MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ రచనల పోటీ
ఆలస్యమైతే
జి.నాగమంజరి
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో రెండవ బహుమతి పొందిన పద్యకథ
ఆటవెలది
పల్లె రైతు యొకడు పాడిపసుల పెంచి*
పాలనమ్ముచుండె పట్నమందు*
పాల చిక్కదనము వ్యాపారమును పెంచ*
మంచిపేరు వచ్చె సంచితముగ*
పల్లెలో ఉన్న ఒక రైతు పాడి పశువులను పెంచి పాలను పక్కనున్న పట్నంలో అమ్ముచుండెను. చిక్కటి పాలను అమ్మడం తో నమ్మకం పెరిగి వ్యాపారంలో మంచి పేరు సంపాదించుకున్నాడు.
-
కందము
చిక్కని పాలను వాడుట*
మక్కువ మీరగ తెలియగ మహిని జనంబుల్*
తక్కిన పనులను మానుకు*
మక్కువ తోడను పశువుల మచ్చిక చేసెన్*
చిక్కని పాలను ఉపయోగించడం వలన లాభాలను, రుచిని తెలుసుకున్నవారు , కొంతమంది మిగిలిన పనులన్నీ మానేసి మరీ సొంతంగా పశువులను పెంచడం ప్రారంభించారు.
-
మత్తకోకిల
పట్టణంబున పాలకేకలు వ్యర్ధమై విలపించగా*
చుట్టుపక్కల రైతులందరు చొచ్చి బేరము పోవగా*
మెట్ట మీదను గడ్డిగాదల మేతకై పసులెళ్లగా*
గట్టిలోచన మానసంబున కార్యరూపము దాల్చగా*
పట్టణ వీధుల్లో పాలోయమ్మ పాలో అని కేకలు పెట్టినా పట్టించుకునే వారే కరువయ్యారు. చుట్టుపక్కల రైతులు కూడా ఈ వ్యాపారాన్నే చేపట్టగా , పాపం తొలి రైతు వ్యాపారం దెబ్బతిన్నది. పశువులన్నింటిని మేతకు పక్కనే ఉన్న గుట్టపైకి పంపి కొత్త ఆలోచన చేసాడు. కార్యరూపంలోకి తీసుకు రావాలని అనుకున్నాడు.
-
తేటగీతి
మిగులు పాలగాచి పెరుగు మిన్న చిలికి*
వెన్నకాచి నేతి ఘటము పేర్మి కూర్చి*
చల్ల జనులకు పంచగా సత్రమునకు*
దానమిచ్చి పధికులకు దాహమిచ్చె*
అమ్మగా మిగిలిన పాలను కాచి, తోడుపెట్టి, పెరుగుచిలికి, వెన్నతీసి, కాచి కమ్మని నెయ్యిని కుండలలో నింపేవాడు. తిప్పగా మిగిలిన మజ్జిగను, సత్రములకు దానమిచ్చి, బాటసారులకు దాహం తీర్చేవాడు.
-
కందం
వ్యాపారము నిలబెట్టగ*
చూపించిన నమ్మకమ్ము చూపగ దారిన్*
కాపాడును పుణ్యమదియె*
తాపము తీర్చగ పధికుల తక్త్రము తోడన్*
వ్యాపారం నిలబడాలంటే నమ్మకం ప్రధానం. ఆ నమ్మకానికి తోడుగా ఎండన పడిన ప్రయాణికుల దాహార్తి మజ్జిగతో తీర్చిన పుణ్యము కూడా తోడయ్యింది.
-
తేటగీతి
నేతి వ్యాపారమందున నీతి తోడ*
రుచియు నాణ్యతలెన్నగా శుచికి తోడ*
ధనము కీర్తి కూడెను చాల త్వరితముగను*
శ్రద్ధ యున్న చోట పెరుగు సంపదెపుడు*
నేతి వ్యాపారం కూడా నీతిగాచేసాడు. రుచి, శుచి, నాణ్యతలను పాటించాడు. ఎప్పుడైతే చేసేపనిమీద శ్రద్ధ ఉంటుందో అప్పుడే డబ్బు, మంచిపేరు కూడా సమకూరుతాయి.
