MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
విశ్వనాథవారి విశ్వామిత్రుడు
ఎర్రాప్రగడ రామకృష్ణ
వాల్మీకి రామాయాణంలో సీతారామకల్యాణ క్రతువు పూర్తయ్యాక, దశరధాదుల వద్ద వీడ్కోలు గ్రహించి, విశ్వామిత్ర మహర్షి హిమాలయాలకు వెళ్లిపోయాడు. మిథిల నుండి మగ పెళ్లివారంతా అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో పరశురాముడు రంగప్రవేశం చేసాడు.
శివ ధనుర్భంగ విషయమై రాముడిపై పెను ఆగ్రహం ప్రకటించి, తనతో తెచ్చిన వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టవలసిందిగా నిర్భందించాడు. ఆ నెపంతో వైష్ణవ మహాతేజస్సును శ్రీరాముడికి ధారాదత్తం చేసి , తన ఆవతార భూమికకు స్వస్తి చెప్పాలన్నది పరశురాముడి ఆంతర్యం.
విశ్వనాథ సత్యనారాయణగారు ఇక్కడొక మార్పు చేశారు. రామాయణ కల్పవృక్షంలో పరశురామ గర్వభంగం సీతాకళ్యాణానికి ముందే వస్తుంది. సీతను చేపట్టేసరికే రాముణ్ణి వైష్ణవ తేజస్సు ఆవహించిన సంపూర్ణ అవతార మూర్తిగా చూపించే ప్రయత్నం ఒకటే కాకుండా.. విశ్వ ప్రణాళికకు సంబంధించిన ఒకానొక అవగాహన, తిరిగి దాన్ని రచనలో పొందుపర్చాలన్న ఒక చక్కని వ్యూహం.. ఈ మార్పు వెనుక ఉన్నాయి. ఈ వ్యూహంలో విశ్వామిత్రుడు కేంద్ర బిందువు. రాముడి విషయంలో విశ్వామిత్రుడు నిర్వహించిన పాత్ర సరిగ్గా అర్జునుడి విషయంలో శ్రీ కృష్ణుడు నిర్వహించిన తరహాది.
యాగ సంరక్షణకై శ్రీరాముణ్ణి వెంటపెట్టుకుని వెళ్ళేందుకు విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. అంతవరకు రాముడు చక్రవర్తి పెద్ద కుమారుడు. రాజంతఃపురంలో సుకుమారంగా పెరుగుతున్న అందాల రాకుమారుడు. ఆయన ఆలాగే పెరిగి పెద్దవాడయి, తండ్రి తదనంతరం నేరుగా రాజయి, పరిపాల సాగించి ఉంటే.. రాముడి కథను పారాయణం చేయవలసిన అవసరం ఈ జాతికి ఉండేది కాదు. రాముడి కథను ఈ దశలో మలుపు తిప్పినవాడు విశ్వామిత్ర మహర్షి. ఆయన ప్రమేయంతో రాముడి గమ్యం మారిపోయింది. రాకుమారుడు ప్రజల మనిషయ్యాడు. మునుల యజ్ఞకార్యాలకు రక్షకుడయ్యాడు. రాక్షస జాతి నిర్మూలన బాధ్యత తలకెత్తుకున్నాడు. అంతఃపురాలను, అయోధ్యను దాటి రాముడి స్వధర్మ నిర్వహణా పరిధి - భూమి నలు చెరగులకూ విస్తరించింది.
ఒక్కమాటలో వ్యక్తి చైతన్యం (ఇండివిడ్యువల్ కాన్షన్‌నెస్) సమిష్టి చైతన్యంగా (కలెక్టివ్ కాన్షస్‌నెస్) రూపొందింది. రాజ మందిరాలలో హాయిగా ఆటపాటలలో కాలం గడిపే ఒక రాకుమారుణ్ణి బయటకు రప్పించి, జనారణ్యాల బాట పట్టించి, రక్కసులతో శాశ్వత వైరానికి పథకం రచించి, అయోధ్య రాముడు కాలక్రమంలో అడవిరాముడయ్యేందుకు ముఖ్య కారకుడు విశ్వామిత్రుడు. ఇదంతా ఒక విశ్వ ప్రణాలిక( డివైన్ ప్లాన్) కాగా దానికి ఇరుసు విశ్వామిత్రుడు.
మహాభారతంలోనూ ఇలానే జరిగింది. అర్జునుడి విషయంలో ఇదే తరహా భూమికను స్వయంగా శ్రీకృష్ణుడే నిర్వహించాడు. నేను, నా బంధువులు. నా గురువులు. నా కోడి, నా కుంపటీ తరహా ఆలోచనలతో ఇరుకు దారుల్లోకి ప్రవేశించిన పార్ధుడి వ్యక్తి చైతన్యాన్ని గీతాప్రబోధంతో సమిష్టి చైతన్యం వైపు మళ్లించినవాడు కృష్ణభగవానుడు.
నేను" అనేది తొలగి పోవడమే ముక్త స్థితి.
