MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వి.ఎన్. ఆదిత్య
చలన చిత్ర దర్శకులు
ఆదిత్య సినీ మధురాలు
గత పదేళ్లుగా సినిమా పరిశ్రమలో ఎంతోమంది కొత్త కొత్త మదుపుదార్లు డబ్బు పెట్టుబడికి వస్తున్నారు. పీఐపీ, రిలయెన్స్, లైకా, వయాకాం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, బ్లూ ప్లానెట్, ఇలా ఎన్నో నిర్మాణ సంస్థలు కార్పోరేట్లుగానూ, రవి వల్లభనేని, ఉదయ్‌కుమార్ లాంటి ప్రవాసాంధ్రులు, ఇంకా నాకు తెలీని ఎంతోమంది వివిధ రూపాల్లో సినిమా నిర్మాణానికి పూనుకుంటున్నారు. కొత్తగా ఇంకా చాలామంది ఇటువైపు రావాలని చూడటం సినీ పరిశ్రమకి మంచిదే అయినా, పెట్టుబడి పెట్టేవాడు 'బడి'కెళ్ళకుండా పెట్టుబడులు పెట్టుకుంటూ పోతే ఒకటో, రెండో సినిమాల తర్వాత పరిశ్రమలో మనలేక పోతున్నారు. అది వాళ్లకీ, పరిశ్రమకీ కూడా మంచిది కాదు. ఈసారి ఆర్టికల్‌లో నాకెదురైన చేదు అనుభవాల తిత్తి తీసి, తీపిగా మీతో పంచుకుందాం అని నా ప్రయత్నం.
సినిమా తీద్దాం అనుకున్న నిర్మాత పెట్టుబడి రూపాయి అనుకుందాం. రూపాయిలో కంటెంట్ రెడీ అయిపోయింది. ఇబ్బంది లేకుండా, కానీ, అది ప్రజల్లోకి వెళ్ళడానికి మార్కెటింగ్ కోసం ఇంకో రూపాయి పెట్టాలి. అప్పుడే రెండు రూపాయిలూ వెనక్కి తెచ్చుకోగలుగుతారు.
a) 1. రూపాయి కంటెంట్ + 0 పబ్లిసిటీ = -1
b) 1 రూపాయి కంటెంట్ + 1 పబ్లిసిటీ = +2
c) 0 కంటెంట్ + 1 పబ్లిసిటీ = 50% సక్సెస్, 50% ఫెయిల్
సక్సెస్ అయితే మన 'సున్న' బావున్నట్టు. ఫెయిల్ అయితే మన రూపాయి మార్కెట్లో మన గుర్తింపు అన్నమాట
d) 0 కంటెంట్ + 0 పబ్లిసిటీ = మనం ఉన్నామని కూడా మార్కెట్‌లో ఎవరికీ తెలీదు.
ఈ ఎగువ పట్టికను దృష్టిలో ఉంచుకుని ఫాలో అయితే, సినిమావాళ్లూ, సినిమాల్లోకి కొత్తగా వచ్చే వ్యాపారవేత్తలు అందరూ బావుంటారు. ఈ నాలుగూ కాకుండా ఇంకో పద్ధతుంది. ఒక రూపాయి ఉంటే, ఎవరన్నా మంచి మార్కెట్ ఉన్న హీరో చేతిలో పెట్టేసి, ఆ మార్కెట్ పరిధిలోనే ఫైనాన్స్ మీద చిత్రాన్ని ముగించేసి, మనమే రూపాయి మీద ఓ 20 శాతం లాభంగానూ ఇంకో 5 శాతం వడ్డీగానూ పక్కన పెట్టుకుని మళ్లీ ఇంకో రూపాయితో ఇంకో హీరోని పట్టుకోవడం. ఇందులో పెట్టుబడికి, కంటెంట్‌తో పని లేదు. వ్యాపారపరంగా కాలిక్యులేటెడ్ రిస్క్ అనొచ్చు. లేదా సేఫ్ అనొచ్చు. ఇలాంటి నిర్మాతల్ని అప్పుడప్పుడూ పరిశ్రమలో క్యాషియర్లు అనడం మనం వింటుంటాం. సినిమా అనేది సంపూర్ణమైన "కళాత్మక వ్యాపారం' అయితే, అందులో కళ అంటే కళాకారులు, అనేకులైన సాంకేతిక నిపుణులు, ఆత్మ పెట్టేది రచయిత, దర్శకుడు, వ్యాపారం చేసేది నిర్మాత. కళాకారుల ముఖచిత్రాన్ని చూపించి మార్కెట్‌లో బొమ్మ పడిన తర్వాత (పోస్టరు, టీజరు, వగైరా) థియేటర్ కొచ్చిన జనం ఆత్మని చూస్తారు చీకట్లో. అది