-
ఉత్పలమాల
తప్పని కార్య భారమున దవ్వున పోవగ వేళమించగా*
చప్పున భార్య సేవకుల సంగతెరింగియు సుద్దులంపుచున్*
చెప్పెను నేతిసేకరణ చిత్తము బెట్టుచు శ్రద్ధచూపగన్*
ముప్పగు నేమరించినను మోసము కూడదు కార్యమందనెన్*
ఒకసారి తప్పనిసరియై దూరప్రాంతమునకు వెళ్ళవలసి వచ్చెను. భార్యను, సేవకులను పిలిచి, చేయవలసిన పనులు తెలిపి, వారి అలసత్వము తెలిసినవాడు అగుట చేత మరీమరీ జాగ్రత్తలు చెప్పేడు. పనిలో నిర్లక్ష్యం కూడదని, శ్రద్ధ చూపాలని, మోసం చెయ్యాలని చూస్తే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. అనేక విధాలైన జాగ్రత్తలు చెప్పి, వేళమించుతున్నందున ప్రయాణమయ్యాడు.
-
తేటగీతి
మూడురోజులు మీగడ మురగబెట్టి*
ఆరు దినముల వెన్నల నంట గాచి*
తీరుబడిగ చేయ దొడగు వీరి పనుల*
కంపుగొట్టె నేతి సరుకు కడవలందు*
రైతు భార్య సరైన అజమాయిషీ చేయక, సేవకుల అలసత్వము కారణంగా ప్రతిరోజు పెరుగుచిలికి వెన్నతీసి నెయ్యి కాచకుండా, మూడురోజుల కొకసారి మీగడలను తిప్పి వెన్న తీసేవారు. ఆరురోజులకొకసారి నేతిని కాచినారు. వెన్న మురుగువాసన వచ్చి, కుండలలో ఉంచిన నెయ్యి మంచి పరిమళం కోల్పోయింది.
-
మత్తకోకిల
ఆలి, దాసుల శ్రద్దలేమికి ఆగిపోయెను వాడుకల్*
తేలిపోయెను కమ్మతావులు తేలికయ్యెను మాటలున్*
మేలుగూర్చెడి కార్యమందున మిక్కటించెను నష్టముల్*
కాలయాపన చేసికొన్నను కాలదన్నును సౌఖ్యముల్*
భార్య, సేవకుల అశ్రద్ధ వలన , నాణ్యత పోయిన నెయ్యి వాడుకగా కొనేవారు కూడా మానేశారు. అంతే కాకుండా తేలికమాటలతో కించపరచారు. జీవనాధారమైన వ్యాపారంలో నష్టం వచ్చింది. సరైన సమయంలో పనిచేయక కాలం వృధా చెయ్యడం వలన సుఖాలు కోల్పోవాల్సి వచ్చింది.
-
కందము
ఎప్పటి కప్పుడు పనులను
తప్పనిసరి చేయుచుండ తడబాటవకన్*
తప్పించునననుకూలత*
తప్పును చీవాట్లు తొలగు దారిద్ర్యమ్ముల్*
ఎప్పటిపనిని అప్పుడే మర్చిపోకుండా చెయ్యడం వలన, కంగారు పడాల్సిన పనిలేదు. ఇబ్బంది పడక్కర్లేదు. చీవాట్లు ఉండవు. ధనము కూడి దరిద్రం పోతుంది.
