MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
అధ్యాత్మికం
అధ్యాత్మిక పురోగతి
భాస్కర్ సోమంచి
ఒకసారి ఆధ్యాత్మిక మార్గం నిర్ధారించుకున్నాక అందులో ముందుకు వెళ్లడం అంటే ఏమిటి? మనం ఉన్న పరిస్థితులలో మనల్ని చికాకు పరిచే విషయాలు ఏమిటి ?
ఒక చిన్న కథ ద్వారా ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను.
సుందర మూర్తి ఒక హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నాడు. అతని భార్య మాటలు అతనికి వినపడుతున్నాయి. ఆమె వాళ్ళ అమ్మగారి తో విషయం వివరిస్తోంది.
"ఏమని చెప్పన్నమ్మా. అమెరికా వచ్చాక, ఈయన ఓ ధ్యాన మందిరం లో చేరాడు. ప్రతీరోజూ సాయంత్రం అవుతూనే మాకు గంట దూరం లో ఉన్న ధ్యాన మందిరానికి వెళ్ళేవాడు. ఆఫీసు పనీ ఎక్కువుండటం, వచ్చీరాగానే సమయానికి అక్కడికి చేరే ఆదుర్దా, ఒత్తిడితో ఆయనలో ఆందోళన పెరిగేది. కొన్నాళ్ళకి అది మానేశారు. తర్వాత, ఆయన ఆఫీస్ లో అమెరికన్ స్నేహితుడు సలహాతో ప్రతి ఆదివారం ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ప్రార్ధనా మందిరానికి వెళ్లారు. కొన్నాళ్ల తర్వాత ఇండియా నుంచి ఓ స్వామి వారు వచ్చి ఈయన్ని మరో వైపుకు తిప్పారు. తర్వాత మరొక స్వామి వారు వచ్చి, ఈయనకి మంత్రోపదేశం చేసి, మనకి అంత మంది దేవుళ్ళు ఉన్నా ఒక దేవుడే గొప్ప వాడని ఈయన్ని మార్చారు. ఆ నమ్మకం కూడా కొన్నాళ్ళకి సన్నగిల్లింది. ఆయన స్నేహితుడిని చూసి అతనికి మల్లేనే, రోజూ అభిషేక పూజ చెయ్యడం మొదలు పెట్టారు. కాస్త నడుం నెప్పి రావటంతో అది తగ్గాక, ఒక యోగా సంఘం లో చేరారు. అక్కడికి, ఇక్కడికి టూర్ లకు వెళ్లడం, మూడు పూటలా మంత్రం జపం. ఇది కాక ఇంకోటి కూడా మొదలు పెట్టారు. రోజుకు ఒక పూటే భోజనం చెయ్యడం. వద్దంటే ఈయన కూడా రోజూ ఒక సారే భోజనం చెయ్యడం మొదలు పెట్టారు. గట్టిగా వారం అవ్వలేదు. ఆఫీస్ లో కళ్ళు తిరిగి పడ్డాడు. ఆఫీస్ వాళ్ళు 911 కాల్ చేసి ఇక్కడ పక్కనే ఉన్న హాస్పిటల్ లో చేర్చారు.”
తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, కొన్నేళ్ళుగా చేస్తున్న అన్వేషణని భార్య మాటల్లో విన్న మూర్తి ఆలోచనలో పడ్డాడు.
హాస్పిటల్ నుంచి వచ్చిన వారం లో మూర్తి ఇండియా వెళ్ళవలసి వచ్చింది. తన పనులు చూసుకున్నాక, తన ఇంటికి దగ్గర లో ఉన్న రామకృష్ణ మఠానికి వెళ్ళాడు. అక్కడ స్వామీజీలతో అతనికి బాగా పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో అక్కడ చేరాలని ఆలోచన చేసాడు కూడా. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న స్వామి శశికాంతానంద అక్కడే ఉంటున్నారు. అతను వెళ్ళేటప్పటికి అక్కడ ఒక వైద్య శిబిరం నడుస్తోంది. మూర్తి చకచకా అక్కడి వచ్చిన వారికి సహాయం అందించడం, డాక్టర్స్ కి కావాల్సిన ఉపకరణాలు అందించడం వంటి స్వచ్చంద పనిలో భాగస్వామి అయ్యాడు. వంతుల వారీగా శిబిరం సహాయకులు అందరూ మధ్యాహ్నభోజనం పూర్తి చేసారు. సాయంత్రం వైద్య శిబిరం పూర్తి అయ్యాక స్వామి శశికాంతానంద సాదరంగా పలకరించి కుశలం అడిగారు. మూర్తి మెల్లగా గడచిన సంవత్సరాలలో తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చెప్పాడు. స్వామీజీ అంతా విన్నారు.
సాయంత్రం ఆరు కావడంతో భజన గంట మ్రోగింది. ఇద్దరూ భజన మందిరానికి వెళ్లారు.
స్వామీజీ హార్మోనియం అందుకుని, మూర్తి కి తాళాలు, కంజీర అందించారు. వివిధ భజనలు, చివరన 'ఖండన భవ బంధన' హారతి తో భజన ముగిసింది. అతనికి చిన్నప్పుడు బాగా తెలిసిన 'హరి నారాయణ గోవింద' మళ్ళీ పాడినప్పుడు చాలా ఆనందం పొందాడు. భజన తర్వాత స్వామీజీ భోజనం చేసి వెళ్ళ మన్నారు.
