top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
pustaka-parichayaalu.jpg
alanati.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
paatasanchikalu.jpg
maagurinchi.jpg

సంపుటి 8  సంచిక  1

జనవరి-మార్చి 2023 సంచిక

rachanalu.jpg

కథా​ మధురాలు

అభికాంక్ష

 

మణి వడ్లమాని

mani-vadlamani.JPG

 ఫోన్ మోగింది. పుస్తకం చదువుతున్న మైథిలి ఆ శబ్దానికి ఉలిక్కి పడింది. ఫోన్ తీసి, హలో అని పలకరించి, అవతల నుంచి వాళ్ళు అడిగిన దానికి “అవును!నేనేనండి”.  అంది.

 

మళ్ళీ అవతల నుంచి వాళ్ళు అడిగిన దానికి జవాబుగా "సరే, అలాగే. ఇదిగో ఇప్పుడే అడ్రస్WhatsApp చేస్తాను" అని పెట్టేసింది.

 

రెండు రోజులు గడిచాయి.

 

మూడో రోజున కొరియర్ వచ్చింది. విప్పి చూసింది మైథిలి. పసుపు బట్టలో కట్టి ఉంచిన రామకోటి పుస్తకాలు. చాలా పాతబడిపోయి శిధిలావస్థలో ఉన్నాయి. ఎవరు వ్రాసారో పేరు కనిపించలేదు. అక్షరాలు అలుముకుపోయి ఉన్నాయి. ఒక్క క్షణం అర్ధం కాలేదు. కానీ కనబడ్డ వరకూ రాత బాగా తెలిసినట్లుంది. ఒక పుస్తకం తీసి జాగ్రత్తగా అటు ఇటు తిప్పి చూసింది. ముట్టుకుంటే పొడి పొడిగా రాలేట్టు ఉన్నాయి. గళ్ళు కొట్టి ఉన్న ఆ నోటుబుక్ కి నాలుగు మూలలా పసుపు రాసి ముందు,వెనుక,మధ్య లో కుంకుమ బొట్టు పెట్టి ఉంది.

 

కానీ, ఇది.. ఇది.. అవును. ఈ వాసన.. ఎన్నెన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. మెదడు పొరల్లోని అరలలోంచి తెరలు తెరలుగా అవి పొంగుతున్నాయి.

 

పుస్తకం మధ్యలో భద్రంగా మడత పెట్టిన ఆ రెండు పేజీలు చదివాక అనిపించింది. మనసులో దాగిన విషయాన్ని రాసుకున్న ఆ రెండు కళ్ళకి తెలియదేమో మరో జత కళ్ళు ఇలా చదివేస్తాయని.

 

తప్పని తెలుసు కానీ కుతూహలం హద్దులు చెరిపేసింది.

“రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః” శ్లోకం లీలగా మైథిలీ చెవిలో వినిపిస్తోంది.

 

అది ఆమెకి బాగా పరిచయం ఉన్న గొంతు.

 

 **

 

“హే! భలే భలే మమ్మీ ఇంకా చెప్పు. ఈ ఊర్లో ఏముంటాయో?” అని ఒకటే ప్రశ్నల బాణాలు సంధించేస్తున్నారు.

ఇంటి నుంచి పొద్దున్నే బయలుదేరారు. సాయంత్రం మూడు నాలుగు కల్లా చేరిపోతారు. ఆ మరునాడు పొద్దున్నే కార్యక్రమం కానిచ్చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు.

సోమవారం నుంచి మళ్ళీ రొటీన్ మొదలు. అందుకు అలా ప్లాన్ చేసుకున్నారు. మైథిలి, సాకేత్ లు డ్రైవరుని పెట్టుకున్నారు. ఊర్లో ఏదైనా పని ఉంటే సాయం ఉంటాడని,పైగా అతను ఆ ప్రాంతం వాడు అవడం మరో ఎడ్వాంటేజ్.

హైవే మీద ఉన్న పెద్ద రెస్టారెంట్ లో కడుపునిండా బ్రేక్ ఫాస్ట్ చేసి బయలు దేరారు. పిల్లలు కబుర్లు చెప్పుకుంటున్నారు. సాకేత్, డ్రైవర్ మాట్లాడుకుంటున్నారు. మైథిలి కళ్ళు మూసుకుంది. కారు ముందుకి ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి.

