top of page

సంపుటి 1    సంచిక 4

'సినీ' మధురాలు

మధురవాణి ప్రత్యేకం

వి.ఎన్. ఆదిత్య

చలన చిత్ర దర్శకులు

V N Aditya

ఆదిత్య సినీ మధురాలు

ఈ వ్యాసం మొదలు పెట్టిన విధానం చూసి, ఇది నా ఆత్మ కథ అనుకునేరు… అస్సలు కాదు... ఇది ఓ వీ. ఎన్.ఆదిత్య ఆత్మ కథ కాదు… వాడి ఆత్మ లో పరమాత్మ గా కొలువై ఉన్న సినిమా కథ!

కలలందరూ కంటారు... రాత్రి  పడుకున్నప్పుడో, పగలో, ఎప్పుడో అప్పుడు... కానీ, వాటిని అమ్ముకుంటూ జీవనం సాగించాలని, అందులో వృద్ధి సాధించాలని కొందరే అనుకుంటారు... ఆ గమ్యాన్ని అందులో మరి కొందరు మాత్రమే అందుకుంటారు. కళలకి సంబంధించిన వాతావరణం లో పెరిగి, సాహిత్యంతో సాంగత్యముండి, సినిమా తీయాలని ఏడో క్లాసు నుండి  కలలు కన్న ఓ మధ్య తరగతి బ్యాంకు ఆఫీసరు మూడో కొడుకు మనసంతా నువ్వే ( 2001 ) అనే సినిమాతో అమితమైన గుర్తింపు పొందడం ప్రపంచానికి ఎలా ఉన్నా, వాడికి మాత్రం,  అంటే నాకు,  ఎప్పుడు ఆశ్చర్యమే… ఎందుకంటే వాడు సత్యజిత్ రే నో, రాజ్ కపూరో, యాష్ చోప్రా నో, మన్మోహన్ దేశాయో, హిచ్ కాకో,  సిసిలీ బీ డిమిలీసో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోపాలనో, రాఘవేంద్ర రావో, దాసరి నారాయణ రావో, కే. విశ్వనాధ్ ఓ,  కే. బాలచందరో, శ్రీధరో, అరవిందనో, బాపునో, సింగీతం శ్రీనివాస రావో, అకిరా కురసావనో, అరవిందనో, ఆదూరి గోపాల కృష్ణనో, జంధ్యాలో, విధు వినోద్ చోప్రా నో, మణి రత్నమో, జెంటిల్మన్ శంకరో, రామ్ గోపాల్ వర్మ ఓ,  అవుదాం అనుకున్నాడు గానీ, ఇవ్వాళ మనమంతా  వీ ఎన్ ఆదిత్య అని  గూగుల్ చేస్తే  వచ్చేదేదీ వాడు అవుదాం అనుకోలేదు... వాడి మీదే ఒట్టు…  ఫారెస్ట్ గంప్ లో టామ్ హాంక్స్ లాగా గాలివాటం గాడిలా ఎటు పడితే అటు పోతు ఉంటాడని వాడిక్కూడా చిన్నప్పుడు తెలీదు... అయినా వెళ్ళాడు. పరిస్థితులకి అనుగుణంగా వెళ్లిన ప్రతి వాడు ఫెయిల్ అయినట్టు కాదు… జీవితాన్ని నియంత్రించుకోగలిగిన సమర్ధుడు మాత్రమే సక్సెస్ ఆయినట్టూ కాదు... సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ వేరియబుల్ టర్మ్స్. బీరువా లో లక్ష్మి దేవి లాగా అవి కూడా ఎల్లకాలం ఒక్కరినే అంటి పెట్టుకుని ఉండవు. ఫిలాసఫీ లోనే లాస్ ఉంది. అంటే లాస్ లోంచే ఏ వేదాంతం అయినా పుడుతుంది ఎవ్వరికైనా… నాకూ అంతే... కానీ, నా ఈ వేదాంతం అంతానికి సంబంధించినది కాకుండా, వేదం లాగా పనికి రావాలన్నదే నా ఉద్దేశ్యం...

 

