MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
అధ్యాత్మికం
తల్లీ నిన్ను దలంచి -
ఎర్రాప్రగడ రామకృష్ణ
మొగ్గలోకి యౌవనం ప్రవేశించి, దాని ఎదుగుదలకి దోహదం చేస్తుంది- విజ్ఞాన శాస్త్రం ఆ వికాసాన్ని శాస్త్రీయంగా నిరూపించింది.
వనాలని వసంతం ఆలింగనం చేసుకుని ప్రకృతి కృతులు పల్లవించేందుకు దోహదం చేస్తుంది.
కవులు ఆ ధన్యతను తమ కవిత్వంలో అనుకరిస్తూ ఉంటారు. అలాంటిదే సాహిత్యం.
శిథిలమైపోయిన జీవితాలను చివురింపచేసి, మనుగడను రంగరంగ వైభవంగా సింగారించి బ్రతుకు సౌరును సురభిళింప చేయడం, సాహిత్యం తాలూకు ప్రధానమైన లక్ష్యం. మనిషిలో ఉత్తేజానికి ఊపిరూలూదే గొప్ప కర్తవ్యం సాహిత్యానిదే.
అయితే అంతటి తేజోమయమైన, శక్తివంత్మైన సాహిత్యాన్ని సృష్టించదానికి సాహిత్యకారులకి అనంతమైన జీవశక్తి అవసరమవుతుంది. అప్పుడే వారి సృష్టికి ఔజ్వల్యం కలుగుతుంది.
కవుల మాటకి అదిగో ఆ రకమైన ఔజ్యల్యం కలిగించే దేవత - సరస్వతీ దేవి. అందుకే ఆమెను సూక్తిధేనువు అని అంటారు. సూక్తిధేనువును ఆరాధించదానికి మిక్కిలి అనువైన కాలం - శరన్నవరాత్రులు
.
కనుక కవులు, రచయితలు, వక్తలూ ఒక్కమాటలో అక్షరాన్ని ఉపాసన చేసే వారందరికీ శరన్నవరాత్రులు గొప్ప పర్వదినాలు. అలాంటి వారందరికీ దసరా రోజులు అని అంటే సరస్వతీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేకింపబడిన రోజులు అని అర్ధం. అందుకనే అక్షరాలని నమ్ముకున్నవాల్లకి దసరా పండుగలే అసలైన పండుగ రోజులన్నమాట. "నా ఉల్లంబంధున నిల్చి జృంభణముగా ఉక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునన్" అని సరస్వతీ దేవిని ప్రార్ధన చేయాలి. ఆవిడ సూక్తి పలుకులకి కామధేనువు లాంటిది కనుక ఆమె దయతో వాక్కు శోభాయమానమవుతుంది.
అంటే పోతన్నగారి పద్యం -"తల్లీ నిన్ను దలంచి పుస్తకం చేతన్ పూనితిన్" అనేది పిల్లలకి మాత్రమే కాదు, పెద్దలు కూడా రోజూ మననం చెయ్యవలసిన పద్యం అన్నమాట. కనీసం దసరా రోజుల్లో అయినా, రోజూ చెప్పుకోవలసిన గొప్ప మంత్రం అది.
అలా మంచి పుస్తకాలు చేత్తో పట్టుకుని గడపవలసిన ప్రత్యేక పర్వకాలం కనుక ఈ దసరా రోజుల్లో ప్రత్యేకించి మంచి కావ్యాలపై చర్చలు ఏర్పాటు చేసే సంప్రదాయం ఆంధ్రదేశంలో అంతటా ఉండేది. మన ఊళ్ళో కూడా ప్రతి శరన్నవరత్రులకీ ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలు అంటూ ఒకప్పుడుండేవి.
