MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
ఆధునికత
రమాదేవి చెరుకూరి
ఆదివారం మధ్యాహ్నం రెస్టారెంట్ బాగా సందడి గా వుంది.
బిల్ చెల్లించి, ఫణి మెట్ల వైపు అడుగు వేశాడు. అతనికి ఒక అడుగు వెనకగా విజయ ఫాలో అయింది. చివరి మెట్టు దగ్గరికి వచ్చేసరికి మొదటి మెట్టు ఎక్క బోతున్న చందూ కనిపించాడు. ఫణి ని చూడగానే, మొహం అంతా నవ్వు పులుముకుని చేయి ముందుకు చాచాడు. “ఒరేయ్ నిన్ను కలవాలనే అనుకుంటున్నాను. వెదక బోయిన తీగ.” అన్నాడు చందూ.
“కోయ్!“ అంటూ పలకరిస్తూనే చేయి కలిపాడు ఫణి.
“ఈసారి నిజం“ అన్నాడు చందూ, ఫణి మాటలకు బదులుగా.
“ఎందుకుట పాపం. “
“చెప్తాగా” అని చందూ అంటుండగానే, అతని దృష్టి వెనకగా వున్నవిజయ మీద పడింది.
“హే. నువ్వేంటీ ఇక్కడ?“ అన్నాడు.
భుజాలని చిన్నగా కదిలించింది. ఏమి లేదన్నట్లు.
“ఎలా ఉన్నావు?” పలకరించాడు చందూ.
“ఫైన్. నువ్వెలా వున్నావు? తిరిగి పలకరించింది.
ఆ యిద్దరిని చూస్తూవున్న ఫణి కి ప్రత్యేకం గా అడగ వలసిన అవసరం లేకుండానే తెలుస్తోంది, వాళ్ళకి పూర్వపరిచయం వుందని.
అయినా, చందూ నీకెలా తెలుసునని ఫణి అడగలేదు. విజయ చెప్పలేదు.
ఇద్దరు మామూలుగానే దిగారు. మాట్లాడుకున్నారు. చివరకు విడిపోతూ బై ,బై చెప్పుకున్నారు.
“మళ్ళీ శనివారం దాకా నాకు వీలుపడదు. నెక్స్ట్ శనివారం ఇక్కడే కలుద్దాం. అన్నాడు మణి. పూర్తి గా ఆమోదిస్తూ తల వూపింది విజయ.
పైమెట్టు మీద నిలబడి పోయిన చందూ వీరిద్దరి వంక క్యూరియస్ గా చూస్తూ వుండిపోయాడు. విజయ, ఫణి వెళ్ళ గానే, తల చిత్రంగా ఊపుతూ రెస్టారెంట్ లో అడుగు పెట్టాడు.
మర్నాడు, చందూ, ఫణి ఎపార్ట్మెంట్ కి వెళ్ళాడు ఫణి ఆఫీసు నుం చి వచ్చే వేళకు.
చందూ ని చూడగానే “నిజంగానే వచ్చావే “ అంటూ నవ్వాడు.
“చెప్పానుగా ఈ సారి తప్పకుండా వస్తానని “ అంటూ చేతిలో వున్న శుభలేఖ అందించాడు.
ఫణి అందుకుంటూ “కంగ్రాచ్యు లేషన్స్ అన్నాడు. కవరు తెరవబోతూ “ ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ కదా ! పెళ్లి కేవలం ఒక ఫార్మాలిటీ. అవునా “ అన్నాడు నవ్వుతూ .
తల అడ్డంగా వూపాడు చందూ.
ఆశ్చర్యంగా చూస్తూ, “ I thought..” ఏదో అనబోయి మానేశాడు ఫణి.
“అవును. నువ్వనుకున్నది నిజమే. కానీ మేము విడిపోయాం.“ అన్నాడు చందూ.
క్రిందటి సంవత్సరం చందూ, అతని గర్ల్ ఫ్రెండ్ ఒక ఎపార్ట్మెంట్ షేర్ చేస్తున్నట్లు విన్నాడు. చందూని నిలదీసి అడిగాడు కూడా. “ఎందుకురా ఈ మాడ్రన్ లైఫ్ స్టైల్. మీ ఇద్దరు ఇష్టపడ్డప్పుడు, పెద్దవాళ్ళతో చెప్పి, పెళ్లి చేసుకోక? “
“ఒరేయ్. త్రేతా యుగపు కబుర్లు చెప్పకు. ఇది 21st సెంచరీ. సహజీవనం సామాన్యమైన విషయం. అదీకాక జీవితాంతం కలసి ఉండాలనుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరికి తెలియడం చాలా అవసరం” సమాధానమిచ్చాడు చందూ.
అది గుర్తొచ్చింది ఫణికి. ఇప్పుడు చూస్తే మరి శుభలేఖ పట్టుకు వచ్చాడు. కొంచం అయోమయం గా తెరిచాడు.