వాళ్లకు నచ్చితే, వాళ్ల ఆత్మారాముడు శాంతిస్తే వ్యాపారం చేసిన ఎగ్జిబిటరుకి, డిస్ట్రిబ్యూటరుకి, నిర్మాతకి వరుసగా కాసుల వర్షం కురిపిస్తారు. నచ్చకపోతే పెదవి విరుస్తారు. ఫలితంగా నిర్మాతకి నడ్డి విరుగుతుంది. ఎడ్వాన్స్ ఇచ్చి కథ మీద కసరత్తు మొదలుపెట్టి, హీరోని, దర్శకుణ్ణి, సంగీత దర్శకుణ్ణి, కెమెరామ్యాన్‌ని, హీరోయిన్‌ని, ఇతర నటీనటుని, సాంకేతిక నిపుణుల్ని ఒక బడ్జెట్ ఫ్రేములో బిగించి, ఒక అందమైన పటం గీసే నిర్మాతకి డబ్బు మంత్రం అందరికంటే ఆఖర్న వస్తే వస్తుంది. అదీ ఈ రంగంలో ఉన్న కీలకమైన రిస్కు. అక్కడ సేఫ్‌గా ఉండగలగడమే అత్యంత ముఖ్యమైన వ్యాపార దక్షత. అది నేర్చుకోవడానికి ముందు ఎవరితోనైనా చేతులు కలిపి జాగ్రత్త నేర్చుకుని, రిస్కు ఫ్యాక్టరు తగ్గించుకుని, పరిశ్రమలో పరిచయాలు పెంచుకుని, మంచి ఆవకాశం దొరగ్గానే మనదైన సొంత చిత్రపటం ఫ్రేము కట్టేసుకోవాలి. మనం ఫ్రేము కట్టడం మొదలు పెట్టినప్పటినుంచి, వీలైనంత త్వరంగా కట్టేసి మార్కెట్‌లో పెట్టేయాలి పటాన్ని.
అలాగే, మార్కెట్‌లో పెట్టిన మన బొమ్మ ఫ్రిడ్జ్‌లోంచి బైటకి తీసిన ఐసు ముక్కతో సమానం అని గుర్తు పెట్టుకోవాలి. గట్టిగా ఉందగానే గ్లాసులో పడాలి. లేటయితే చేతిలో చన్నీళ్ళై నేలపాలైపోతాయి. ఈ ఆర్టికల్ చదివి, చాలామంది ఇన్ని తెల్సు కదా వీడెందుకు దర్శకుడిగా సక్సెస్ అయ్యి కూడా నిర్మాతగా నష్టపోయాడు అనుకుంటారేమో. నేను నిర్మాత అవ్వాలనుకుని అవ్వలేదు. నాకసలా ఆలోచన గానీ, అవసరం గనీ లేవు. మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం పెళ్ళి చేస్కోవలసి వచ్చినట్టు నేను నిర్మాత అవ్వాల్సి వచ్చింది. రెండు, "పోతే అనుభవమ్ము వచ్చు" అన్నారు కొసరాజుగారు "అయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే" పాటలో. పోనీ అలా అయినా అనుకోండి నష్టం లేదు. ఒక నిర్మాత ఈ రంగంలో లాభంతో విరమించుకుంటే రంగానికి అప్రతిష్ట, పని చేసేవాళ్లకి తీరని నష్టం. ఎవ్వరి కెరీరైనా ఈ రంగంలో ఒక ప్రాజెక్టు వరకే. తర్వాత ప్రాజెక్టు ఉంటుందా, ఊడుతుందా అన్నది చివరాఖర్న డబ్బు చేతికి వచ్చే నిర్మాతని బట్టి, అది అతనికి ఇచ్చే ప్రేక్షకుల్ని బట్టి ఉంటుంది. అందుకే, సినిమాల్లోకి వచ్చే ఏ నిర్మాతైనా పది కాలాల పాటు స్వయంప్రతిపత్తితో నిర్మాణ సంస్థ నడిచేలా నిలవాలనీ, ఎదగాలనీ కోరుకుంటున్నాను. వ్యాపారాలకి ఆప్షన్లు ఎక్కువ. సినిమా కాకపోతే రియల్ ఎస్టేట్, కాకపోతే రాజకీయాలు, కాంట్రాక్టులు, టెండర్లు, మైనింగు ఒకటేమిటి? కనీ కళ .. మనకి తెలిసిన విద్య, మన జీవనోపాధి ఈ ఒక్క ప్రాజెక్టే. అందుకే నిర్మాతలని కాపాడుకోవల్సిన బాధ్యత పరిశ్రామికులందరిదీనూ. మళ్ళీసారి మరిన్ని విశేషాలతో కలుద్దాం.
అంతవరకూ సెలవు.
మీ
వీ.యెన్ .ఆదిత్య .