మధ్య మధ్యలో మాటి మాటికి ఆ బాగ్ వంకే చూసుకుంటోంది. ఒక చిన్న పిల్లవాడిని కూర్చో పెట్టినట్టుగా ఉంది. కొత్త వెదురుగంప లో మామిడి ఆకుల మధ్యలో పసుపు గుడ్డ చుట్టి ఉన్న మూట. దానిపైన శ్రీరాముడి ఫోటో పెట్టింది.

ఇష్టమైన వాళ్ళకోసం చేసేది ఏదైనా మన నమ్మకాలతో పని ఉండదు అనుకుంది మైథిలి.

 

వెళ్ళే దారి లోనే ఉన్న ఒక పెద్ద వినాయకుడి గుడి, ఆ తరువాత ఇంకొంచెం ముందుకు వెళ్లి, సుబ్రమణ్యస్వామి గుడి దర్శనం చేసుకున్నారు.

 

సాయంత్రానికల్లా మామిడాడకి చేరుకున్నారు.

 

కొబ్బరితోటలూ, మామిడితోపులూ వాటి మధ్యలో వరిపొలాలూ, ఆ గట్ల మీద బంతి పూలు,చేమంతి మొక్కలు, గోదావరి పిల్లకాలువలతో ఆహ్లాదకరమైన వాతావరణం. మరో పది రోజుల్లో సంక్రాంతి వస్తోందేమో ఆ హేమంతశోభతో అందంగా కనిపిస్తోంది.

 

ఊర్లోని బస్ స్టాప్ దగ్గర వీళ్ళని రిసీవ్ చేసుకునేందుకు ఒక మనిషిని పంపించారు. సాకేత్ అతనితో ఫోన్ లో టచ్ లోనే ఉన్నారు. వచ్చినతను ముందు బైక్ మీద వెళుతూ ఉంటే వీళ్ళ కారు అతన్ని అనుసరించింది.

సూర్యనారాయణమూర్తి గుడి కి ఎదురుగా ఉన్న ఇల్లు.

“రండమ్మా! రండి!! నిన్ను ఎప్పుడో చిన్నతనం లో చూసాను” అంటూ కామేశ్వరరావు, అతని భార్య శ్యామలాంబ కూడా ఆప్యాయంగా వీళ్ళని పలకరించి లోపలి తీసుకుని వెళ్లారు.

ముందు పిల్లలిద్దరూ బెరుకుగా ఉన్నారు కానీ, కొంతసేపటి సమయంలోనే ఆవిడ వెంట వెంట తిరుగుతూ కబుర్లు చెబుతున్నారు.

మైథిలి లేచి వెళ్లి ఇల్లంతా కలయతిరిగింది. చక్కటి పెంకుటిల్లు, వరండాలో మడత కుర్చీలు, ఆ పక్కన విసనకర్రలు, ఇంటి ముందు అరుగులు, వాకిట్లో పేడ కల్లాపులు, చక్కటి ముగ్గులు.

ఇంటిలోపల కెళితే మధ్యలో ఖాళీ ప్రదేశం, చుట్టూరా స్థంభాలు.  అచ్చమైన మండువా ఇల్లు. టేకు తలుపులు, వాటికి గడీలు, గొళ్ళాలు, గుమ్మాలకు పసుపుపచ్చ అలంకారాలు, గోడలకు వేలాడుతూ పాత ఫొటోలు, కొన్నిటిలో మొహాలు చెరిగిపోయి ఉన్నాయి.

 

పడక గదిలో ఎత్తైన పందిరి మంచం. అంత ఎత్తు ఎలా ఎక్కుతారో? నవ్వుకుంది.

 

తళతళ మెరిసిపోతూ కనిపించే ఇత్తడి, రాగి సామాన్లు, ఆ పక్కన, బియ్యపు బస్తాలు, పచ్చడి జాడీలు, పెరట్లో తులసమ్మ, మంచినీళ్ళ నుయ్యి, కనకాంబరం, నిత్యమల్లి, పారిజాతం, ముద్ద మందారం పూలమొక్కల తో పాటు అరటి, జామచెట్లు, ఎత్తుగా కొబ్బరి, పనస చెట్టు, వేప చెట్టు ఉన్నాయి.

నూతి దగ్గర ఉన్న మందారం చెట్టును చూడగానే మైథిలికి చిన్నతనపు జ్ఞాపకం ఏదో ఓ మెరుపులా మెరిసింది.

వేడి వేడిగా శ్యామలాంబ పెట్టిన కమ్మటి భోజనం తినేసి అలసిపోయారేమో, రాత్రి తొందరగానే పడుకున్నారు.