ముక్త స్థితిలో నిల్చిన వ్యక్తి చైతన్యం సమిష్టి చైతన్యంగా ఎదుగుతుంది.
స్వధర్మం విస్తరించి జనహితం వైపు ప్రయాణిస్తుంది. వ్యక్తిగా తన సామర్ధ్యం ప్రకటించి శత్రువును ఓడిస్తే అది 'జయం' అవుతుంది. లోకం బాగు కోసం సాధించే గెలుపును 'విజయం' అంటారు. యుగ అవసరాలకు తగినట్లుగా సమిష్టి చైతన్యంతో శత్రువులను జయించాడు కనుకనే అర్జునుణ్ణి 'విజయుడు' అన్నారు. అటు విశ్వామిత్రుడు, ఇటు శ్రీ కృష్ణుడు.. ఇరువురి ప్రమేయంతో రామార్జునుల జీవన యానం లోకకళ్యాణం దిశగా ప్రయాణించాయి. క్షేమాన్ని కూర్చాయి.
ఇక్కడ మరో రహస్యం ఉంది. ఎప్పుడైతే ఇండివిడ్యువల్ కాన్షస్‌నెస్ విస్తరించిందో అప్పుడు విశ్వ చైతన్యం (కాస్మిక్ కాన్షస్‌నెస్) ఆసరా దానికి తప్పక లభిస్తుంది. దీన్నే ఆత్మ - మహాత్మగా ఎదిగినప్పుడు పరమాత్మ అండ లభించడంగా కూడా చెప్పుకోవచ్చు. మహాభారతంలో ద్రోణ పర్వం దీనికి తిరుగులేని సాక్ష్యం పలుకుతోంది.
ఈ సృష్టికి సంబంధించిన ఒకానొక దివ్య ప్రణాళిక లోకంలో అమలవుతున్నప్పుడు మనిషి తన స్వధర్మాన్ని దానికి అనుసంధానించుకోవాలి. అప్పుడు బయటనుండి ఎంతో సహకారం లభించి, తన సత్తాకు మించిన పనులను సాధించడం వీలవుతుంది.
కృష్ణుడి సారధ్యంలో అర్జునుడు భీకర సమరం సాగిస్తుండగా, ఒక దివ్యాకృతి త్రిశూలాన్ని ధరించి, తన ముందు నడుస్తుండటాన్ని అర్జునుడు గ్రహిస్తాడు. ఆ త్రిశూలం వేటుకు మహా యోధులు నేలకూలుతుండగా అర్జునుడి బాణాలు వారి దేహాలకు గుచ్చుకుంటున్నాయి. అంటే పరాక్రమం - ఆ దివ్యాకృతిది, కీర్తి - అర్జునుడిది! 'ఇదేమిటి' అని అర్జునుడు అడిగితే, 'నిజమే' అన్నాడు వ్యాసమహర్షి. "ఆ త్రిశూలధారి సాక్షాత్తు పరమశివుడు " అని స్పష్టం చేశాడు. "విశ్వప్రణాళిక అమలు చేసే పనిలో నీవు ఒక పనిముట్టు అయ్యావు కనుక నీకు పరమశివుడి తోడ్పాటు లభిస్తోంది" అని వ్యాసమహర్షి వివారించాడు. దేవుడి కోసమే కావచ్చు, గంధం తీసిన చేతులకు పరిమళం అంటుకోవడం సర్వసహజం. పరమేశ్వరుడి పరాక్రమ వైభవం లోకక్షేమం కోసం నడుం బిగించిన అర్జునుడి ఖాతాకు జమ పడటం అంతే సహజం.
వ్యక్తి చైతన్యం సమిష్టి చైతన్యంగా ఎదిగి, అది జాతి ప్రయోజనాలకై తపన పడుతుంటే విశ్వచైతన్యం చేయూత ఏ స్థాయిలో లభిస్తుందనడానికి ద్రోణ పర్వంలో ఈ సంఘటన గొప్ప ఉదాహరణ. ధర్మం విషయంలో లోకానికి ఉదాహరణ ప్రాయంగా నిల్చిన ధర్మరాజుకు అరణ్యవాస సమయంలో ద్రౌపదిని సైంధవుడు చెరపట్టిన వైనాన్ని ప్రకృతి ఎన్నో రకాల సూచనల రూపంలో నివేదించడాన్ని సైతం ఈ కోణంలోని మనం అర్ధం చేసుకోవచ్చు.
భారతీయ జానపద వాజ్మయంలో తోటరాముళ్ళు, జగదేక వీరులు .. ముందు సామాన్యుల వలె వుండి. దేశక్షేమం కోసమో, సమాజహితం కోసమో, ముందుకు వచ్చి తమ వ్యక్తి చైతన్యాలను విస్తరించుకుంటారు. ఆ పిదప వారికి గురు కటాక్షం, ఏదో మణిలాంటిది దొరకడం లేదా దేవతామూర్తుల దర్శనం లభించడం వంటి విశ్వచైతన్యపు ప్రమేయం లభిస్తూ వుండడం మనం ఎన్నో కథల్లో గమనించాము. ఇది ప్రకృతి సహజమైన ఒకానొక నిరంతర చర్య.
