MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
ఆదివాసీ సాహిత్యం - ప్రాప్యత, ప్రజాదరణ
వి.బి. సౌమ్య
ఆదివాసీ సాహిత్యం - ప్రాప్యత, ప్రజాదరణ - నా కెనడా/ఇండియా అనుభవాలు.
మనం సాహిత్యం ఎందుకు చదువుతాము?
కాలక్షేపం, రసాస్వాదన, ప్రపంచం తెలుసుకోడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి, విషయ పరిజ్ఞానానికి, స్వీయ భాష-వ్యక్తీకరణ ని పెంపొందించుకోడానికి, రీసర్చి కి - ఇలా ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. మరి మనకి కథా, కవితా, నవలా, నాటికా, వ్యాసం, ఉపన్యాస పాఠం ఇలా ఇన్ని రకాలున్నాయి చదువుకోడానికి. ఫలానా ప్రాంతం వారి యాస, గోస; ఫలానా దేశీయులవి, ఫలానా కులం, మతం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ముక్కోటి దేవతల్లా ముప్పైరెండు కోట్ల రకాలుంటాయి సాహిత్యంలో. ఇన్నింటి మధ్య-
అసలు ఏమిటి ఆదివాసీ సాహిత్యం అంటే?
ఆదివాసీల జానపద కథలూ, పాటలు, చరిత్రా - వీటిని గురించి మాట్లాడటం లేదు నేను. అలాగే, ఎందరో రచయితలు వాళ్ళ జీవితాలని దగ్గరగా గమనించి రాసిన సాహిత్యం గురించి కూడా మాట్లాడటం లేదు. మారుతున్న కాలంతో వారి జీవితాలూ మారాయి. కానీ మనకి వార్తల్లో కనబడే ఆదివాసీలు ఎప్పుడూ అమాయకులు, మోసపోయిన వాళ్ళు, ఆధునికత నాగరికత బలి పెట్టిన వాళ్ళు. ఇంతేనా? ఇంకేం లేదా? వివిధ ఆదివాసీ జాతుల జీవితాలలో ఇప్పుడు ఉన్న సాహిత్యం ఎలాంటిది? వాళ్ళేం రాస్తున్నారు? దేన్ని గురించి రాస్తున్నారు? - దీన్ని నేను ఆదివాసీ సాహిత్యం అంటున్నాను.
సరే, నాకు ఎందుకో చదవాలనిపించింది. నేను చదువుతున్నాను. కానీ, ఎవరైనా ఆదివాసీలు రాసిన సాహిత్యం ఎందుకు చదవాలి?
“ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” అని శ్రీశ్రీ ఏనాడో అన్నాడు. ఆదివాసీ అంటే మనకి వార్తల్లో కనబడే కథలు అలాంటి పీడితులవే చాలామటుకు. వారిని దగ్గరగా చూసిన వారు రాసిన కథలు, కథనాలూ కొన్ని ఉన్నా వీటిలో మనకి కనబడే కోణం వేరు. “ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కన్పించని కథలన్నీ కావాలిప్పుడు!” అనీ అన్నాడు శ్రీశ్రీ పైన ప్రస్తావించిన కవితలోనే. ఆదివాసీల కథలన్నీ అలా అట్టడుగున పడినవే అనుకోవచ్చు. అందుకే బైటకొచ్చి వాళ్ళు చెబుతున్న వాళ్ళ కథలు అందరూ చదవాలని నేను అనుకుంటున్నా (ప్రస్తుతానికి). దాదాపు పదేళ్ళ క్రితం Chimamanda Ngozi Adichie అన్న నైజీరియన్ రచయిత్రి ప్రసంగం “The Danger of a Single Story” విన్నాను. ఒకే కోణం లో కథ వింటూంటే మన మీద దాని ప్రభావం ఎలా పడుతుందన్నది అందులో విషయం. ఆదివాసీల గురించి మన ఆలోచనలు ఈ ప్రమాదంలోకి పడిపోకుండా ఉండాలంటే వారి సాహిత్యం చదవాలి. డేనియల్ హెల్త్ జస్టిస్ అని ఒక కెనడియన్ ఆదివాసీ రచయిత ఉన్నాడు. ఆయన “ఆదివాసీ సాహిత్యం అంతా మనిషికి తనతో, తన వారితో, తన పూర్వీకులతో, తన భూమితో ఉన్న అనుబంధం గురించే అంటాడు. ఈ లెక్కన చూస్తే ఇదంతా మన కథే. మనలాంటి వాళ్ళ కథే కదా! అందుకు కూడా ఆదివాసీ సాహిత్యం చదవాలి.
