MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
అధ్యాత్మికం
నమామి లోకశంకరం!
ఎర్రాప్రగడ రామకృష్ణ
అందరూ అమ్మ కడుపులోంచి వచ్చేవారే!
అయినా, కొందరిని ఈ లోకం 'దిగివచ్చినవారు' అంటుంది. లోకాన్ని ఉద్దరించడానికై కావాలని దిగి వచ్చేవారు కారణజన్ములు. కర్మభూమి కనుక, మన దేశం కారణజన్ములకు పుట్టిల్లు అవుతోంది. శంకరులు ఆ కోవకు చెందిన అద్భుత ఇతిహాసమూర్తి. సాక్షాత్తూ శివుడి అంశగా కీర్తింపబడిన అవతార స్వరూపం!
దక్షిణ భారతదేశంలో దేవతలకు ప్రీతికరమైన ప్రదేశంగా పేరొందిన కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో ఆర్యాంబ, శివగురు పుణ్యదంపతుల పూజాఫలం శంకరులు. ఆదిశంకరులు లేదా శంకరాచార్యులు అనడంకన్నా శంకర భగవత్పాదులు అనే పదంలో ఒకానొక వృత్త శాండీర్య శోభ ధ్వనిస్తుంది.
'శివరూపాత్ జ్ఞానమహమ్' అని సాంబుడు సూర్యభగవానుణ్ని స్తుతించినట్లుగా శంకర భగవత్పాదులు జ్ఞాన శంకరునిగా వికసించడం- ఆనాటి యుగావసరం! ఆయన పుట్టుక ఈ దేశపు అదృష్టరేఖ! వైదిక ధర్మ ప్రతిష్టాపనం ఆయన ఈ జాతికి ప్రసాదించిన గొప్పవరం. మతపరంగా ఆయన సాధించిన విజయాలు ఈ దేశపు ఆధ్యాత్మిక చరిత్రకు ప్రతిభా వైజయంతికలు.
వాస్తవానికి భారతదేశమే ఒక మహాతత్వ శాస్త్ర గ్రంథం. దానిలో ఉత్తర, దక్షిణ భారతాలు రెండు ప్రధాన అధ్యాయాలు. ఉత్తరభారతం ఒకానొక అద్భుత దృశ్యం' కాగా, దాని సర్వ సమగ్ర 'దర్శన' భాగ్యం దక్షిణ భారతావనిది. ఈ దేశంలోని అవతారమూర్తులకుగాని, దేవీ దేవతా భావనలకుగాని జన్మలగ్నం ఉత్తరభారతం! దివ్యమైన ఆయా దర్శనాలను సాధించి, తరించి తమ అలౌకిక అనుభూతులను పదిలంగా ఈ లోకానికి అనుగ్రహించినవారు దక్షిణాది ఆచార్యులు, దార్శనికులూను!
మన భారతదేశపు ఈ 'దృశ్యదర్శన' యోగంలో కీలకపాత్ర శంకర భగవత్పాదుల వారిది. శంకరులు, మధ్వాచార్యులు, రామానుజులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, సాయనుడు, దిజ్నాగుడు.. ఇలా ఎందరో దార్శనికులు దక్షిణ భారతదేశంలో ప్రభవించి, ఉత్తర భారతంలోని దేవీ దేవతావిర్భావ వైభవాలకు రమ్య వైతాళిక గీతాలు సమకూర్చారు. వారి పుట్టు పూర్వోత్తరాలకు వ్యాఖ్యాతలుగా, ప్రవక్తలుగా వ్యవహరించారు. దేశం నలుమూలలకు పరిచయం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే దక్షిణాది ఆచార్యులు లేకుంటే- ఉత్తర భారతదేశపు దేవతలకు ప్రాచుర్యం, వ్యాప్తీ లేవు. అదేవిధంగా, ఉత్తరాది దేవతలను విస్మరిస్తే దక్షిణాది దార్శినికులకు గమ్యం, లక్ష్యం కనపడవు. ఇవి రెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకున్న గొప్ప వ్యవస్థలు. అఖండ భారతదేశపు అద్భుత సమైక్య భావనకు ఈ మూల సూత్రం అత్యంత కీలకం! ఈ మౌలిక సూత్ర బంధానికి పురోహితులు మన ప్రాచీన మహర్షులు. భారతదేశపు నిసర్గ తాత్విక భూమికను అర్ధం చేసుకోవాలంటే- ఈ ప్రాధమిక మౌలిక సూత్రాన్ని జీర్ణించుకోవాలి. కాశీ రామేశ్వరాలు, గంగా గోదావరులువంటి అపురూప ఆధ్యాత్మిక మధురాలాపనకు ఆధారషడ్జమం ఆ మౌలిక సూత్రమే! ఆలోచించండి! ఎక్కడ కాశీ? ఎక్కడ రామేశ్వరం? గంగ ఎక్కడ? గోదావరి ఎక్కడ? ఇలా ఎక్కడెక్కడి మూల మనోభావాలకో భద్రంగా అంటుకట్టి, ఆఖండ భారత సమైక్య గీతాలాపనకు సుస్వర రచనలుకూర్చి సమార్చనం చేసిన మహానుభావుల తపస్సుల గురించి ఆలోచిస్తే, శంకర భగవత్పాదుల అవతార ఆవశ్యకత, లక్ష్యం బాగా బోధపడతాయి.