1974, 75 మధ్య కాలం... విశాఖ పట్నం ట్రాన్స్ఫర్ అయ్యారు మా నాన్నగారు. బీచ్  కి నాలుగడుగుల  దూరం లో మా ఇల్లు... గంగరాజు గారి మేడ అని,  ఓ పెద్ద బాదం చెట్టు ఉన్న ఇల్లు మాది. నా వయస్సు రెండున్నర ఏళ్ళు... స్కూల్లో వేశారు... రామ కృష్ణ మిషన్ వారి శారద బాల విహార్... నా జీవితం లో మొదటి స్కూలు... స్కూలు నుంచి ఇంటికి వస్తూనే బ్యాగ్  పారేసి, ఇద్దరన్నయ్యలతో, ఇంటి కింద పిల్లలతో కలిసి బీచ్ కి వెళ్లి, స్నానం చేసి, ఇంటికొచ్చి తువ్వాలుతో తుడుచుకోడం ఇంచుమించు ప్రతి రోజు దిన చర్య...  అప్పుడే,  ఇంటి బైట ఇంకో గదిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలం గారు కథలు రాసుకుంటూ ఉండేవారు… మా నాన్నకి అయన మంచి స్నేహితులు, గురుతుల్యులు అవ్వడం మూలాన వాళ్ళని కలుసుకోడానికి డా" తంబు గారు,  శ్రీ ద్విభాష్యం రాజేశ్వర రావు గారు మొదలైన ఎంతో మంది మంచి పేరున్న రచయతలు, రచయిత్రులు మా ఇంటికి తరచు వస్తుండే వారు. అక్కడుండగానే నాన్నకి స్వయానా బాబాయి గారైన శ్రీ పోలాప్రగడ సత్యన్నారాయణ గారు, పిన్ని గారైన శ్రీమతి పోలాప్రగడ రాజ్య లక్ష్మి గార్లు మా ఇంటికి అప్పుడపుడు వస్తుండే వాళ్ళు... ఇలా చుట్టూ ఎటు చూసినా సాహితీ పరిమళాలే... వీళ్లందరికన్నా నేను ఎక్కువ కనెక్ట్ అయ్యింది వైజాగ్ జగదాంబ థియేటర్ కి.

నాన్న వారానికోసారి ఈవెనింగ్ వాక్ కి తీసుకెళ్లి, జగదాంబ లో ఏదో ఒక ఓల్డ్ క్లాసిక్ / ఎపిక్ ఇంగ్లీష్ మూవీ చూపించేవారు. తిరిగి నడిచి వచ్చేటప్పుడు దారి పొడుగునా ఆ సినిమా కథ ని ట్రాన్సలేట్ చేసి తెలుగులో చెప్పే వారు.  నేను ఇంటికి రాంగానే నాకే స్వంతంగా అర్ధమయిన బిల్డప్పు తో మా అమ్మకి మొత్తం కథ చెప్పేసే వాడిని డైలాగ్ లతో సహా... అది బీజం... అక్షరాలు దిద్దే వయసులో సి,ని,మా అనే మూడు బీజాక్షరాలు  నా మనసు మీద, మెదడు మీద దిద్దుకున్న రోజులు…

టెన్ కమాండ్మెంట్స్, గాన్ విత్ ది విండ్స్, గాడ్ ఫాదర్,  మైటీ హిమాలయన్ మాన్, సౌండ్ ఆఫ్ మ్యూజిక్,  హుమానాయిడ్, బ్లాక్ హోల్, జాస్,  గన్స్ ఆఫ్ నోవెరాన్,  బెన్ హర్,  తదితర ఇంగ్లీష్ సినిమాల్తో పాటు,  షోలే,  హమ్ కిసీసే కామ్ నహీం,  లాంటి హిందీ సినిమాలు పదే పదే చూడటం,  ఇంటికొచ్చి తారీఖ్ లాగా గిటార్ పట్టుకుని,  తలకి తువ్వాలు కట్టుకుని,  క్యా హువా తేరా వాదా అంటూ పాడటం... అది చూసి మురిసిపోయిన నాన్న,  స్టేట్ బ్యాంకు స్టేట్ లెవెల్ కల్చరల్ కాంపిటీషన్స్ లో నాతో ముత్యాల ముగ్గు సినిమా లో రావు గోపాల్రావు కాంట్రాక్టర్ పాత్ర ఏక పాత్రాభినయం చేయించడం చక చకా జరిగిపోయాయి. నా మొదటి  స్టేజి అనుభవం అలా మొదలైంది. 