 

తెల్లవారుజామున నాలుగు గంటలకే గుడి లోంచి సూర్య స్తోత్రం తో పాటు తిరుప్పావై వినిపిస్తోంది.

 

మైథిలి లేచి సంప్రదాయంగా పట్టుచీర కట్టుకుని తయారయేంతలో, సాకేత్ కూడా పిల్లల్ని తయారు చేసి, తను కూడా రెడీ అవటంతో అనుకున్నట్టుగానే ఆ ఉదయాన్నే బయల్దేరారు. అందరూ పట్టుబట్టలతో సంప్రదాయబద్ధంగా ఉన్నారు.

 

“శ్రీరామచంద్రునికి ఇష్టమైనది హేమంత ఋతువు అని వాల్మీకి మహర్షి రామాయణం లో చెప్పారు. చాలా పవిత్రమైన మాసం లో తెచ్చావమ్మా ఈ రామకోటి పుస్తకాలను. చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నారు" అంటూ పలకరించారు కామేశ్వర్రావు.

 

ఇంతలో సన్నాయి మేళం వినిపించింది.

 

“ఈ రామకోటి వ్రాసిన పుస్తకాలని పల్లకీ లో పెట్టి మేళతాళాలతో తీసుకుని వెళ్దామని అనుకున్నారు. ఇదో ఉత్సవం. రకరకాలుగా భగవంతుడిని ఆరాధిస్తారు. ఇది కూడా ఓ ఆరాధనా పద్ధతే!” అన్నారు శ్యామలాంగ రెండు చేతులు జోడిస్తూ!

 

అందరూ ఆ పల్లకి వెనకాల వెళ్లారు. వీళ్ళతో పాటుగా ఆ ఊర్లో కొంతమంది వచ్చారు. “ఎంతో వైభవంగా జరుగుతోంది!" అంటూ మావగారికి లైవ్ వీడియో చూపిస్తున్నాడు సాకేత్.

 

నడుస్తూ గుడి దగ్గరకు చేరుకున్నారు.

 

తొమ్మిది అంతస్తులతో ఆకాశాన్ని తాకుతున్నట్లుండే గోపురాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

 

అప్పుడు ఆయన అన్నారు “వీటి మీద రామాయణ ఘట్టాలే కాదు, మహాభారత, భాగవత దృశ్యాలనూ కళ్లకు కట్టినట్లుగా మలచిన దృశ్యాలు ఉన్నాయి. పైన ఆలయశిఖరం మీద బాల రామాయణ గాథను తెలిపే బొమ్మలు చూడవచ్చు. అద్దాలమందిరం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. ఆ అద్దాల్లోంచి అక్కడ కొలువైన శ్రీరాముణ్ని చూడగలగడం అనిర్వచనీయమైన ఆనందం. మండపం చుట్టూ ఉన్న గోడలమీద రామాయణ గాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఎదురుగా శ్రీరామ పుష్కరిణి ఉంది. అదంతా అప్పటి శిల్పుల ప్రతిభ అని మనం గర్వంగా చెప్పుకోవాలి” అన్నారు.

 

పుష్కరిణి గురించి ప్రస్తావన రాగానే మైథిలికి చప్పున ఆ ఉత్తరం లోని ఓ చిన్న వాక్యం గుర్తుకొచ్చింది.

 

అక్కడున్న మరో వ్యక్తి “భద్రాచలంలో చేసే పద్ధతిలోనే మన ఊరి ఆలయంలోనూ రాములవారి కల్యాణం జరుపుతారు. కలెక్టరు గారి ఆధ్వర్యంలో మంచి ముత్యాల తలంబ్రాలనూ పట్టుబట్టలనూ బహూకరిస్తారు” అని చెప్పారు.

 

“జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గిందే గాని, పూర్తిగా కనుమరుగు కాలేదు. మీ పెద్ద వాళ్ళు చేసిన పుణ్య ఫలం పిల్లలు లభిస్తుందనడానికి నిదర్శనం నువ్వు తల్లీ, పైగా మీ ఇద్దరి పేర్లు కూడా సీతారాములవే అవడం కూడా విశేషమే! ముందు ఆ మూటను రాముల వారి పాదాల చెంత పెట్టించి పూజ చేయిద్దాము” అన్నారు కామేశ్వరరావు గారు.

