MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
ఆధునికత నేపథ్యంలో-
గంటి భానుమతి
ఆధునికత నేపథ్యంలో పిల్లల పెంపకంపైన రచయిత్రుల రచనలు.
1990 ఆరంభంనుంచి ఈ ప్రపంచీకరణ గాలులు వీచడం ప్రారంభం అయిందని చెప్పచ్చు. అప్పుడు మొదలైన ఆర్ధిక విధానాల క్రమం, తెలుగు సమాజాన్ని అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం సాహిత్యం మీద ఓ పదేళ్ళ తరవాత పడింది. జన జీవనంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల మూలంగా సామాజిక, సాంస్కృతిక విద్యా రంగాలలోని మానవీయ అంశాలపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఎన్నో సవాళ్లని ఎదురుకొంటున్నాయి. ముఖ్యంగా పిల్లల జీవితాలకి సంబంధించిన మౌళిక విలువలు చర్చలకి లోనయ్యాయి. సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైరుధ్యాలు ఎక్కువైపోయాయి. విడిపోని చిక్కుముళ్లు పిల్లలని చుట్టుకుని, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ప్రపంచీకరణ నేపథ్యంలో కథలు, నవలలు, వ్యాసాల విస్తృతి పెరిగింది. కానీ, గమనిస్తే కొన్ని అంశాలలోని కొన్ని కోణాలపై దృష్టి పెట్టలేదని, వాటిమీద విరివిగా రాలేదని చెప్పుకోవాలి. అయితే ఇంతవరకూ వచ్చిన కథలు, నవలలు గమనిస్తే - రచయిత్రులు వివిధ అంతరంగ కోణాల ఆవిష్కరణతో, కథా నిర్మాణం, శిల్ప వైవిధ్యంవంటి విషయాలను పరిగణలోకి తీసుకుని, చక్కటి భాషతో రాయడంలో కృతకృత్యులు అయ్యారనే చెప్పచ్చు. సమాజంపై ఎక్కుపెట్టిన విల్లులా సూటిగా ఉన్నవి, స్పూర్తి దాయకమైనవి, మానవతా విలువలకి అద్దం పట్టేవి, ఇంకా గుండె మూలల్ని తడిమేవి, హృదయాన్ని స్పృశించే కథలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి కూడా. అయితే చాలా మటుకు, ఈ కథల్లో కరిగిపోతున్న బాల్యం, ప్రేక్షకుల్లాగా చూస్తున్న పెద్దవాళ్ళు, పిల్లల్లో పెరుగుతున్న ఒంటరితనం, అభద్రత, తలిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలని చదువు, మార్కులతో ఒత్తిడి చెయ్యడం, తెలిసీ తెలియని వయసులో వేస్తున్న తప్పటడుగులు, వీటి ప్రభావంతో ఉన్నవే వచ్చాయి.
నడిచి వచ్చిన దారిలో దివిటీలు పట్టుకున్నవారు ఎంతోమందున్నారు, కానీ అరాచకాల బాలల ప్రపంచంలో వెలుతురుని ప్రసరింపచేయలేకపోతున్నారు.
నిజానికి పిల్లలకి, స్నేహితులుంటే ఏమీ అక్కర్లేదు. తమ ఇంట్లోని పెద్దలకి కూడా చెప్పడానికి ఇష్టపడనివి అవి ఏదైనా కావచ్చు మనసుల్లోవి అన్నీ కూడా ఎంతో నిస్సంకోచంగా వారితో పంచుకుంటారు.
అలా చెప్పుకునేలాంటి పరిస్థితి లేకపోవడంతో పిల్లలకి స్నేహితులూ లేక, ఇంట్లో వాళ్ళతో చనువూ లేక ఒంటరివాళ్ళైపోతున్నారు. మనసులోది ఎవరితోనైనా చెప్పుకోగలగాలి, ఆ మనసులోది ఏదైనా కావచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, అన్ని పరికరాలు అందుబాటులో ఉండడం తల్లిదండ్రులకి ఓ వరం అయిపోయింది.