ఉత్తర భారత కోసలదేశపు శ్రీరాముణ్ని- గంగాతీరపు కబీర్ దాస్ 'నావాడు' అనుకోవడం పెద్ద విశేషంకాదు-దక్షిణదేశాన కావేరీనది ఒడ్డున నిల్చి త్యాగరాజ స్వామివారు 'రాముడు నా ప్రాణం' అనుకోవడంలో ఉంది- ఈ దేశపు ఔన్నత్యం! భారతీయమైన ఈ మహా 'దృశ్య దర్శన' యోగపు అమోఘ తాత్విక సరాగ భూమికను ఆకళించుకుంటే తప్ప- శంకరులవంటి ఇతిహాసమూర్తుల తపస్సుల ఫలంగా లభించే పురోడాశాన్ని మనం ఆస్వాదించలేం. అమోఘమైన ఆ ఆధ్యాత్మిక జీవధారను అధ్యయనం చేయగల్గితేనే-భారతదేశమనే గొప్ప తత్వశాస్త్ర గ్రంథం మనకు కొరుకుడు పడుతుంది. ఆ ప్రాచీన కంఠాలను గుర్తు పట్టకపోతే, తాత్విక మహాపురుషుల పాత్రలను గ్రహించకపోతే భారతీయ దృశ్య దర్శనయోగంలో కీలకపాత్ర వహించిన శంకర భగవత్పాదుల భూమిక మనకు సంపూర్ణంగా బోధపడదు.
తనకు సన్యాస దీక్ష ప్రసాదించిన గోవిందపాదాచార్య ఆదేశం మేరకు శంకరులు ఆసేతు హిమాచలం కాలినడకన పర్యటించారు. ఆరోజుల్లో మతపరంగా భారతదేశపు ముఖచిత్రం అస్తవ్యస్తంగా వుంది. వైదిక విరుద్ధంగా వుంది. ద్విసప్తతి (72) పూజా విధానాలతో సంక్లిష్టంగా వుంది. గాణాపత్యం, శాక్తేయం, శైవం, వైష్ణవం, పాశుపతం, భైరవం... అంటూ ముక్కలు చెక్కలైన ఆధ్యాత్మిక వ్యవస్థను పంచాయతనంతో సమన్వయం చేసిన తత్వ సమన్వయమూర్తి శంకర భగవత్పాదులు! చెల్లాచెదురైన వ్యవస్థను ఏకీకృతం చేసి, వైదిక ధర్మచ్ఛత్రంలోకి తెచ్చిన క్రమంలో శంకరులు ఎన్నోరకాల బౌద్ధిక యుద్ధాలలో ప్రత్యర్థులతో తలపడ్డారు. అసాధారణ ప్రజ్ఞతో వారందరినీ పరాజితుల్ని చేసి అద్వైత వేదాంతాన్ని వ్యాప్తి చేశారు. సన్యాస వ్యవస్థను 'దశనామి' సంప్రదాయ వ్యవస్థలోకి తెచ్చారు. వైదికధర్మ సంస్థాపనకు విశేషకృషి చేసి షణ్మతాచార్యునిగా ప్రశంసలు అందుకున్నారు. అద్వైత వేదాంత మార్గాన్ని పటిష్టం చేసేందుకై దేశం నలుదిక్కులా, అంటే ఉత్తరాన జ్యోతిష్మతి (బదరి), తూర్పున పూరి, పశ్చిమాన ద్వారక, దక్షిణాన శృంగేరీలలో ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. వాటికి వరసగా తోటకాచార్య, పద్మపాద, హస్తామలక, సురేశ్వరాచార్య అనే శిష్యులను అధికారులుగా నియమించారు. ఆ రకంగా సుస్థిరమైన పీఠవ్యవస్థను, క్రమబద్ధమైన ఆచార్య వ్యవస్థను రూపొందించారు. తను జగద్గురువుగా అవతరించారు. "నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్” అనే స్తుతికి గమ్యమై నిలిచారు. (శంకరాచార్య మధ్యమాం అనేది తర్వాతికాలంలో 'వ్యాస శంకర మధ్యమాం' అయింది).