ప్రిపరేషన్ లో భాగంగా నాన్న నన్ను వరుసగా ఫస్ట్ షో,  పదకొండు రోజులు ముత్యాల ముగ్గు సినిమా, థియేటర్ కి తీసుకెళ్లి చూపించడం... తల్చుకుంటే ఇప్పటికీ థ్రిల్లింగ్ గా ఉంటుంది.. మా రెండో అన్నయ్య సుధాకర్ ఆ మోనో యాక్షన్ లో సెక్రటరీ రోల్ వేశాడు... యాక్టింగ్ లో భాగంగా  స్టేజి మీద వాడి చెంప నిజంగానే చెళ్లుమనిపించేసానని,  అదికూడా కావాలనే చేసానని అలిగి ఆర్నెల్లు నాతో మాట్లాడం మానేసాడు వాడు... మొత్తానికి వాణ్ణి, ఫస్ట్ ప్రైజ్ ని కూడా కొట్టేసాను... పెద్ద ప్లాస్టిక్ కూజా,  దాని మీద సేమ్ కలర్ నీళ్ల గ్లాసు. గిఫ్ట్… బ్రౌన్ కలర్ లో... చాలా బావుండేది. ఆఖరి నిముషం లో నేను తొడుక్కోవాల్సిన లాల్చీ మర్చిపోతే, అప్పటికప్పుడు మా పెద్దన్నయ్య సతీషు కొత్త ఫుల్ హాండ్స్ చొక్కా తొడిగేసారు. వాడిదైతే లూస్ గా ఉంటుందని. ఆలా మొత్తంమీద ఇద్దరన్నయ్యల కంట్రిబ్యూషన్ ఉన్నట్టు అయ్యింది. ముత్యాల ముగ్గు అనే సినిమా నాకు జీవితం లో ఇచ్చిన మొదటి గెలుపు అది. అప్పుడు నా వయస్సు ఐదున్నరేళ్ళు. చదువు రెండో క్లాసు.

ఆర్నెల్ల తర్వాత నాన్న, నన్ను, సుధాకర్ అన్నయ్యనీ కూర్చో పెట్టి పంచాయతీ చేసి ప్యాచ్ అప్ చేసారు. దీపావళి వస్తోందని, ఇద్దరమూ మాట్లాడుకోకపోతే టపాసులు వేరే పిల్లలకి ఇచ్చేస్తానని బెదిరించడంతో దిగొచ్చి వాడు మాట్లాడ్డం మొదలు పెట్టాడు.. అనుకోకుండా, దీపావళి రోజు నేను కాలుస్తున్న పెన్సిల్ వాడి వీపు వెనక కొత్త చొక్కాకి అంటుకుని పెద్ద కన్నం పడింది… వీపు బెత్తెడంత మేర కాలింది... అది కూడా కావాలనే చేసానని నన్ను వాయించేసారు అందరు... వాడితో పాటు! ఆ కోపం లో ఎవ్వరూ చూడకుండా తారా జువ్వ  వదిలాను.. అది నేల బారు వెళ్లి, అందరితో డాన్సులు చేయించింది... తర్వాత నా వీపు పగిలింది… వాడు మళ్ళీ ఆర్నెల్లు మాట్లాడ్డం మానేసాడు.

వైజాగ్ లో ఉన్నప్పుడే నాన్న మా ముగ్గురికీ భగవద్గీత తాత్పర్య సహితంగాను, వేదం,  చిన మంత్ర పుష్పం, పెద మంత్ర పుష్పం నేర్పించారు... నాన్న ఏదన్నా నేర్పించేటప్పుడు బావుండేది... తర్వాత అందరి దగ్గిరా విజ్ఞాన ప్రదర్శన చేయమని బలవంతం చేసినప్పుడల్లా చాలా టార్చర్  అనుభవించే వాళ్ళం. ముఖ్యంగా అన్నయ్యలిద్దరూ మరీ! అది గుర్తు పెట్టుకునే, నేను డైరెక్టర్ ని అయ్యాక ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తెచ్చి అది చేయమనో, ఇది చేయమనో హింసిస్తే నేను వారిస్తాను... అలా నా పెరుగుదలలో సినిమా ఎలా రూపు దిద్దుకుందో, శ్వాస నింపుకుందో చెప్పాలనే ఈ ఆర్టికల్ కొంచెం డిటైల్డ్ గా రాస్తున్నాను తప్ప, ఆత్మ కథ రాసుకునేంత గొప్ప వాణ్ని కాను, ఇంక సాధించడానికేమీ లేనంత వయసు మళ్ళిన వాణ్ణి అసలే కాను. 

గురువు గారు పరుచూరి వెంకటేశ్వర రావు గారు స్టోరీ సిట్టింగ్స్ లో ఎప్పుడు చెప్పేవారు… మా రోజుల్లో అని ఎవరైనా కథా చర్చల్లో అంటే, అతనింక రిటైర్ అయిపోవచ్చని... కానీ నేను వెనక్కి వెళ్లి అన్నీ గుర్తు తెచ్చుకోడానికి కారణం మాత్రం బాణం ముందుకి వదిలే ముందర నారి వెనక్కి సారించటమే. నన్ను నేను మళ్ళీ మలచుకోడానికి, నా పెరుగుదల ని తలుచుకోవడం అనివార్యం. వచ్చే సంచిక  నుంచి ఇంక సినిమాలే సినిమాలు.

 

తరువాయి సంచికలో కలుద్దాం... అంతవరకు సెలవు… నమస్తే!

 

మీ అందరికీ...

ప్రేమపూర్వకమైన షార్ట్ బ్రేక్...

 

మీ

వి.ఎన్. ఆదిత్య.

విరామం-2

.

*****

 

bottom of page