 

"మీ దంపతులిద్దరూ అది ఇలా ఇవ్వండి" అన్నారు పూజారి. ఇద్దరూ కలిసి ఆ మూటను అందించారు.  రాముల వారి పాదాల చెంత పెట్టి, పూజ చేసేసి, తిరిగి వాళ్ళ చేతిలో పెట్టి ఆశీర్వదించారు.

ప్రసాదాలు తీసుకుని అందరూ బయటకు వచ్చారు.

 

"అంకుల్, నేను ఈ పుస్తకాలని ఇక్కడ ఈ పుష్కరిణి లోనే కలిపేస్తాను” అంది. "సరే అమ్మా అలాగే కానీ!" అన్నారాయన. అందరూ కలిసి జాగ్రత్తగా వాటిని పుష్కరణి లో వదిలి పెట్టారు.

“మీరు వెళుతూ ఉండండి. నేను కొంచెంసేపు కూర్చుని వస్తాను!" అంది మైథిలి. సాకేత్ కు అర్ధమయింది మైథిలి కాసేపు ఏకాంతంగా ఉండాలని అనుకుంటోందని. "సరే మేము ఆ గోపురం ఎక్కుతాము అక్కడ వ్యూ బావుంటుందిట" అంటూ పిల్లలని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయనకి కూడా అర్ధమయింది.

"సరే అమ్మ మేము ఇంటికి వెళ్లిపోతాము మీరు త్వరగా వచ్చేయండి" అని వాళ్ళు వెళ్ళిపోయారు.

 

పుష్కరిణి మెట్లమీద మైథిలి కూర్చుంది. నీళ్ళ వైపు చూస్తోంది. చేతి లో నలిగి ఛిద్రమయిన కాగితం పట్టుకుంది

 

**

 

"రాముడు అంటే భద్రాచలమే కాదు మా ఊరు రాముడు కూడా గొప్పే!" ఉక్రోషంతో ఎఱ్రగా మారిన సీత మొహం చూసి, ఆ మాటలకి నవ్వి “ఇప్పుడు కాదన్నానా?” అని నవ్వాడు శాస్త్రులు.

"మాస్టారు, మన సీతమ్మకి ఓ అబ్బాయిని చూసాను. ఈడు జోడు బావుంటుంది. ఇదిగో సంబంధం వివరాలు చూడండి. అబ్బాయి భద్రాచలంలో స్కూల్ మాస్టారు. పెద్ద బాదరబందీ లు లేవు. ఇహ ఆ పైన మీ ఇష్టం, అళ్ళో పుళ్ళో అంటూ ఇద్దరూ హాయిగా ఉంటారు." అని తనకి నచ్చింది అని నర్మగర్భంగా చెప్పేసాడు శాస్త్రులు.

 

"అయ్యో నువ్వు చూసాక ఇంకా వంకలు పెడతానా? అలాగే కానిచ్చేద్దాము!"

ఊయల బల్ల మీద కూర్చున్న సీత ఆ మాటలు వింది. కానీ ఆ ముఖంలో ఏ భావము లేదు. ఏదో మనసులో మెదిలి, తటాలున బల్ల దిగి వంటింటి వైపు నడిచి "అమ్మా నేను గుడికి వెళుతున్నాను." అని ఇంట్లోంచి బయటకు వచ్చి, రెండు వీధులవతల ఉన్న కోదండరాముడి గుడికి వెళ్ళింది కానీ లోపలికి వెళ్ళలేదు.

 

గుడి ఎదురుగా ఉన్న శ్రీరామ పుష్కరిణి పావంచాల మీద కుర్చుని ఏదో ఆలోచిస్తూ నీళ్ళ వైపు చూస్తూ ఉండిపోయింది. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. చిన్న చెల్లెలు ఒగరుస్తూ వచ్చి “ఒసే సీతక్కా అమ్మ పిలుస్తుందే” అంది. “సరే పద” అంటూ లేచింది.

ముందుకు నడుస్తున్నదల్లా ఒక్క సారి వెనక్కి చూసింది. అంతే మరి. ఇహ వెనక్కి తిరగలేదు సీత.

 

తరువాతేముంది? మామూలు కథే. ఆ వేసంగి లో సీతా కళ్యాణం కాస్తా జగన్నాధం తో జరిగిపోయింది.

విచిత్రమేమిటంటే పుట్టింటికి ఎన్ని సార్లు వెళ్ళినా, కోదండ రాముని దర్శనం మటుకు చేసుకోలేదు సీత. ఆ తరువాత తల్లి తండ్రి పోవడం తో ఆ ఊరు తో ఆమెకి ఉన్న బంధం తెగిపోయింది.