ప్రస్థానం అంటే మార్గం అని అర్ధం. తరించాలనుకునే వారికి దారి చూపించేవి ఈ లోకంలో ప్రధానంగా మూడు. అవి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ కరదీపికలను 'ప్రస్థానత్రయం ' అంటారు. ప్రస్థానత్రయాన్ని జీర్ణించుకోవడం పాండిత్యానికి గట్టి పరీక్ష. ఆ పరీక్షకు నిలిచేవారిని 'ఉత్తమాధికారులు' అంటారు. అలాంటి వారికోసం శంకరులు ప్రస్థాన త్రయానికి ప్రామాణికమైన భాష్యాలను సంతరించారు. వివేక చూడామణి, అపరోక్షాను భూతి, ఉపదేశ సాహస్రి, ఆత్మబోధ, ఆత్మానాత్మ వివేకంవంటి ప్రకరణ రూప సాహిత్యాన్ని మధ్యమాధికారులకు అనుగ్రహించారు. సామాన్యాధికారులను తరింప చేసేందుకై అసామాన్య స్తోత్ర వాజ్మయాన్ని అందించారు. సౌందర్యలహరి, దక్షిణామూర్తి స్తవం, కనకధారా స్తోత్రం, భజగోవింద స్తుతి వంటివి ఆ కోవలో ప్రసిద్ధికెక్కాయి. ఇది సలక్షణమైన గొప్ప ఆచార్యుడి తీరు. ఇది జగద్గురు లక్షణం. శంకరులు ఎంతటి వేదాంతో అంతటి కవి. ఆయన సాహిత్యం తత్వదృష్టికి గురువాక్యం-కావ్యదృష్టికి రసవాక్యం. జ్ఞాన శంకరుడు తేజోమయుడు. భక్త శంకరుడు రసమయుడు. ఆయన దివ్య వాజ్మయానికి అన్నివైపులా పదునే. ఒకే సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తోస్తాడన్నట్లుగా - శారీరక రోమాంచిత స్థితి కావాలన్నా, మానసిక తాదాత్మ్యస్థితి కోరినా, ఆత్మగతమైన భగవత్ వ్యాకులత నిశ్చలస్థితి నాపేక్షించినా, హర్షాశ్రునయనాల ఆనందమయ స్థితి కోసమైనా, మనల్ని మనం మర్చిపోయే ఒకానొక అపురూప కావ్యపఠన సమాధి స్థితిలోకి జారుకోవాలనుకున్నా.... మనం శంకర వాజ్మయాన్ని ఆశ్రయించడం ఒక్కటే దిక్కు.
దేశ దేశాల తత్వజ్ఞులు భారతదేశంలో అడుగెట్టగానే నుదుటిని నేలకానించి ముద్దాడటానికి ఒక్క కారణం చెప్తే చాలు! ఇది జంగమ దక్షిణామూర్తి, నరరూపంలో నడిచిన శివుడు - శ్రీశ్రీశ్రీ శంకర భగవత్పాదుల పవిత్ర పాదస్పర్శతో పరమ పునీతమైన నేల. భారతదేశం శంకరులకు జన్మనిచ్చిన గడ్డ. ఒళ్ళు పులకరించే సత్యమిది! శంకరుల పాదపద్మాల తాకిడికి పవిత్రతను సంతరించుకున్న నేల ఇది. భారతదేశానికి ఇది చాలా గర్వకారణమైన అంశం. ఈ నేలను ముద్దాడటానికి ఈ ఒక్క కారణం చాలదూ?
*****