నేనెందుకు చదవడం మొదలుపెట్టాను?
2017 లో ఒకరోజు ఒక కెనడియన్ ఆదివాసీ రచయిత రాసిన సైన్స్ ఫిక్షన్ కథలు కనబడ్డాయి. నాకు ఆ కథాంశాలు, ఆ పాత్రలు, కొత్తగా అనిపించాయి. సైన్స్ ఫిక్షన్ ఇలా కూడా రాయొచ్చా? అన్న ఆశ్చర్యంతో, అప్పట్నుంచి ఆ రచయిత (Drew Hayden Taylor) ని సోషల్ మీడియాలో వెంబడించడం మొదలుపెట్టాను. తరువాత కెనడా వచ్చాక ఒకసారి ఆయనని పుస్తకం.నెట్ వెబ్సైటు కోసం ఇంటర్వ్యూ కూడా చేశాము. అప్పట్లోనే ఒక ప్రొఫెసర్ స్నేహితురాలు ఫీల్డ్ లింగ్విస్టిక్స్ అన్న కోర్సు చెప్పేది యూనివర్సిటీలో. నేను ఆ క్లాసులన్నింటికీ ఊరికే వెళ్ళి కూర్చునే దాన్ని. అక్కడ నాకు అంతరించిపోతున్న భాషలు, సంస్కృతుల పరిరక్షణ, అధ్యయనం వంటి విషయాల గురించి కొంత తెలిసి, ఆసక్తి కలిగింది. తరువాత మరొక లింగ్విస్టు స్నేహితుడి వల్ల కొన్ని దేశీ ఆదివాసీ భాషలు - తొడ, సవర వంటి వాటి గురించి, అవి మాట్లాడే వారి జివితాల గురించి కొన్ని పుస్తకాలు చదివాను. అలాగే, కొన్ని వాళ్ళ సంప్రదాయ కథలు, పాటలు కూడా చదివాను. అయితే, ప్రస్తుతం ఆ భాషలలో సాహిత్యం ఏదీ రావట్లేదేమో అనుకున్నాను. కానీ, డ్రూ హేడెన్ టేలర్ పోస్టులు, కెనడా వచ్చాక తరుచుగా సీబీసీ వెబ్సైటులో ఇండిజినస్ రైటింగ్ పై వ్యాసాలూ చూశాక ఇక్కడో పెద్ద ఆదీవాసీ రచయితల ఉద్యమం వంటిదేదో చాలా ఏళ్ళుగా నడుస్తున్నదని అర్థమైంది. గత రెండేళ్ళలో వరసబెట్టి వివిధ కెనడియన్ ఆదివాసీ రచయితల రచనలు చదవడం మొదలుపెట్టాను. గత ఒకటి రెండేళ్ళలో కొంత దేశీ రచయితల గురించి కూడా తెలియడం మొదలైంది.
ఏమిటి ఆదివాసీ సాహిత్యం చరిత్ర?
నాకు తెలిసినంతవరకూ ఆదివాసీ సంస్కృతులలో ప్రధానంగా ఉండేది మౌఖిక సంప్రదాయమే. వారి సంస్కృతి, పద్ధతుల గురించిన కథలూ, గాథలూ అలా తరతరాలు వాళ్ళ నోళ్ళలో నానుతూ వచ్చినవే. అయితే, సమకాలీన ఆదివాసీ సాహిత్యం విషయానికొస్తే ఈ విషయంలో కాలానుగుణంగా మార్పు ఉంది.