“ఏమిటో రా! ఫణి! చాలా ఆలోచించాను. లివింగ్ టుగెదర్ కొత్తగా బానే అనిపించింది.కానీ, పెళ్ళి వరకూ వచ్చాక, పాత సాంప్రదాయమే మంచిదనిపించింది. అందుకే, మా నాన్న చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను.“
“మరి ఈ అమ్మాయి ఇస్ట పడిందా నీ లైఫ్ స్టైల్ కి?” అడిగాడు ఫణి.
చందూ అదో విషయం కాదన్నట్టుగా భుజాలు ఎగరేశాడు. "ఆ రాబోయే అమ్మాయికి ఇదేమీ తెలీదనుకుంటాను"అన్నాడు అతి మామూలుగా.
ఈ సారి అదిరిపడ్డాడు ఫణి. అడగకుండా వుండలేకపోయాడు. “అదేమిటి నువ్వు చెప్పలేదా? అలా ఎలా చేస్తున్నావు?”
“ఎలా చెప్పాలో తెలియలేదు. అయినా సిటీ లో వున్న వాళ్ళ గురించి అందరికీ తెలుసే వుంటుంది.“ అన్నాడు చందూ.
కాసేపు ఏం మాట్లాడలేక పోయాడు ఫణి. చివరకు అన్నాడు. “పెళ్లి అయ్యాక తెలిస్తే?”
“ఆ! తానే సర్దుకుంటుంది కొద్ది రోజులు పోతే.”
“సర్దుకోలేకపోతే?”
“అప్పటి సంగతి అప్పుడు చూడాలి. అంతే. నా సంగతి సరేగాని నీ సంగతి చెప్పు.” అన్నాడు చందూ.
“నా సంగతులు ఏమున్నాయి చెప్పడానికి?”
“నీకు విజయ తో ఎలా పరిచయం?
“ఓ అదా! మా అమ్మ రాసింది. విజయ పెదనాన్న, మా తాత గారు ఫ్రెండ్స్ ట. అమ్మ చెప్పింది విజయని కలిసి మాట్లాడమని” అన్నాడు ఫణి. “అలా మీట్ అయ్యాను.”
ఇంకా ఏమయినా చెప్తాడేమోనని ఆగాడు చందూ. ఫణి మరేమీ చెప్పక పోవడంతో తనే అన్నాడు.
“అంతేనా?”
“ప్రస్తుతానికి అంతే. రెండు మూడుసార్లు రెస్టారెంట్ లో కలుసు కున్నాం, సినిమాలకి వెళ్ళాం.” అన్నాడు ఫణి చాలా మామూలుగా.
ఆ తరువాత చందూ ఎంత మాట్లాడాలో, ఎంత వరకు మాట్లాడకూడదో తేల్చుకోలేక పోయాడు. ఇద్దరు కలసి డిన్నర్ కి వెళ్లారు. ఇద్దరి మధ్య కబుర్లు సాగుతూనేవున్నాయి. మనసులో ఆలోచనలు వాటిష్టంవచ్చినట్లు వచ్చిపోతూనేవున్నాయి.
వీడీ పెళ్లి ఎలా చేసుకుంటున్నాడు? చక్కగా ఉన్న రిలేషన్షిప్ ని అంత తేలిగ్గా కారణం లేకుండా ఎలా తెంచుకుంటున్నాడు?? పైగా ఆ అమ్మాయికి చెప్పకుండా? ఈ పెళ్లి ఏమిటి? ఫణి మనసు ఆలోచిస్తూనే వుంది.
చందూకి కొంచెం గిల్టీ గా వుంది. ఏమి చెప్పకుండా వెళ్ళిపోవడం సరైన పని గా అనిపించడం లేదు. చిన్ననాటి నుంచి స్నేహితుడు. యిది మరీ దూరం వెళ్ల కుండానే చెప్పాలి. తరువాత అనవసరం. అనుకున్నాడు. అయినా అదేమిటి విజయకు తనను చూస్తే ఎటువంటి రియాక్షన్ లేదు. ఇలా చాలాసేపు వూగిసలాడి, చివరికి వెళ్ళబోతూ అన్నాడు.
“విజయ మరొకరితో రిలేషన్షిప్ లో వుండేది. నీకు తెలుసా? “
“తెలుసు” అన్నట్లు తల వూపాడు. ఫణి.
ఈసారి అదిరిపడడం చందూ వంతు అయింది.
మేము మొదటి సారి కలసినప్పుడే చెప్పింది. అదే నన్ను ఆకర్షించింది. నిజాయితీగా, హుందాగా ఉండే తీరు నచ్చింది“ అన్నాడు ఫణి.
మౌనం వహించాడు చందూ.