ఇది రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి హమ్మయ్య గండం గడిచింది అనే వ్యాసం లో రాసారు. ఇప్పుడు జరుగుతున్నది అదే.
ఇంట్లో వాళ్ళే కొని ఇచ్చిన ఐపాడ్, లేకపోతే కంప్యూటర్ నేస్తాలైపోయాయి. వాటితోనే అన్నీ చెప్పుకుంటూ రాస్తున్నారు. అయితే ఈ మాధ్యమం ఎంత చేటు చేస్తుందో పిల్లలకి తెలీదు. ఎందుకంటే, ఈ సోషల్ మీడియాలో బింబం ఒకలాగా, ప్రతిబిబం మరోలాగా ఉండదు. అందుకని పిల్లలకి కంప్యూటర్ లో ఏం రాస్తున్నారో తెలిసినా దాని పరిణామం ఎలా ఉంటుందో తెలీదు.
ఇదే విషయం మీద వచ్చిన కథలు -"ఎటుపోతోంది బాల్యం", "పెద్దరికం అంటే!". ఈ రెండు కథల్లో, మనసులోది చెప్పుకునేందుకు ఎవరూ లేకపోవడం వలన ఏం జరుగుతుందో రచయిత్రి (గంటి భానుమతి. అంటే నేనే!) చెప్తారు. రెండు కథల్లో ఒకేలాంటి సమస్య ఎదురవుతుంది. 'ఎటుపోతోంది బాల్యం'లో ఎనిమిదో క్లాసు చదువుతున్న పిల్లాడు, ముఖపుస్తకం లో ఒకమ్మాయి మీద తనకున్న అభిప్రాయాన్ని రాసుకుంటాడు. దాన్ని అందరితో పంచుకుంటాడు. ఇంకేముంది, క్లాసులో వాళ్ళకే కాకుండా స్కూల్లో అందరికీ తెలుస్తుంది. మర్నాడు ఆ అమ్మాయి పెద్దవాళ్ళు వచ్చి గొడవ చేస్తారు. అప్పుడు ఆ బడి ప్రధానోపాధ్యాయురాలు, మిగిలిన ఉపాధ్యాయులని పిలిచి, మీటింగ్ పెడతారు. ఇన్నాళ్ళూ మనం పిల్లలకి ఏనుగు లక్ష్మణ కవి, భర్తృహరి, సుమతీ, కుమారీ శతకాలు, మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దు లాంటి నీతులు బోధించాం కానీ ఇప్పుడు వాటితో పాటూ సైబర్ నేరాల గురించి, ఆ నేరాలు చేస్తే ఏం అవుతుందో, ఎలాంటి శిక్షలు పడతాయో, అన్నీ కూడా నీతి కథలు చెప్పినట్లు చెప్పాలి. ఈ పిల్లల ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఎక్కువ ముఖ పుస్తకంతో గడుపుతూండడంతో, పిల్లలు కూడా అదే చేస్తున్నారు. పిల్లల ముందు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలుసుకునేలా పెద్దవాళ్ళని కూడా పిలిచి ఓ మీటింగ్ లో చెప్పాలి. అప్పుడే మన స్కూలుకి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అని అంటారు.