కెనడాలో 150 ఏళ్ల క్రితం నాటి ఆదివాసీ రచనలని కూడా వెలికితీసి చర్చిస్తున్నారు ఇపుడు. కానీ ప్రధానంగా 1960-70ల నాటికి ఆంగ్లంలో రాయడం, అవి సాధారణ కెనడియన్లని చేరడం మొదలైందని చెప్పవచ్చు. Thomas King, Lee Maracle ఇలా కొందరు తొలి తరం వారు ఇంకా రాస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొత్తగా రాసి పేరు తెచ్చుకుంటున్న వారూ ఉన్నారు. పుస్తకాలే కాక, నాటకాలు, కవి సమ్మేళనాలూ ఇలాంటివి కూడా తరుచుగా జరుగుతూంటాయి. వీటికంతా పాఠకులూ, వీక్షకులూ చాలావరకు ఆదివాసీయేతరులే అని ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో Drew Hayden Taylor అన్నాడు.
ఇండియా విషయానికొస్తే 1920లలోనే సుశీలా సమద్ అన్న ఆదివాసీ రచయిత్రి ఒక పత్రికకి సంపాదకత్వం వహించిందనీ, తరువాతి కాలంలో రెండు కవితా సంకలనాలని కూడా వెలువరించిందనీ చదివాను. అలాగే, 1960లలో ఆలిస్ ఎక్కా అన్న మరొక ఆదివాసీ రచయిత్రి కూడా హిందీ లో కథలు రాసిందట. కానీ, మధ్యలో ఏం జరిగిందో సరిగ్గా నాకు అర్థం కాలేదు కానీ, వివిధ ఆదివాసీ రచయితలు ఆంగ్లం లేదా హిందీలో రాయడం అన్నది గత ఇరవై ఏళ్ళలో పెరిగిందని చెప్పవచ్చు. తెలుగులో బహుశా గత పదేళ్ళలోనే మొదలైందని అనుకోవచ్చేమో! సాహిత్య అకాడమీ బోడో, సంతాలీ భాషల్లో వచ్చే పుస్తకాలకి అవార్డులు ఇస్తుంది కనుక ఆ భాషల్లో కూడా కొంత వరకూ ఆదివాసీ రచయితలు రాస్తున్నారనుకోవచ్చు. ఇపుడు ఆదివాణి వంటి ప్రచురణ సంస్థలు ప్రత్యేకం వారి రచనల కోసమే పెట్టినందువల్ల బహుశా భవిష్యత్తులో మరిన్ని రచనలు కనిపిస్తాయని అనుకోవచ్చు.
మరి ఎక్కడున్నాయి ఇవన్నీ?
తరచి చూస్తే, అబ్బో, చాలా కథే ఉంది. చాలా పుస్తకాలున్నాయి, అనిపిస్తుంది మనకి. నిజమే. కానీ, ఎక్కడున్నాయి ఈ పుస్తకాలు?
మొదట కెనడా లో నా అనుభవం చెబుతాను. సీబీసీ అన్నది బహుశా మనకి ఆకాశవాణి/దూరదర్శన్ రెంటికీ సమానం అనుకోవచ్చు కెనడాలో. వీళ్ళకి వార్తల వెబ్సైటు కూడా ఉంది. నా ఉద్దేశ్యం ఇది mainstream media అని. ఇందులో ఏదో ఒక వారం - ఏ వారంలోనైనా - వచ్చిన సాహిత్య వ్యాసాలు చూస్తే ఒక రెండు మూడైనా ఆదివాసీ రచయితలవి ఉంటాయి. వాళ్ళ పుస్తక పరిచయాలో, వాళ్ళకొచ్చిన అవార్డులో, వాళ్ళతో ఇంటర్వ్యూలో- ఇలా ఏదో ఒకటి. అందువల్ల చదువుదాం అనుకుంటే ఎక్కువ ప్రయాస పడకుండా కథా, కవితా, వ్యాసం, ఆత్మకథ ఇలా తేడా లేకుండా అన్ని రకాలూ ఆంగ్లంలో తేలికగా అమేజాన్ లో దొరికేస్తాయి. ఆ మధ్య #HonouringIndigenousWriters అని కొన్నేళ్ళ క్రితం అమెరికా-కెనడాలలో ఒక ట్విట్టర్ ప్రచారం నడిచింది. ఇందులో ఎందరో పాశ్చాత్య ఆదివాసీ రచయితలని పరిచయం చేశారు కూడా. అందువల్ల, ఏమీ తెలియకుండా ఓ రోజు పొద్దునే లేచి “ఆదివాసీ సాహిత్యం ఏంటో నాకు కూడా చదవాలనుంది” అని ఎవరో నాలాంటి సంబంధం లేని చదువరి అనుకుంటే, ఏదన్నా ఓ మంచి పుస్తకం దొరకడానికి కెనడాలో వారం కూడా పట్టదని నా అభిప్రాయం, అనుభవం కూడా!