భోజనం అయ్యాక మాట్లాడటం మొదలు పెట్టారు. "నీకు రామకృష్ణ పరమహంస చెప్పిన కథ చెపుతాను. ఒకసారి ఒక ఆసామికి తన స్థలంలో నీటికోసం బావి తవ్వవలసి వచ్చింది. ఒక స్నేహితుడి సలహా మేరకు ఒక చోట పదిహేను అడుగులు తవ్వాడు. అయినా నీరు పడలేదు. నిరాశ చెందగా, ఇంకో స్నేహితుడు వచ్చి, ముందర చెప్పిన స్నేహితుడి సలహా వ్యర్థమని ఇంకొక చోటు చూపించి తవ్వమన్నాడు. ఈసారి, ఆసామి ఇరవై అడుగులు తవ్వాడు. కానీ, నీరు పడలేదు. అప్పుడు, మూడో స్నేహితుడు వచ్చి, తనకి బాగా తెలుసనీ, మరొక చోటు చూపించి అక్కడ తవ్వమన్నాడు. ఈ సారి ఆసామి ముప్పై అడుగులు తవ్వాడు. కానీ నీరు రాలేదు. అప్పుడు, నాల్గవ స్నేహితుడు వచ్చి ఎంతో అనునయంగా, నవ్వుతూ శాంతంగా చెప్పాడు, ‘నీ బాధ నాకర్థం అయ్యింది. నీ స్నేహితులు అందరూ నిన్ను తప్పు దోవ పట్టించారు. దయచేసి, నాతోరా. నేను నిన్ను ఒక చోటికి తీసుకుని వెళ్తాను. అక్కడ గునపం దెబ్బ పడగానే నీరు ప్రవాహంలా వస్తుంది’. ఈ మాటలను విన్న ఆసామి చాల ఆశతో వెంటనే అతని వెనకాల నడిచాడు. అక్కడ ప్రతి క్షణం, నీరు వస్తుందన్న నమ్మకం తో తవ్వాడు. ఇరవై అడుగులు తవ్వాక దిగులు చెంది, తీవ్ర నిరాశతో తన ప్రయత్నం విరమించుకున్నాడు. అప్పటికి అతను మొత్తంగా ఎనభై ఐదు అడుగులు భూమిని తవ్వాడు. అతను, నమ్మకం తో, సహనంతో అందులో సగం అడుగులు ఒక్క చోటే తవ్వితే అతను తన పని సాధించి ఉండేవాడు.”
తర్వాత వంట మనిషిని పిలిచి, "నీకు ఒక మంత్రం చెబుతాను. రోజూ మూడు గంటలు సాధన చేస్తావా ?", అని అడిగారు. అప్పుడు అతను,"స్వామీ, నేను మంత్రం చెబుతూ ఉంటే వంట ఎవరు చేస్తారు? నాకు ఒకటే తెలుసు స్వామీ. మీకు చక్కగా వంట చేసి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచితే మీరు వైద్య శిబిరాలు పెట్టి, ఇక్కడ చుట్టు పక్కల పిల్లలకు చదువు చెప్పి సాయం చేస్తారు. నేను చేసేదంతా దైవంతో సమానమయిన మీ స్వాములందరికి", అన్నాడు. స్వామీజీ అతనిని మెచ్చుకోలుగా చూసి పంపించి వేశారు.
అప్పుడు మూర్తి వైపు తిరిగి, "నీకు బాగా తెలిసిన మార్గం - భజనల ద్వారా నామ స్మరణ, స్వచ్చంద సేవ ద్వారా మాధవ సేవ - మరచిపోయావే? ఏ మార్గానికైనా దైవం ప్రధానం. ఏ మార్గం ఎంచుకున్నా అందులో నిలకడగా ఉండడం, అప్పుడప్పుడు వచ్చే ప్రతిబంధకాలు అధిగమిస్తూ నమ్ముకున్న మార్గంలో ప్రయాణించడం ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గం లో పోటీ లేదు. ఎవరి దారి వారిదే. ఎవరి స్థాయి మేరకు వారు సాధన చేస్తారు." మూర్తి కి తన అనిశ్చితికి కారణం మనస్సులోని అస్థిరత్వమని అర్థమయింది. ఆయన పాదాలకు నమస్కరించి బయలుదేరాడు. వెళ్లేముందర, అక్కడ మందిర ద్వారం దగ్గర ఉన్న విరాళాల పెట్టె లో చెక్ వేయడం మాత్రం మరచిపోలేదు.
**
ఆధ్యాత్మిక మార్గం లో మనకి వచ్చే పెద్ద సమస్య కొత్త మార్గం కనబడడం, అది బావుందని అనిపించడం, మనం ఎంచుకున్న మార్గం మీద నమ్మకం సన్నగిల్లడం. కానీ, ఆధ్యాత్మిక పురోగతి అంటే ఎంచుకున్న మార్గంలో నిలబడడం. ఆ స్థితిని కాపాడుకోవడం !
*****