అలాగే పెద్దరికం అనే కథలో తొమ్మిదో తరగతి చదువుకుంటున్న అమ్మాయి, మనసులోది చెప్పుకునేందుకు ఎవరూ లేక తనలో తనే మాట్లాడుకుంటూంటుంది. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు, క్రమం తప్పకుండా పాఠశాలకి వచ్చే మానసిక వైద్యురాలకి చూపించి ఆమె సూచన మేరకు ఆమె తలిదండ్రులని పిలిపిస్తారు. తల్లి కారణాంతరాల వలన బడికి వెళ్ళదు. తండ్రి అతి కష్టం మీద సమయం చూసుకుని వెళ్తాడు. అక్కడ ఉపాధ్యాయులు చెప్పినది విని, నిజం తెలుసుకుంటాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే కూతురు డైరీ చూస్తాడు. అందులో ఆమె తన మనసులోని భావాలన్నీ ఓ మహేష్ అనే అబ్బాయితో చెప్పుకుంటున్నట్లుగా రాసుకుంటుంది. కూతురు వచ్చాక ఆమెనే అడుగుతాడు. ఈ మహేష్ ఎవరని? 'ఎవరో తెలీదు. నా మనసులోనివి అన్నీ చెప్పుకోడానికి నేను సృష్టించుకున్న ఊహ. నా ఒంటరితనంలో నాకు తెలీకుండా నా బాధ, నా ఆలోచనలు, నా ఊహలు అన్నీ చెప్పుకోడానికి నా తోడు. ఆ మహేష్ ఓ బల్ల కావచ్చు, గోడ కావచ్చు, ఈ టేబులు కావచ్చు' అంది. ఆ తండ్రి నోట మాట రాలేదు. ఇది ఓ రకమైన పిచ్చా? లేకపోతే పిచ్చిపిల్లగా మారడానికి ఇది మొదటి అడుగా? కూతురు ఎలాంటి స్థితిలో ఉందో అర్థం అయ్యాక అతనికే పిచ్చి పట్టినట్లయింది. పెద్దవాళ్ళుగా తాము ఎంత తప్పు చేస్తున్నారో తెలుసుకుని ఆరోజు నుంచి కూతురు ఇంటికి వచ్చే సమయానికి తల్లిదండ్రి ఇద్దరూ ఇంటికి వచ్చేయడం మొదలు పెడతారు. పూర్తిగా మానసిక రోగి కాకుండా సరి అయిన సమయంలో గమనించి కూతురిని కాపాడుకుంటారు. పిల్లలకి ఇంట్లోని పెద్దవాళ్ళే రోల్ మోడల్స్. అందుకని ఇంట్లోని పెద్దవాళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మంచి నడవడి నేర్చుకునేలాగా ప్రవర్తించాలి. అనే విషయం మీద వచ్చిన కథ.
మనుషుల మధ్య పెరుగుతున్న అంతరాలను చిత్రీకరించిన కథలు కూడా వచ్చాయి. పెద్ద మార్పులతో గొప్ప బీద మధ్య అంతరాలు పెరిగినా, వీధి బాలల బతుకుల్లో ఏ మార్పు రాలేదని తెలిపేవి ఆకలి, కరవు, అవిద్య అజ్ఞానం వీటి తీవ్రత జీవితాల్ని ఎంత అస్తవ్యస్తం చేస్తాయో తెలిపే కథలు, 'పొడిచే పొద్దు' మరియు 'కనుచూపుమేరలో' అనే కథలు.
ఆ రెండూ కూడా విలువల పతనం, మానవ మనుగడ ఎంత భయంకరంగా ఉందో అని తెలిపేవి. (రచయిత్రి కన్నె గంటి అనసూయ) 'పొడిచే పొద్దు' కథలో సూర్యుడు ఇంకా లోకాన్ని చూడకుండానే మార్కెట్లో కూరగాయలు ఏరుకుని వాటిని బతికే సుబ్బుగాడు బడుగు జీవుల ప్రాతినిధ్య పాత్ర. అనసూయ రాసినదే మరో కథ- తెలిసీ తెలియని వయసులో ఉన్న పోరిగాడి కథ. కనుచూపుమేరలో