ఇదే దేశీ ఆదివాసీ సాహిత్యం చూడాలి అనుకుంటే - మెయిన్ స్ట్రీం పత్రికలు - నేను చూసినంతలో ఎప్పుడూ ప్రత్యేకంగా రాయలేదు (ఇపుడు నేను చదవడం లేదు). Caravan, ఆదివాణి, జుబాన్ బుక్స్ వంటి వెబ్సైట్ల గురించి మనకే ఎలాగో తెలిసి, మనమే అలా వాటిని బ్రౌజ్ చేస్తూ తెలుసుకోవాల్సిందే అన్నమాట. అలా కొన్నాళ్ళు చేస్తే ఎక్కడ చూడాలో తెలుస్తుంది. కానీ, మొదట అలా వెదుక్కుంటూ వెళ్ళాలి. ఉన్న పుస్తకాల్లో కూడా ఏ పావు వంతో తప్ప ఈ బుక్స్ వెయ్యరు. అమేజాన్ లో తేలిగ్గా ప్రింటు పుస్తకాలు కూడా దొరకవు (అంతర్జాతీయ కొనుగోలుకి). రెండు దేశాల మధ్యా నేను గమనించిన ముఖ్యమైన తేడా ఇదే. లభ్యత అనేది చిన్న విషయం లా అనిపించవచ్చు కానీ, మనం చదవాలన్నా, మన సాహిత్యం బైట వాళ్ళు చదవాలన్నా ఇది చాలా ముఖ్యం.
మరొక తేడా- వస్తు వైవిధ్యం:
మనకిన్ని భాషలు ఉన్నాయి. ఇన్ని ఆదివాసీ సంస్కృతులు ఉన్నాయి. అయితే, నాకు దొరికిన కాల్పనిక సాహిత్యం మటుకు చాలామటుకు నిజంగానే వాళ్ళ జీవితంలో జరుగుతున్న దోపిడీ, వారు అనుభవిస్తున్న వ్యథల కథలు. కెనడాలో కూడా ఇదే ప్రధానమైన వస్తువు చాలా మంది రచనల్లో, నేను చదివినంతలో. అయితే, ధిక్కార స్వరం, సూటిగా తాకే వ్యంగ్యం, నవ్వించే హాస్యం, ఆగ్రహం ఇలా రకరకాల భావాలు కలిగించే రచనలు వచ్చాయి. ప్రయోగాత్మక కవిత్వం మొదలుకుని ఆదివాసీ స్పృహతో రాసిన సైన్స్ ఫిక్షన్ దాకా అలా కొత్త కొత్త రచనలు వస్తున్నాయి, వస్తూనే ఉన్నాయి. వీరి కథల్లో రోజువారీ జీవితం కనిపిస్తుంది. తరతరాల చరిత్రా కనిపిస్తుంది. బహుశా ఎక్కువ మంది రాస్తున్నందువల్ల నేమో ఈ విధమైన వైవిధ్యం సాహిత్యంలో తొందరగా లభ్యమవుతుందని అనుకుంటాను.