చైతన్యాలను విస్తరించడం ద్వారా పాండవులను అలా తమతమ వ్యక్తిగత పరిధుల్లోంచి సమాజహితం వైపుకు మళ్ళించినవాడు శ్రీ కృష్ణభగవానుడు. గీతాబోధ ద్వారా అర్జునుణ్ని పరిపూర్ణ యోధునిగా, ధర్మ సంస్థాపనకు ఆయుధంగా మలచినవాడాయన.
సరిగ్గా అదే పనికి విశ్వామిత్రుడు రాముడి కోసం సమకట్టాడు.
యాగ సమ్రక్షణ నెపంతో ధనుర్వేద సమస్తాన్నీ రామభద్రుడి వశం చేశాడు. రాక్షస జాతితో శాశ్వత వైరానికి పునాదులు తీశాడు. "యాగం పూర్తవ్వగానే రాముణ్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను" అని దశరథుడికి వాగ్దానం చేసినవాడు .. తీసుకెళ్ళి సీతకు అప్పగించాడు. లోకకళ్యాణం జరిపించాడు. విశ్వ ప్రణాళికకు అనుకూలంగా రాముడి స్వధర్మాన్ని అనుసంధించాడు. వ్యక్తి చైతన్యాన్ని సమిష్టి చైతన్యంగా మలచి, విశ్వ చైతన్యపు ప్రమేయానికి ముడిపడేలా చేశాడు. రామచంద్రుణ్ణి పరిపూర్ణ అవతారమూర్తిగా తీర్చిదిద్దాడు.
ఇంత గొప్ప పాత్రను నిర్వహించిన విశ్వామిత్ర మహర్షి వైష్ణవ మహాతేజస్సు రాముడిలో సంలీనమయ్యే దివ్య క్షణాలలో లేకుండా పోతే ఎలా?
వైష్ణవ తేజస్సంటే కాస్మిక్ కాన్షస్‌నెస్సే. అది రాముడి చైతన్యానికి అనుసంధానమయ్యే అపూర్వ ఘట్టంలో, రాముడు పరిపూర్ణ అవతారమూర్తిగా ఆవిర్భవించే అద్భుత క్షణాల్లో విశ్వామిత్రుడి ఉనికి లేకుండా పోవడం ఎలా?? గాధేయుడు.. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కావడం వల్లనే కదా గాయత్రి దర్శనం. గాయత్రి సైతం విశ్వచైతన్యానికి ప్రతీకే కదా. కనుక రాముడు సంపూర్ణ వైష్ణవ తేజోరాశిగా మారడం - విశ్వామిత్రుడి సమక్షంలోనే జరగాలి. అదే న్యాయం.
కాబట్టే, విశ్వనాథ సత్యనారాయణగారు 'రామయణ కల్పవృక్షం'లో విశ్వామిత్రుడు మిథిలను విడిచి వెళ్లకముందే పరశురాముణ్ని రంగంలోకి దించారు. 'గుర్తింపు దాహాలు', తపన (ఐడెంటిటీ/ఎగ్జిస్టెన్స్ క్రైసిస్)ల గురించి మానవులే తప్ప మహర్షులు పట్టించుకోరు కనుక వాల్మీకి ఈ ఘట్టంలో విశ్వామిత్రుడి ఉనికి గురించి ప్రత్యేకంగా చెప్పి ఉండకపోవచ్చు గాక, వారి పాత్రల గురించి ఆలోచించడం, గుర్తించడం, కీర్తించడం, లోకానికి వెల్లడించడం "రామాయణ భాష్యకారుల" ముఖ్య బాధ్యత. కనుక విశ్వనాథ యుగ ధర్మాన్ని తలకెత్తుకున్నారు. విశ్వామిత్రుడి సమక్షంలో విష్ణు తేజాన్ని రామాంకితం చేసి మహర్షి తేజానికి జేజేలు పలికారు. కవి అంతశ్చేతన ఒకానొక నిశ్చల ధ్యానస్థితిలో ఉండగా తపస్సిద్ధికి ఫలితంగా దిగి వచ్చిన కావ్యం కల్పవృక్షం అనదానికి ఈ సన్నివేశం మార్పు ఒక ఉదాహరణ.
*****
ఎర్రాప్రగడ రామకృష్ణ
ఎర్రాప్రగడ రామక్రిష్ణ గారు ఈనాడు ఆదివారం పత్రిక 'అంతర్యామి ' శీర్షికకి సంపాదకులుగా సాహితీబంధువులందరికీ సుపరిచితులు.
తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలోనూ, భద్రాచలం లో సీతారామకళ్యాణ మహోత్సవాల్లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించే వీరికి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఆసక్తికరంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం వెన్నతో పెట్టిన విద్య.
తెలుగు పద్యాలపై పట్టు, వాటిని పలకటంపై సాధికారత వీరి సొంతం.