లో ఓ పల్లీల బుట్ట, భరత్ నగర్ స్టేషన్లో పల్లీలు అమ్మడం అనే ఓ అతి చిన్న ఆశ నెరవేర్చుకోవడం కోసం వాడు పడ్డ కష్టం, అంతా మరిచిపోయీ తన తోటివాడికి సాయపడడానికి సంసిద్ధం అవుతాడు. ఇప్పుడు వాడి కళ్ళ ముందు పల్లీల బుట్టా లేదూ, బుట్టలో కాయలు అంతకన్నా లేవు, వాడి కళ్ళ ముందున్నదంతా- వాడికి తన భుజాన్ని ఆసరాగా ఇస్తూ తాను నడవాల్సిన దారే. అన్న వాక్యాలతో కథ ముగుస్తుంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన కథలని, నవలలని గమనిస్తే, నిరంతరం మార్పులకి లోనవుతున్న సమాజం కనిపిస్తుంది. పిల్లలకి విద్యా బుద్దులు నేర్పించి, కెరీర్ ని ఏర్పరిచి మార్గనిర్దేశం చేయడంలో ఇంట్లో పెద్దవాళ్ళ పాత్ర ఎంత ఉంటుందో తెలిపే నవల (గంటి భానుమతి ) తప్పటడుగు. ఇందులో ఓ పదిహేనేళ్ళమ్మాయి, పదో క్లాసు పరీక్షలు రాసిన అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోదామని నిశ్చయించుకున్న విషయం తల్లికి తెలిసి ఎంతో తెలివిగా, ఆ వయసులో పెళ్ళి చేసుకుంటే ఎలాంటి జీవితం ఆమె గడపాల్సి వస్తుందో ప్రత్యక్షంగా కూతురికి చూపిస్తుంది. తెలిసీ తెలియని వయసులో యువతీ యువకుల మధ్య పరస్పర ఆకర్షణ తాత్కాలికం, ఆపై సంభవించే ప్రతికూల పరిస్థితులను పరిష్కార మార్గంతో తెలివిగా తిప్పి కొట్టి ఆ పిల్లల్లో వివేకవంతమైన ఆలోచనని కలిగించడమే ఇందులోని ఇతివృత్తం. టీవీ, సినిమా రంగ ప్రభావంతో నవతరం చేజేతులా భవిష్యత్తుని ఎలా నాశనం చేసుకుంటోందో ప్రత్యక్షంగా అక్షర రూపం కట్టించిన చిత్రణం ఇది.
ఒంటరితనం ఎంత పనైనా చేయిస్తుంది. అదే జరిగింది 'తెల్ల గులాబీ'లో. (అత్తలూరి విజయలక్ష్మి) అది సక్రమం కావచ్చు, అక్రమం కావచ్చు వాటి మధ్య ఉన్న తేడా తెలీని వయసు. ఈ రెండింటికి మధ్య ఉన్న గీతకి ఆవలనో ఈవలనో ఉండడమే ఈ నవల సృజనకి మూలం అయింది.
డబ్బు అనేది ఆరో ఇంద్రియం అయిపోయింది. పంచేంద్రియాలకన్నా శక్తివంతం. మన చుట్టూ అల్లుకుని ఉన్నవి మానవ సంబంధాలు. ఈ అల్లికనే మనం వ్యవస్థ అని పిలుచుకుంటున్నాము.
డబ్బు కిచ్చిన ప్రాధాన్యత ముందు పిల్లలు అల్పులుగా కనిపిస్తారు. అక్కడ పిల్లలు కాకుడా డబ్బుల మూట కనిపిస్తూంటే ఆ బంధంలో ప్రేమ, ఆప్యాయత ఎందుకుంటుంది, ఉండదు. ఇదే విషయం తీసుకుని వచ్చిన హృదయ విదారకమైన కథ, వారణాసి నాగలక్ష్మి రాసిన ‘గోడ మీద బొమ్మ’ కథ. సరిగ్గా అదే సమయంలో ఓ సినిమాకి ముద్దులొలికే యేడాది వయసు పిల్లాడు కావాలన్న పేపర్లో ప్రకటన చూసి కొడుకు ఫొటో పంపిస్తాడు. ఆ పిల్లాడు వాళ్ళకి నచ్చుతాడు. వాళ్ళు