పై వారం ముందుగా అనుకున్నట్లు గానే హోటల్ దగ్గర కలుసు కున్నారు. చిరునవ్వుతో విష్ చేసుకుని, స్కూటర్లు పార్క్ చేసి, నడుచుకుంటూ బీచ్ వైపు వెళ్లారు గత వారం లో జరిగిన ఆఫీసు కబుర్లు చెప్పుకుంటూ. తిరిగి వచ్చి హోటల్ బోర్డు వంక చూస్తూ “ఇక్కడ చాలా సార్లు తిన్నాం. వేరేచోటికి వెళదామా?“ అన్నాడు ఫణి.
చిరునవ్వు తో తల వూగించింది, తనకు ప్రత్యేకమయిన ప్రిఫరెన్స్ ఏమి లేనట్లు.
మరో హోటల్ లో కార్నర్ లో వున్న విండో సీట్ టెబుల్ ముందు కూర్చోబోతూ, విజయ ముఖం లోకి చూశాడు. ఎందుకో తనేదో వేరే ఆలోచనల్లో ఉన్నట్టుగా అనిపించింది. అదేమీ గమనించనట్లు, మెన్యూ కార్డు చూసి, విజయ వంక చూశాడు, తాను ఏమైనా ఆర్డర్ చేస్తుందేమోనని.
“ఇక్కడ చెనా, భటూరా చాలా బావుంటుంది.” అంది.
“ఇదివరకు వచ్చారా?” అడిగాడు.
“చాలా సార్లు.” అంది.
“ఓకే. దట్ సెటిల్స్.” అంటూ సర్వర్ కి సిగ్నల్ చేశాడు.
విజయ చెప్పినట్లు చాలా బాగుంది. కానీ ఫణి కి చాలా కారం అనిపించింది. చాలా స్పైసీగా ఉందంటూనే, ఇష్టంగా తిన్నాడు. భోజనం చివరగా ఓ ఐస్ క్రీమ్ తో పూర్తి చేశారు.
చాలాసేపటి నుంచి అడగడమా, వద్దా అని మీమాంస లో పడ్డ విజయ చివరకు అడిగింది. అంతవరకు ఫణి, చందూ గురించి మాట్లాడుతాడేమో అని ఆగింది. కానీ ఫణి ఆ ధోరణి లోనే లేడు.
“మీకు చందూ ఎలా తెలుసు?”
“నేను, వాడు చిన్నప్పటి నుంచి క్లాస్ మేట్సు. ఇద్దరం ఒకేసారి ఎంట్రన్స్ రాశాం. వాడు ఖర్గపూర్ IIT, నేను మద్రాస్ IIT లో సెలెక్ట్ అయ్యాము . వాడు ఎప్పుడు బొంబాయి వచ్చినా, నన్ను కలుస్తాడు. ఈ మధ్యే కాస్త బిజీ అయిపోయాడు.” అన్నాడు ఫణి.
మీకు ఎక్కడ పరిచయం అని ఫణి అడుగుతాడేమో అని ఎదురు చూచింది. కానీ ఫణి అడగలేదు.
“వాడికి పెండ్లిట. పిలుపులకు వచ్చాడు.” అన్నాడు ఫణి .
“వెడుతున్నారా?” అడిగింది విజయ, కొంచం ఆశ్ఛర్యపోయినదల్లా తేరుకుని.
భుజాలు కదలించాడు ఫణి. “టైమ్ లేదు. ఇప్పుడు ఆఫీసు లో చాలా బిజీ.“ అన్నాడు.
కబుర్లు సాగుతూనే వున్నాయి. కానీ విజయ దేనికో అసౌకర్యంగా ఉన్నట్టుంది.
అదేమీ పెద్ద గా పట్టించుకోని ఫణి మాట్లాడుతూనే వున్నాడు. సర్వర్ బిల్ తీసుకురాం గానే అందుకుని, “ఇవాళ మన కబుర్లు వచ్చే వారం దాకా వాయిదా వేయాల్సిందే. నేను కొంచెం త్వరగా వెళ్ళాలి” అన్నాడు చేతి వాచ్ చూసుకుంటూ. “వచ్చే వారం ఇక్కడే కలుద్దాం.” అన్నాడు.
సర్వర్ తెచ్చిన బిల్ మీద సంతకం చేసి, లేచి నుంచున్నాడు. కానీ విజయ లేవలేదు. ఒక్క క్షణం విజయ వంక చూచి, మౌనం గా మళ్ళీ ఎదుటి కుర్చీ లో కూచున్నాడు.
“మీతో మాట్లాడాలని వుంది. ఎక్కువ టైమ్ తీసుకోను.” అంది విజయ.
“ఏం ఫరవాలేదు. చెప్పండి. ‘త్వరగా‘ అంటే, నా వుద్దేశం సినిమాకు వద్దని. అంతే “ అన్నాడు.