కథ: పల్లెలో ఉన్న ఒక రైతు పాడి పశువులను పెంచి పాలను పక్కనున్న పట్నంలో అమ్ముచుండెను. చిక్కటి పాలను అమ్మడం తో నమ్మకం పెరిగి వ్యాపారంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. చిక్కని పాలను ఉపయోగించడం వలన లాభాలను, రుచిని తెలుసుకున్నవారు , కొంతమంది మిగిలిన పనులన్నీ మానేసి మరీ సొంతంగా పశువులను పెంచడం ప్రారంభించారు. పట్టణ వీధుల్లో పాలోయమ్మ పాలో అని కేకలు పెట్టినా పట్టించుకునే వారే కరువయ్యారు. చుట్టుపక్కల రైతులు కూడా ఈ వ్యాపారాన్నే చేపట్టగా , పాపం తొలి రైతు వ్యాపారం దెబ్బతిన్నది. పశువులన్నింటిని మేతకు పక్కనే ఉన్న గుట్టపైకి పంపి కొత్త ఆలోచన చేసాడు. కార్యరూపంలోకి తీసుకు రావాలని అనుకున్నాడు. అమ్మగా మిగిలిన పాలను కాచి, తోడుపెట్టి, పెరుగుచిలికి, వెన్నతీసి, కాచి కమ్మని నెయ్యిని కుండలలో నింపేవాడు. తిప్పగా మిగిలిన మజ్జిగను, సత్రములకు దానమిచ్చి, బాటసారులకు దాహం తీర్చేవాడు. వ్యాపారం నిలబడాలంటే నమ్మకం ప్రధానం. ఆ నమ్మకానికి తోడుగా ఎండన పడిన ప్రయాణికుల దాహార్తి మజ్జిగతో తీర్చిన పుణ్యము కూడా తోడయ్యింది. నేతి వ్యాపారం కూడా నీతిగాచేసాడు. రుచి, శుచి, నాణ్యతలను పాటించాడు. ఎప్పుడైతే చేసేపనిమీద శ్రద్ధ ఉంటుందో అప్పుడే డబ్బు, మంచిపేరు కూడా సమకూరుతాయి.
ఒకసారి తప్పనిసరియై దూరప్రాంతమునకు వెళ్ళవలసి వచ్చెను. భార్యను, సేవకులను పిలిచి, చేయవలసిన పనులు తెలిపి, వారి అలసత్వము తెలిసినవాడు అగుట చేత మరీమరీ జాగ్రత్తలు చెప్పేడు. పనిలో నిర్లక్ష్యం కూడదని, శ్రద్ధ చూపాలని, మోసం చెయ్యాలని చూస్తే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. అనేక విధాలైన జాగ్రత్తలు చెప్పి, వేళమించుతున్నందున ప్రయాణమయ్యాడు.
రైతు భార్య సరైన అజమాయిషీ చేయక, సేవకుల అలసత్వము కారణంగా ప్రతిరోజు పెరుగుచిలికి వెన్నతీసి నెయ్యి కాచకుండా, మూడురోజుల కొకసారి మీగడలను తిప్పి వెన్న తీసేవారు. ఆరురోజులకొకసారి నేతిని కాచినారు. వెన్న మురుగువాసన వచ్చి, కుండలలో ఉంచిన నెయ్యి మంచి పరిమళం కోల్పోయింది. భార్య, సేవకుల అశ్రద్ధ వలన , నాణ్యత పోయిన నెయ్యి వాడుకగా కొనేవారు కూడా మానేశారు. అంతే కాకుండా తేలికమాటలతో కించపరచారు. జీవనాధారమైన వ్యాపారంలో నష్టం వచ్చింది. సరైన సమయంలో పనిచేయక కాలం వృధా చెయ్యడం వలన సుఖాలు కోల్పోవాల్సి వచ్చింది.
ఎప్పటిపనిని అప్పుడే మర్చిపోకుండా చెయ్యడం వలన, కంగారు పడాల్సిన పనిలేదు. ఇబ్బంది పడక్కర్లేదు. చీవాట్లు ఉండవు. ధనము కూడి దరిద్రం పోతుంది.
కబీర్ దోహెలో చెప్పినట్లు…
కాల్ కరై సో ఆజ్ కర్ , ఆజ్ కరై సో అబ్, పల్ మే పరలై హొయగో , బహురి కరైగో కబ్
*****