పెట్టిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడవుతాడు. షూటింగ్ కి రావలసిందని పురుషోత్తంతో అంటారు. వాళ్ళ దగ్గర అడ్వాన్సు తీసుకుంటాడు. ఆ వెంటనే షూటింగులకోసం కోసం స్టూడియోకి, భార్య నిర్మలని, కొడుకుని తీసుకుని వెళ్తాడు. అంతవరకూ కొడుకుతో షూటింగ్ అంటే, సినిమాల్లో ఉయ్యాలలో ఊపుతూండే సీన్లు, హీరో హీరోయన్లు పసివాడికి అటూ ఇటూ మొహాలు ఆనించి, చిలిపి సరసాలూ, సరదా పాటలు పాడే దృశ్యాలని నిర్మల ఊహించుకుంటుంది. కానీ అక్కడ జరుగుతున్నది చూసాకా కొడుకుని తీసుకెళ్ళి పోవాలనుకుంటుంది, కానీ పురుషోత్తం ఒప్పుకోడు. గుర్రాల పైన ఎత్తుకుని దెబ్బలాటలు, పైనుంచి కింద పడేయడాలు, గుక్క పట్టి ఏడుస్తున్న కొడుకుని తీసుకోవాలని గుండెలకి హత్తుకోవాలని అనుకుంటుంది. కానీ షూటింగ్ లో అందరూ మధ్యలో తీసుకెళ్ళడానికి ఒప్పుకోరు. అడ్డుకుంటారు. నిస్సహాయంగా మనసులోనే ఏడ్చేస్తుంది. ఒళ్ళు వెచ్చగా ఉన్నా భర్త కొడుకుని తీసుకుని స్టూడియోకి తీసుకెళ్తూంటే ఆపే ప్రయత్నం చేస్తుంది, కానీ పురుషోత్తం ఒప్పుకోడు. పైగా మరో సినిమాకి అడ్వాన్సు కూడా తీసుకుంటాడు. తన జోలికి వస్తే పిల్లి కూడా పులై తన పిల్లలని కాపాడుకుంటుంది. నేను కాపాడుకోలేనా నా కొడుకుని? అని అనుకుంటుంది. ఇది పిల్లలని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదన కోసం, పిల్లల మీద జరుగుతున్న హింసల పై నాగలక్ష్మి రాసిన అద్భుతమైన కథ.
ఇటువంటిదే మరో కథ అమ్మోరు అనే ఏనుగు కథ. ఇందులో శారీరకంగా ఎదగని తమ కూతుర్ని అమ్మవారులాగా తయారు చేస్తారు తండ్రి, అన్న. ఉదయం నుంచి రాత్రి వరకూ కూచోపెడ్తారు. అన్నం అదీ పెట్టకుండా పాలూ పళ్ళూ అవి మాత్రమే ఇచ్చి పస్తులు ఉంచుతారు. ఆమె ఆడపిల్ల. భౌతికంగా ఎదగక పోయినా, ప్రకృతి పరంగా సహజంగా ఆమె శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ల దగ్గర పనిచేసే వాడిని ప్రేమిస్తుంది. ఆమె మొండిగా ఇంట్లోంచి వెళ్ళిపోడానికి తయారవుతుంది. ఆమె ఏ క్షణంలోనైనా నిజం చెప్పేస్తుందేమోనని మోసం బయటపడిపోతుందేమోనని భయపడుతూ ఉంటారు. నిజంగానే ఆమె ఓరాత్రి, రోజూ తను వేసుకునే బంగారు ఆభరణాలు, ఓ పెద్ద సంచీలో పెట్టుకుని తన గది బయటికి వస్తుంది. అది కనిపెట్టిన తండ్రి, అన్న అందరూ కలిసి చంపేస్తారు. చచ్చిపోయాక ఆమె ఫొటో పెట్టి పూజలు జరిపిస్తారు. భక్తుల రద్దీ ఇంకా ఎక్కువే అయింది కానీ తగ్గలేదు. ఇంకా ఎక్కువ కానుకలు, డబ్బు, రాసాగాయి. కూతురని కూడా చూడకుండా డబ్బుకోసం,పేరు కోసం ఆమె ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు.