ఇక నేను ఇప్పటికే కొన్ని సార్లు ప్రస్తావించిన Drew Hayden Taylor ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడో క్లుప్తంగా చెప్పాలంటే - "అణిచివేయబడ్డ వాళ్ళ గొంతుక వినిపించగలిగినపుడు వాళ్ళు ఆ అణిచివేతని గురించే ప్రధానంగా చెప్పడంలో ఆశ్చర్యమేం లేదు. కానీ, మాలో కూడా మా అమ్మలాగా ధృడమైన, జీవకళ ఉట్టిపడే, హాస్యచతురత గల మనుషులున్నారు. సాహిత్యంలో వాళ్ళూ కనబడాలి. ఆదివాసీ సాహిత్యం అంటే - ప్రశ్నించాలి, పాఠకులని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటారు చాలామంది రచయితలు. కానీ, ఈ మాత్రం హాస్యం, జీవితేచ్ఛ లేకుండా ఇన్నేళ్ళ అణిచివేతని తట్టుకుని ఉండేవాళ్ళా ఆదివాసులు? అది సాహిత్యంలో కూడా కనబడాలి కదా?" - అంటాడాయన. నాకు ఆ పాయింటు చాలా నచ్చింది. మన ఆదివాసీ రచయితలు కూడా ఈ స్పృహతో రచనలు చేస్తే బాగుండనిపించింది ఈయనతో మూడేళ్ళ క్రితం మొదటి/చివరి సారి కలిసి సంభాషించినపుడు.
చివరగా నా విష్ లిస్టు ఒకటి చెప్పి ముగిస్తాను!
ఇండియాలో ఈ పరిస్థితి కొంచెం మారుతున్నట్లు, ఇపుడు కొంచెం వైవిధ్యం ఉన్న పుస్తకాలు వస్తున్నట్లూ కనిపిస్తున్నా, నిజానికి అక్కడ వస్తున్న ఆదివాసీ సాహిత్యంలో చాలా భాగం సీరియస్ వస్తువులతో సాగే కథ/కవిత/నవల చుట్టూనే తిరుగుతోందేమో అనిపిస్తోంది నేను చదివినంతలో. ఇది రావాల్సిన సాహిత్యమే అయినా, ఇవి మాత్రమే వస్తే చాలదని నా అభిప్రాయం. వాళ్ళ సంప్రదాయ పద్ధతులని మామూలుగా కనబడే రచనా పద్ధతులతో కలిపి ప్రయోగం చేయడం, ఆత్మకథలు, చరిత్రలు వంటివి రావడం జరగాలని అనుకుంటాను. అలాగే, రచయితలతో సంభాషణలు, పరిచయ కార్యక్రమాలు కూడా పెరగాలి. ఈ మధ్య ఒక తెలుగు కథలో కుయి, కొందు భాషల పాటలు చూసి ఎంతగానో మురిసిపోయి, దాన్ని మళ్ళీ ఎంతమందికి చూపించి చదివించానో. అలాంటివి మరిన్ని రావాలని నా కోరిక. అందుకే దేశీ ఆదివాసీ రచయితల కథలు ఇంగ్లీషులోకి తరుచుగా అనువాదం కావాలి. అవి దేశం దాటి బైటకి చేరాలి. ఆదివాసీ కథలంటే బయట ప్రపంచానికి మనవాళ్ళూ అనేక భాషల, సంస్కృతుల వాళ్ళు రాస్తారని తెలియాలి. ఇతర దేశాల ఆదివాసీ రచయితల కథలు కూడా మన భాషల్లోకి రావాలి. కాల్పనిక సాహిత్యం కాకుండా వ్యాసాలు, ఆత్మకథలు, జీవిత చరిత్రలు, ఇలా వైవిధ్య భరితమైన రచనలు రావాలి. ఇదీ నా పెద్ద విష్ లిస్టు ప్రస్తుతానికి!
ఈ దిశగా నా అడుగులేవో నేను వేశాను. ఒక దేశీ ఆంగ్ల ఆదివాసీ రచయిత కథని తెలుగులోకి అనువదించాను. ఒక తెలుగు ఆదివాసీ రచయిత కథని ఆంగ్లం లోనికి అనువదించాను. రెండూ ఈ వేసవిలోనే చేశాను. వీలు చిక్కి, చేయాలనిపించి, అవకాశం కూడా వస్తే, భవిష్యత్తులో కూడా ఇలాంటివి ప్రయత్నిస్తాను. కనుక ఊరికే ఎక్కడో కూర్చుని కోరికలు కోరడం, సలహాలు ఇవ్వడం చేయడంలేదని విన్నవిస్తూ, ముగిస్తాను.
(న్యూజిలాండ్ ప్రత్యక్ష వేదికగా అంతర్జాలంలో జరిగిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు - 2021 లో చేసిన ప్రసంగం నుంచి-)
*****