top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

మధురవాణి ప్రత్యేకం

అధ్యాత్మికం

నేర్పుగా జీవించడం ఎలా?

ఎర్రాప్రగడ రామకృష్ణ

సత్యం వద. ధర్మం చర!

సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు - అని ఉపనిషత్తులు బోధించాయి. అయితే, ఆ రెండింటి విషయంలో మనిషికి ఎన్నో సందేహాలు! ఏది సత్యం, ఏది అసత్యం? ఏది ధర్మం , ఏది అధర్మం? ఈ ద్వంద్వాలకు మధ్య విభజన రేఖను తేలిగ్గా గుర్తించడం ఎలా? - ఇదీ మనిషిని తరచూ వేధించే సందేహం!

అడవిలో ఒంటరిగా పోతున్న యువతిని ఒక కిరాతుడు గమనించాడు. ఆమె అందచందాలకు మురిసిపోయి ఆమెను చేపట్టాలనుకున్నాడు. వెంటపడ్డాడు. ఆ యువతి భయంతో పారిపోతూ దారిలో ఒక రుషి ఆశ్రమం కనపడగానే, ఇంకేం ఆలోచించకుండా, లోపలికి ప్రవేశించి ఒక మూల దాగింది. ఇదంతా ఆ రుషి గమనించాడు. పరిస్థితి గ్రహించాడు. అయినా ఏమీ పట్టించుకోనట్లుగా, తన మానాన తాను వాకిట్లో చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. కొద్దిసేపటికి ఆ కిరాతుడు ఆశ్రమం దగ్గరకి వచ్చాడు. ధ్యానంలో ఉన్న మునిని తట్టిలేపాడు. ఆ యువతి గురించి వాకబు చేశాడు. 'ఆమె ఇటువైపే వచ్చింది... నీవు చూశావా?  అని అడిగాడు. దానికి ముని జవాబిస్తూ 'నాయనా చూసేది కళ్ళు, అవి మాట్లాడలేవు. మాట్లాడేది నోరు, అది చూడలేదు' అంటూ స్త్రీ సంగతిని బయట పెట్టకుండా విషయం దాటవేశాడు.

ఈ కథను జాగ్రత్తగా అర్ధం చేసుకుంటే సత్యాసత్యాలు, ధర్మాధర్మాల సంధిలో నేర్పుగా జీవించడం ఎలాగో తెలుస్తుంది. నిజానికి ఆ రుషి సత్యవ్రతుడే. సత్యసంధత పేరుతో నిజం బయటపెడితే కిరాతుడు ఆ యువతిని మానభంగం చెయ్యడమో, చంపడమో జరిగేది. తన కళ్ళెదుట జరిగే అకృత్యాన్ని అడ్డుకోకపోతే తాను ధర్మం తప్పినవాడు అవుతాడు. ఆ రుషి వారి మధ్యలో కల్పించుకుని, వాడ్ని శపించడమో లేక వాడిచేతిలో మరణించడమో సంభవించేది. ఆ కిరాతుణ్ని చూస్తే మూర్ఖుడు. వాడితో సత్యం విషయమై పేచీపడితే- మానహాని, ప్రాణహాని ధర్మగ్లాని ఏదైనా జరగవచ్చు కనుక ముని తన సత్యసంధత విషయమై పట్టువిడుపూ ప్రదర్శించాడు. సత్యాన్ని దాచిపెట్టాడు. ఈ సన్నివేశంలో అలా సత్యాన్ని దాచి ఉంచడమే రుషి తాలూకు ఆపద్దర్మంగా మనం అర్థం చేసుకోవాలి. ఆపద ఎదురైనప్పుడు మాన ప్రాణ రక్షణ కోసం ఆచరించదగిన ధర్మమే ఆపద్దర్మం. అంతేకాని, అయినదానికీ కానిదానికీ ఆపద్దర్మం అంటూ సాకులు వెతకడమూ, ఆపద్ధర్మాలను ఆశ్రయించడమూ మళ్ళీ ఆధర్మమే అవుతుంది.

ఆపద్దర్మంలాగే విశేష ధర్మం అని మరొకటి ఉన్నది. సాధారణ ధర్మం కన్నా ఉన్నతమైనదది. తండ్రిని సేవించడమూ, గౌరవించడమూ కొడుకుగా ప్రహ్లాదుడి సామాన్య ధర్మం. అయితే శ్రీహరి విషయంలో ప్రహ్లాదుడు తండ్రిని ఎదిరించాడు. ఎందుకంటే శ్రీమహావిష్ణువు ఈ జగత్తుకే తండ్రి. అటా, ఇటా అనేది తేల్చుకోవలసిన చివరి స్థితికి వచ్చేసరికి ప్రహ్లాదుడు తండ్రిని సేవించడమనే సామాన్య ధర్మాన్ని త్యజించి, జగత్పితను పూజించడమనే విశేష ధర్మం వైపు మొగ్గు చూపాడు.

ఈ పురాణ గాథలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సత్యాసత్యాల మధ్య ధర్మాధర్మాల మధ్య నిశ్చలంగా నిలబడి ఒడుపుగా జీవించడం ఎలాగో తెలుస్తుంది!

bottom of page