వారణాసి నాగలక్ష్మి రాసినదే మరో అద్భుతమైన కథ- "ఆసరా". పచ్చి నిజాన్ని అక్షరబద్ధం చేసిన కథ. అంతర్జాలంలో సామాజిక మాధ్యమాల నిర్వాహకులు అమాయక యువతీ యువతులని ఎలా వల వేసి, ట్రాప్ చేసి, వారి మానప్రాణాలతో చెలగాటమాడుకుంటారో, అలాంటి దారుణానికి ఆత్మహత్యే శరణ్యంగా భావించినవారికి మానసికంగా ధైర్యం చెప్పి, ఆసరా చూపించిన ఓ సందేశాత్మక కథ.
భ్రూణ హత్యలపై వచ్చిన వచ్చిన రెండు కథలు. మొదటిది రేపటి ప్రశ్న, రెండోది ‘చిన్నబోదా చిన్ని ప్రాణం’. 'రేపటి ప్రశ్న'- సమాజమే రోగగ్రస్తమయితే ట్రీట్మెంటు ఎవరివ్వగలరు? అని డాక్టర్ అనుకోడంతో కథ ముగుస్తుంది. నాగలక్ష్మి రాసిన పిల్లల పెంపకం సవాళ్ళని ఎదురుకున్నమరి కొన్ని అద్భుతమైన కథలు ఇదే విషయం మీద వచ్చినవి -'నేను అమ్మనవుతా', 'అమ్మా నాన్న ఓ కాలేజీ అబ్బాయి','నాన్నకో ఈ మెయిల్' 'అరుణోదయం', 'సరళీస్వరాలు' మొదలైనవి.
ఎంతో చక్కగా పెంచుతున్నామనుకునే తల్లుల గురించి కూడా కథలు వచ్చాయి. అందరు తన కూతురి గురించి గర్వంగా, గొప్పగా చెప్పుకోవాలని ఆరాటపడే తల్లి కోణం తీసుకుని మంథా భానుమతి రాసిన నవల "మౌనంగానే ఎదగమని.." ఈ నవలకి అనీల్ అవార్డు కిందపాతిక వేల రూపాయల బహుమతి వచ్చింది. అద్భుతమైన నవల.
ఇటువంటి అంశం మీదే వచ్చిన మరొకటి- సి.యమున రాసిన కథ "ఆట". అయితే ఈ కథలో కూడా తల్లి, కొడుకు ఉన్నారు. తన కొడుకు క్రికెట్ ఆట ఆడుతూ, పేరు తెచ్చుకోవాలి ఎంతో డబ్బు సంపాదించాలి అని ఆ తల్లి, దగ్గరుండి కొడుకు ధీరజ్ ని క్రికెట్ కోచింగ్ కి తీసుకెళ్తుంది ఆ తల్లి. దగ్గరుండి ప్రాక్టీసు చేయిస్తుంది. ఎలాగైనా కప్పు గెలవాలన్న కలలు కన్న ఆ పిల్లాడు ఓడిపోతే, ఏం జరిగిందన్నదే ఇందులోని ఇతివృత్తం. ఆ పిల్లాడిని పెంచడంలో ఆ తల్లి చేసిన పొరపాట్లని ఆ తల్లితోనే రచయిత్రి చెప్తారు.
అలాగే మరో కథ “మనోహరం”. పిల్లల మీద తమ ఇష్టాలని రుద్దకుండా, వాళ్ళకి ఎందులో అభిరుచి ఉందో తెలుసుకోవాలి అని తెలిపే కథ, ఈ మనోహరం.
మరో చక్కటి కథ- ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేన్న ఇళ్ళల్లో పెంపకాలు మరోలాగా ఉంటాయి. ఇద్దరూ ఉద్యోగం చేస్తే కానీ గడవని అమెరికాలో ఓ జంట కథ వారి పిల్లాడి కథ గంటి సుజల రాసిన “గుండుగాడు”. ఈ కథలో, ఆ చిన్నవాడిని చూడడానికి ఓ ఆరు నెలలు అమ్మమ్మ, మరో ఆరు నెలలు నాయనమ్మ వంతుల వారిగా అమెరికా వెళ్ళి, గుండుగాడిని చూస్తూ వారి వారి పద్ధతుల్లో పెంచుతూంటారు. కాస్త పెద్దయ్యాక, ఆ పెద్దవాళ్ళు కారణాల వల్ల రాలేకపోతారు. అందుకని డే కేర్ లోఉంచుతారు. అక్కడ చూసేవారు నానీలు, వాళ్ళూ మధ్య మధ్యలో మారుతూంటారు. ఓ మూడు నెలలు ఓ నానీ, మరోసారి మరో నానీ, తల్లి ఇంటి దగ్గర ఉంటే అమ్మ, ఇలా అందరి పెంపకంలో ఉన్న ఓ గుండుగాడి మనస్సుని అందంగా అద్భుతంగా అక్షరాల్లో అనువదించిన కథ.