విజయ తన గోళ్ళ వంక చూసుకుంటూ వుండి పోయింది కొద్ది నిమిషాలు .
“చందూ ఏమైనా చెప్పాడా నా గురించి?” అడిగింది.
అలా ఎందుకు అడుగుతుందో అర్ధం కాని ఫణి తల వూగించాడు ‘అవునూ, కాదూ’ అన్నట్లు.
“మీరు చెప్పిన దాని కంటే ఎక్కువ ఏమి చెప్పలేదు.” అన్నాడు.
అయితే నేను చెప్తాను. ”ఆ రిలేషన్షిప్ చందూతోనే.” అంది ఫణి ముఖం లో కి చూస్తూ. ఫణిలో ఎలాటి రియాక్షన్ వుంటుందో చూడాలన్నట్లు.
అదేమీ గమనించని ఫణి “ఓ రియల్లీ? వాట్ ఎ స్మాల్ వరల్డ్.? అన్నాడు.
విజయ ఇంకా ఏదో మాట్లాడాలనుకుంటోందనిపించింది ఫణికి.
“మనం యిలా కలుసుకోవడం మానేస్తే మంచిదేమో“ అంది.
యిప్పుడు కొంచం ఆశ్చర్యం అనిపించింది ఫణికి. అయినా నవ్వుతూ - “ఒక నెలరోజుల స్నేహంతోనే బోర్ కొట్టేసిందా? అన్నాడు.
“ఛ. ఛ. అది కాదు. నిజంగా మీతో మాట్లాడటం చాలా బావుంటుంది. సమయమే తెలీదు.” అంది వెంటనే.
“మరి?”
విజయకి ఎలా చెప్పాలో తోచడం లేదు. విజయ నాన్న ఫణిని కలవమన్నప్పుడే చాలా ఆలోచించింది. పెద్దగా ఇస్టం లేకపోయినా నాన్న మాట తీసిపారేయలేక కలవడానికి వచ్చింది.
తనకు ఏమాత్రం తెలియని వాడిని పెళ్లి చేసుకునే వుద్దేశం అసలు లేదు. అందుకనే, బాగా తెలిసిన వాడు అనుకుని చందూ తో అపార్ట్ మెంట్ షేర్ చేసు కోవడానికి వెళ్ళింది. కానీ అనుకున్నట్లుగా అవలేదు. ఇద్దరూ విడిపోయారు. అందుకు విజయ బాధేమీ పడటం లేదు. ‘అతను నాలా కాదంతే.’ అనుకుంది తేలిగ్గా. కానీ, ముగిసీ ముగియగానే, మరొక వ్యక్తితో పెళ్ళంటూ వెళ్ళడం అంటే కొంచం యిబ్బంది గానే అనిపించింది. అయినా ఫణిని కలసింది.
చివరికి అంది. “మనిద్దరం యిలాగే డేట్ చేస్తూ వుంటే, మన పెద్ద వాళ్లు పెళ్లి చేసుకోమని వత్తిడి తెస్తారు. నాకుపూర్వం ఎవరితోనో పరిచయంవుందని తెలిసి మీరేం ఇబ్బంది పడలేదు. కానీ యిప్పుడు ఆ ఎవరికో కి ఒక ఫేస్, పేరు తెలుస్తే, అందులోనూ అతను మీ ఫ్రెండ్ అని తెలుస్తే , ముందు, ముందు ఆ విషయం ఇబ్బందికి గురిచేయొచ్చు . అందుకని, ముందుగానే ముగించేస్తే మంచిదనిపిస్తోంది నాకు” అంది. ఆమె కంఠం లో స్థిరత్వాన్ని గుర్తిస్తూ,
“గతంలోని మీ బాయ్ ఫ్రెండ్ నా స్నేహితుడన్న విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా?” అడిగాడు.
“నన్ను కాదు. మిమ్మల్ని బాదర్ చేస్తుందేమోనని.” గొణిగింది.
ఫణి లేచాడు. విజయ కూడా లేచింది.
షేక్ హండ్స్ యివ్వడానికి చేయి చాచాడు.
చేతిలో వున్న విజయ చేతిని సున్నితం గా నొక్కుతూ, “ఎప్పుడో,ఏదో ఇబ్బంది పెడుతుందేమోనన్న అనుమానంతో, యిప్పుడున్న ఫ్రెండ్షిప్ వదులుకోనవసరం లేదు. చూద్దాం! మన ఫ్రెండ్షిప్ ఎంత వరకూ వెడుతుందో?” అంటూ విజయ చేతి మీద రెండో చేయి కూడా వేసి నొక్కి వదిలేశాడు.
విజయ ఫణి ముఖం లోకి తరచి చూచింది. స్వచ్చమయిన స్నేహం కళ్ళల్లో తొంగి చూచింది.
*****