవుడు అవసరమే. ఇదిగో నువ్వు పంపించిన జాహ్నవి కేసు అంతే. ఎంత ప్రయత్నించినా, మా ప్రయత్నాలకి పిల్లలు పుట్టలేదు, అటు తరువాత మేము ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే వాళ్ళకి పిల్ల పుట్టింది. నాకు అప్పుడు తట్టింది గుడి కట్టాలనే ఆలోచన. కోరికలు ఖచ్చితంగా తీరే మార్గం లేనప్పుడు గుళ్లకు, అందులో ఉండే దేవుళ్ళకు గొప్ప డిమాండే.  అందుకే మా హాస్పిటల్ ఆవరణలో వచ్చే జనాల కోసం 'సంతాన లక్ష్మి' గుడి కట్టాము. "

 

"అవును అపోలో హాస్పిటల్ వాళ్ళు మొదట చెన్నై లో హాస్పిటల్ కట్టినప్పుడు గణపతి బొమ్మ రిసెప్షన్ దగ్గరే నెలకొల్పడం గుర్తుంది. ఆ విగ్రహానికి తెగ మొక్కేవారు. మరి మీ సంతాన లక్ష్మి కి రెస్పాన్స్ ఎలా ఉంది" అడిగాను నేను.

 

"చెబితే నమ్మవు. ఆ గుడికి ఏదో మహత్యం ఉందని పేరు వచ్చేసింది. పిల్లలు కావాలని ఆ గుడికి వస్తున్న జనం, మా హాస్పిటల్ కు వచ్చే జనాలకి మించిపోయారు. ఆ గుడి కి వస్తున్న ఆదాయం ఏమి చేయాలో తెలియక, కొత్తగా ఓ ట్రస్ట్ ఆరంభించాం! అజ్ఞేయవాది ఎందుకు గుడి కట్టవచ్చునో ఇప్పుడైనా అర్థం అయ్యిందా?" అంది కిరణ్మయి నవ్వుతూ.

 

"జాహ్నవి అజ్ఞేయవాది అంటే నమ్మవచ్చేమో. తను పిల్లలకోసం యేళ్ళ కొద్దీ దేవుళ్ళ కు మొక్కడం నాకు తెలుసు. దానికి ఫలితం లేక నీ ద్వారా సైన్సును ఆశ్రయించడం తెలుసు. అదీ పనిచేయక పోవడంతో తనకు దేవుడున్నాడో లేదా అన్న సందేహం వచ్చి అజ్ఞేయవాది అయివుండవచ్చు," అంటూ నా లాజిక్ చెప్ప ప్రయత్నించాను. 

 

"అంటే నేను అజ్ఞేయవాది, కాదంటావా?" నా గొంతులో సందేహాన్ని గమనించి అడిగింది కిరణ్మయి.

 

'నీకు గుళ్ళు, గోపురాలు నచ్చవని తెలుసు.

నీవు నాస్తికురాలివి కాదనీ తెలుసు.

నువ్వో అజ్ఞేయవాదివా? మై ఫుట్.

నువ్వో అవకాశ వాదివి!

గుడిలో దేవుడి పేరు మీద డబ్బులు చేసుకొనే, గోడమీది కాపిటలిస్ట్ పిల్లివి!' అని మనస్సులోనే నేను గొణుక్కుంటూ, పైకి మాత్రం ఓ వెటకారపు చిరునవ్వు సమాధానంగా నవ్వాను. 

 

*****

bottom of page