నాకు తెలిసినంతవరకూ విశ్వనాథ సత్యనారాయణగారి నోట వారి రామాయణ కల్పవృక్ష పఠనం రాజమండ్రిలో తొలిసారి ఏర్పాటయింది శరన్నవరాత్రి ఉత్సవాల్లోనే. 1960లో విజయదశమి రోజుల్లో విశ్వనాథవారు అయిదు కాండలు ఇక్కడ వినిపించారు. మల్లంపల్లి శరభయ్యగారు, మధునాపంతులవారూ, చెరుకుమిల్లి జమదగ్ని శర్మగారు, ఉషశ్రీ, కనక్ ప్రవాసి, మన పోతుకూచి సూర్యనారాయణమూర్తి గారు వగైరా పెద్దలంతా "సాహిత్య గౌతమి” సంస్థ పక్షాన విశ్వనాధవారిని ఆహ్వానించి అష్టమీ, నవమి, దశమి రోజుల్లో అయిదు పూట్లా అయిదు కాండలు చెప్పించుకున్నారు. అవాళ మధునాపంతుల వారి స్వాగతోపన్యాసంలో ఒక చమత్కారం గురించి, ఎవరో చెప్పారో, ఎక్కడో చదివానో గాని బాగా గుర్తుండిపోయింది. అష్టమి తిథి డేగల వంటి పక్షి జాతికి ఉపవాస దినమట. దాన్ని సత్యనారాయణ శాస్త్రిగారు గుర్తు చేస్తూ "డేగలకే గాని మనుషులకి ఆ నియమం లేదు కనుక ఈవాళ అమృతంతో గొప్ప విందు భోజనం ఏర్పాటు చేసామని" ప్రకటించారు. విశ్వనాథ కల్పవృక్షం వినడమంటే సాక్షాత్తు దివ్యమైన అమృతాన్ని సేవించడమే. అది కూడా వెలితి ఏమాత్రం లేకుండా సుష్టుగా పుచ్చుకోండని ఆయన మాటల్లో చమత్కారం.
అలా ఈ రాజమండ్రి ప్రజలు ఆ మూడు రోజులూ సూక్తిధేనువు క్షీరధారలని స్వీకరించారన్నమాట. విజయదశమి పర్వదినాల్లో కల్పవృక్షం లాంటి కావ్యాన్ని పఠించడమంటే సరస్వతీదేవిని అర్చించడమే అని చెప్పడం కోసం ఈ విషయాన్ని ఉదహరిస్తున్నాను. మన ముందుతరం పెద్దలు ఇలాంటి సంప్రదాయాలని ఈ ఊళ్ళో నెలకొల్పారు అని గుర్తుచెయ్యడం కోసం ఇది రాసాను. "ఇదిగో గౌతమీ వాహిని అమృతసాగరం. ఇక్కడ సమావేశమైన పెద్దలంతా భిల్ల తరువులూ, ధాత్రీ వృక్షాలూను. దానికి తోడు ఈ కల్పవృక్షం. కనుక ఈ మొత్తం సన్నివేశం దుర్గాంబికకు ఆవాసమైన రత్నద్వీప ఖండాన్ని గుర్తుకుతెస్తోంది" అని మధునాపంతులు వర్ణించారట. విజయదశమి రోజుల్లో రత్నద్వీప ప్రస్తావన తేవడంలో ఆయన పాటించిన ఔచిత్యం, చాతుర్యం ఇక్కడ గమనించదగ్గవి.
ఆ పెద్దలంతా కవులూ పండితులుగా అప్పటికే లబ్ధప్రతిష్టులు. అలాంటివారే ఈ శరన్నవరాత్రులను ఒక మంచి కావ్యం వినడానికి కేటాయించారంటే, మరి మనలాంటివారు ఈ పర్వదినాలను అస్సలు వ్యర్ధం చేయరాదని అర్ధం కదా. మనలాంటి వారు అంటే సాధారణ పాఠకులన్నమాట.
మనలో పూజలు, పునస్కారాలు ఆధ్యాత్మికత వంటి విషయాలు పెద్దగా పట్టించుకోనివారు, అలాంటివాటి గురించి ఆసక్తి ఉంది గాని, అవేమిటో సరిగ్గా తెలియదు అనుకునేవారు, ప్రత్యేకించి ఈ నాలుగు రోజులు మంచి పుస్తకాలు చదవడం అనే పని చేపట్టినా చాలు.
మొదట్లో చెప్పిన 'వికాసం" అనుభవంలోకి వస్తుంది. కవుల 'ధన్యత”తో పరిచయం అవుతుంది. సాహిత్యం తాలూకు "ప్రధాన లక్ష్యం" అర్ధమవుతుంది. అన్నింటినీ మించి "సూక్తిధేనువు" అనుగ్రహం తెలిస్తోంది. ఆ సాహితీవేత్తల ఆశయం కూడ అదే.
స్వస్తి.
*****