సుజల కలం నుంచి వచ్చిన మరో కథ- "సహజ". చిన్నతనంలో తండ్రి గారాబంతో పెరిగిన సహజ తండ్రి మరణానంతరం ఆమె లోకం మారిపోతుంది. అంత వరకూ ఎంతో గారాబంగా పెరిగిన సహజ పరుల పంచన తల్లితో సహా జీవనం సాగించాల్సి వస్తుంది. ఈ రెండూ కూడా పిల్లల మనస్తత్వానికి, ఆ తల్లులు పడిన ఆరాటం, తాపత్రయానికి అద్దం పడతాయి.
పిల్లల మనస్తత్వాలు, వారి పెంపకం గురించి బాగా తెలిసిన మరో మంచి రచయిత్రి పోడూరి కృష్ణకుమారి. ఆమె రాసిన (అనీల్ అవార్డు పొందిన కథ) "సంస్కృతి బతుకుతుందా?!” అన్నది ప్రపంచీకరణ వెల్లువలో తరతరాలుగా ఉన్న విలువలు కొట్టుకుపోతూంటే, ఓ చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. పిల్లల పెంపకం అంటే ఏఁవిటో, దానికి ఏం కావాలో, మన సంస్కృతి పెంపకానికి ఎంత అవసరమో అది నేటి తల్లిదండ్రులకి, పిల్లలకి చెప్తారు.
ఇదే విషయం మీద వచ్చిన భారత భాగ్య, వివేకబాలా నగర్, జగదాంబ, ఇదం శరీరం, వీటన్నింటిలో కూడా పిల్లలు ఇంట్లోనే కాకుండా బయటి వాతావరణంలో ఎంత ఆనందంగా పెరుగుతారో, మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉంటారో తెలియచేస్తారు.
అలాగే భూ. భ. వ. అంటే భూత, భవిష్య, వర్తమాన అనే నవల. రోదసి పరిశోధనలపై తెలుగులో వచ్చిన మొదటి నవల. ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం, సహకారం ఉంటే పిల్లలు ఎంత కష్టమైన పరిశోధనలైనా చేస్తారు. ఇంట్లో వాళ్ళ సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలియచేసే నవల. ఈ నవలకి పాతికవేల రూపాయల బహుమతి వచ్చింది.
బాల్యం అమూల్యం కానీ అది కొంతమందికి అందని ద్రాక్షే అవుతోంది. ప్రపంచం మారినా మారని బతుకుల గురించి వచ్చిన కథలు. పేదరికం, అనారోగ్యం, అవిద్య వారిని పెంచుతోంది. తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోని పిల్లలు గాలికి పెరుగుతూ కూడా తాము ఎవరి మధ్యలో ఉంటున్నారో వాళ్ళ ప్రేమని పొందుతూ మంచి ప్రవర్తనతో వచ్చిన కథలు జానకి గారి కథలు.