యేళ్ళు గడిచాయి. సీత కాస్తా సీతమ్మ అయింది. ఆ తరువాత సీత మామ్మ అయింది.

ఆ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు.

నిజంగా తెగిపోయే బంధమేనా ఊరి తో? ఏమో!

 

మైథిలి మరోసారి శిధిలావస్థలో పైగా వాక్యాల కొట్టి వేతతో ఉన్న ఉత్తరాన్ని చదువుకుంది. కారణాలు తెలియనితనం. పెళ్లి భద్రాచల వాసితో అయింది. ధర్మబంధానికి, నిర్ణయానికి, దైవ నిర్ణయానికి తలవంచాను.

ఆ రెండు వాక్యాలు చాలు. అందులోనే చాలా అర్ధముంది. ఏదీ విడమర్చి చెప్పనవసరం లేదు. అయినా తనకు కనిపించిన ఉత్తరం సీతామహాలక్ష్మి వ్యక్తిగతం. దాని గురించి చర్చించే అధికారం లేదు. పైగా ఈ లోకం లో లేని మనిషి గురించిన అనుభూతులు,అనుభవాలు అస్సలు బయటపెట్టకూడదు అనుకుంటూ చేతిలో ఉన్న ఆ ఉత్తరాన్ని ఆ పుష్కరణి లో కలిపేసింది.

 

హమ్మయ్య! ఇప్పుడు కొండంత భారం తగ్గినట్టుంది అనుకుని తండ్రికి తలచిన కార్యం నెరవేరిందని చెప్పేందుకు ఫోన్ చేసింది.

 

**

ఆ రోజు మైథిలి తో ఫోన్ లో మాట్లాడినది భద్రాచలంలో తాత గారయిన జగన్నాథరావు గారి ఇల్లు కొనుకున్న వ్యక్తి.

 

వాళ్ళు ఈ మధ్య ఇల్లంతా రిపేర్లు చేయిస్తుంటే అటక పైన పసుపు మూటలో కట్టిన ఈ రామకోటి పుస్తకాలు కనపడ్డాయిట. జగన్నాధరావు కొడుకు చంద్రశేఖర్ కి ఈ విషయాన్ని చిన్ననాటి స్నేహితుడు ద్వారా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళు ఆ సమయంలో  USA కొడుకు దగ్గర ఉండటంతో చంద్రశేఖర్ ఆ పనిని కూతురు మైథిలి కి అప్పజెప్పాడు. అదే కాదు తల్లి భద్రాచలం లో నివాసముండి కూడా ఆ పుస్తకాలు గుడిలో ఇవ్వకపోవడం, ఆవిడ పుట్టింటి ఊర్లో ఉన్న కోదండ రాముడి గుళ్ళోనే ఇవ్వాలన్న కోరిక ఉన్నా, ఎందుకో ఆవిడ ఒక్కనాడు కూడా అడగకపోవటం కూతురితో చెప్పాడు.

 

అందుకే మామిడాడలో తన తాత గారి ఇల్లు కొనుకున్న  కామేశ్వర్రావు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు తమ దగ్గర బంధువులేనని తెలియటంతో కూతురిని నిశ్చింతగా మామిడాడ కోదండరాముడి గుడికి వెళ్ళమని చెప్పాడు. తల్లి పేరు పెట్టుకున్న కూతురి ద్వారా ఆ పుణ్యకార్యం చేయించాలని అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేయమని వాళ్ళని కోరాడు. ఇలా అయితే పై లోకంలో ఉన్న తల్లి ఆత్మ సంతోషిస్తుందని చంద్రశేఖర్ నమ్మకం.

 

 **

 

తండ్రితో మాట్లాడాక, కోనేటి లో కి చూస్తున్న మైథిలికి పట్టు లంగా, జడకుచ్చులతో ముగ్ధలా ఉన్న పదహారేళ్ళ సీత తో పక్కన మురళి వాయించే పేరు తెలియని రూపం మసకగా మసకగా కనిపించింది. ఇంతలో ఆ రూపాన్ని తోసుకుంటూ జబర్దస్తీగా సీత భుజం చుట్టూ చేతులు వేసి నడిపించుకుంటూ వెళ్ళిపోతున్న జగన్నాధం. వెళుతున్నదల్లా వెనుతిరిగి, తన మనసులోని కోరికను తెలుసుకుని  తీర్చిన మైథిలి వైపు చూసి హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

 

 **

bottom of page