ఈ కథలు ప్రపంచీకరణం వాటి ప్రభావం తాలూకు నీడలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పడిన కథలు. గెలుపు, ఊరు బాగు పడాలి, నేర్చుకున్న పాఠం, పూలగుత్తి, జ్ఞానోదయం, అమ్మ కేకలేసిందా- ఈ కథలని రాసిన రచయిత్రి, తమిరిశ జానకి గారు. ఈ అన్ని కథల్లో కూడా పిల్లలే కథానాయకులు. చిన్న చిన్న కోరికలు, ఇష్టాలు, అవి సమంజసం కావచ్చు, అసమంజసం కావచ్చు, కానీ విశేషమైన ప్రాపంచిక దృక్పథంతో చిన్న చిన్నసంఘటనల ద్వారా జీవితపరమార్థాన్ని చూపిస్తూ, పెద్దవాళ్ళు వాటిని కనిపెట్టి, దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారు. వాళ్లు నిరాదరణకి గురి కాకుండా చూస్తారు.
నిజానికి పిల్లల పెంపకం అనేది ఎంతో పెద్ద సామాజిక బాధ్యత. అందుకని, ఇంట్లోని పెద్దవాళ్ళు తమ పిల్లలని ఎలా చూడాలనుకుంటున్నారో, ముందు తాము అలా ఉండాలి. అలాగే ప్రవర్తించాలి. తాము మాట్లాడే భాషలో తగు జాగ్రత్త తీసుకోవాలి. అంతే కాకుండా తల్లిదండ్రులకి పిల్లల పెంపకం విషయంలో వారు చూపించే ప్రేమ మమకారాలతో పాటూ దూరదృష్టి, లోతైన పరిశీలన, పిల్లల మనసులని అర్థం చేసుకునే అవగాహనా సామర్థ్యం తప్పకుండా ఉండాలి అన్న సందేశమే ఈ కథల్లో నవలల్లో మనకి కనిపిస్తుంది.
అలాగే గంటి భానుమతి, సుజల, సమ్మెట ఉమా దేవి, నండూరి సుందరీ నాగమణి, గంటి ఉషాబాల, ఆకెళ్ళ సుబ్బలక్ష్మి, ఇంకా ఎంతోమంది రచయిత్రులు ఎన్నో మంచి, చక్కని కథలు రాసారు. వ్యాసం నిడివి ఎక్కువై పోతుందని రాయలేకపోతున్నాను.
పిల్లలు ఏ విషయాన్నైనా పెద్దవాళ్ళు చెప్తే విని నేర్చుకోరు. కానీ ఇంట్లో వాళ్ళు, తలిదండ్రులు చేసే పనులని చూసి నేర్చుకుంటారు. ఇంట్లోవాళ్ళు యెటువంటి నియమ నిష్టలూ లేని జీవితాన్ని గడుపుతూ పిల్లలకి నీతిపాఠాలు చెప్పినందువలన ఏమీ ప్రయోజనం లేదు. అని స్వర్గీయ సోమరాజు సుశీల గారు ఓ వ్యాసంలో రాసారు.
పిల్లలు మానసికరోగులుగా, డ్రగ్ ఎడిక్ట్ లుగా, వ్యసనపరులుగా కాకుండా సమాజానికి బాధ్యత గల పౌరులని అందించడంలో ఇంట్లో వాళ్ళదే బాధ్యత. నిజానికి పిల్లలకి ఏం అక్కర్లేదు, నీ వెనక మేమున్నాము అన్నట్టుగా ప్రవర్తించడం, వాళ్ళని ప్రోత్సాహపరుస్తున్నట్లుగా ఓ చిన్నపాటి మెప్పు, భుజం తట్టడం, ఓ చిన్న స్పర్శ, ఓ పావుగంట వాళ్ళ పక్కన కూచుని, వాళ్ళు చెప్పేది వినడం చేస్తే ఆ ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య, ఓ చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. పిల్లలు కూడా మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అందుకని పిల్లల కాళ్ళకి చక్కటి, గట్టి నేలనివ్వాలి. అంతేకానీ ఎడారిలో కూరుకు పోయే ఇసకలాంటిది కాదు. అందుకని ముందు మారాల్సింది పెద్దలు.
ధన్యవాదాలు.
(న్యూజిలాండ్ ప్రత్యక్ష వేదికగా అంతర్జాలంలో జరిగిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు - 2021 లో చేసిన ప్రసంగం నుంచి -)
*****