MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
అక్టోబర్ 10, 11 , 2020 (శని, ఆది వారాలు) తేదీలలో 36 గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో కొన్ని ఎంపిక చేసిన ప్రసంగాల సమాహారం.
7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వ్యాస మధురాలు
21 వ శతాబ్దపు స్త్రీల నవలలు
ఆచార్య శివుని రాజేశ్వరి
ఆగస్టు 29, 30 తేదీన ’21 వ శతాబ్ద స్త్రీల నవలలు’ అన్న అంశంపైన ఒక వెబినార్ జరిగింది. కథానిక, కవితలపైన చాలా సెమినార్లు, వెబినార్లు జరిగాయి. కానీ నవలపై ఈ మధ్య కాలంలో సెమినార్లు, వేబినార్లు జరగలేదు. అందుకు కారణం నవలకు కాలం చెల్లిందన్న అపోహ. కథలు, కవితలు అంత విస్తృతంగా నవలలు రాకపోయినా, నెమ్మదిగా, మందగమనంతో సమాజంలోని కదలికల్ని గర్భంలో మోస్తూ నవల కదలిపోతూనే ఉంది. గతంలో లాగానే నవలా రచనలో స్త్రీలు ముందంజలో కనిపించారు. 21 వ శతాబ్దిలో అనగా గత 20 సంవత్సరాల కాలంలో వచ్చిన స్తీల నవలలు ఏవి? ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ స్త్రీలు నవలలు రాస్తున్నారు?
వెయ్యేళ్ళనాటి“తిక్కన తెలుగు- నేటిమన తెలుగు”
డా.చింతలపాటి మోహనమురళీకృష్ణ
ఆదికవి నన్నయభట్టు తరువాత తిక్కన సోమయాజి మహాభారతంలో మిగిలిన 15 పర్వాలను ఆంధ్రీకరించాడు. తిక్కన తాను “జాను తెనుగు”లో వ్రాశానని చెప్పుకున్నాడు. అది ఇంచుమించుగా మనం ఇప్పటికీ వాడుతున్న సరళ గ్రాంథికమైన తెలుగే. ఆయన భారతాంధ్రీకరణ జరిగి ఇప్పటికి రమారమి వెయ్యి సంవత్సరాలు గడిచాయి. ఈ వెయ్యి సంవత్సరాల్లో తెలుగు భాషలో ఎన్నెన్నో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. రకరకాల ఉద్యమాలు, సంస్కరణలపేరుతో, విప్లవాల పేరుతో, అభ్యుదయ భావాలపేరుతో తెలుగు భాషా స్వరూపాన్ని చాలావరకు మార్చివేశాయి.పూర్వం ఉండే కావ్యభాష స్థానంలో శిష్టవ్యావహారికం,ఆతరువాత పూర్తి వ్యావహారికం చోటుచేసుకుంది...
చట్టసభల్లో భాష
శ్రీనివాస్ పెండ్యాల
చట్ట సభల గురించి మాట్లాడేముందు... భారత రాజ్యాంగ నిర్మాణం, చట్ట సభల ఏర్పాటు ఎలా జరిగిందో మీ అందరికీ ఒకసారి గుర్తుచేస్తాను.
యావత్ భారత దేశానికి ఒకే రాజ్యాంగం అవసరం… అని దాన్ని నిర్మిచడానికి ఒక చట్టబద్దమైన కమిటి అవసరం వుంది అని 1934 లోనే గుర్తించారు. ఎం.ఎన్.రాయ్ గారిని ఇందుకు ఆద్యుడుగా పేర్కొంటారు.. వీరు రాజ్యాంగం కొరకు కొంత ఉద్యమాన్ని కూడా నడిపినట్లు అధారాలున్నయి. డిసెంబర్ 6, 1946 లో రాజ్యంగ కమిటి ని ఏర్పరచారు.. యాధృచ్చికంగా ఇప్పుడు ఈ డిసెంబర్ 6 వ తేది ని మరొక మత పరమైన వివాదం వల్ల బ్లాక్ డే గా కొంత మంది పాటిస్తుంటారు... అది వేరే విషయం. స్వాతంత్రం పూర్వం 389 మంది సభ్యులతో ఏర్పడిన కమిటీ.. స్వాతంత్రం తరువాత దేశ విభజన కారణంగా 299 మంది సభ్యులకు కుదించబడింది. ఈ కమిటి అంతర్గతం గా మరో 13 ఉప కమిటీ లను ఏర్పరచి వివిధ అంశాలపై లోతయిన అధ్యయనం చేసింది.
భానుమతిగారి సాహిత్యంలో అత్తగారు
రాధిక నోరి
అత్తా ఒకింటి కోడలే అన్నారు కదా! అంటే ప్రతి అత్తా ఒకప్పుడు ఎవరో ఒకరికి కోడలే అన్నమాట. అలాగే, అందరూ అని అనను కానీ, చాలామంది కోడళ్ళు భవిష్యత్తులో ఏదో ఒకనాడు అత్తలు అవుతారు. అయితే ఈ అత్తలు అందరూ ఒకేలాగా వుండరు. కానీ భానుమతిగారి అత్తగారిలాంటి అత్తగారు కావాలని మాత్రం కోరుకోని కోడలు ఎవరూ ఉండదు. దీనికి కారణం ఆ అత్తగారిలో వున్న ప్రత్యేకతలే! ఆవిడ మాములుగా అందరూ అనుకునేలాగా కోడళ్ళని ఆరళ్ళు పెట్టే అత్తగారు కాదు. ఆ గయ్యాళితనం ఆవిడలో అసలు లేనేలేదు. పసిపాపలాంటి అమాయకత్వం, అందరిపట్లా ఆవిడకున్న స్వచ్ఛమైన ప్రేమ, ఆవిడ ప్రతి మాటలోనూ, చేష్టలోనూ మనకి తెలిసిపోతూవుంటుంది. ఇంక ఆ కోడలు కూడా అంతే! ఆవిడ మంచితనానికి ఏమాత్రమూ తీసిపోదు..
అనువాదాల ఆవశ్యకత -- ఇటునుంచి అటు
వేలూరి వేంకటేశ్వర రావు
నేను హై స్కూలులో చదువుకునే రోజుల్లో, శరత్ నవలలు, టాగూరు కథలు, నాటికలూ, బెంగాలీ నుంచి తెలుగులోకి దిగుమతి కాకపోయుంటే, నా తెలుగు కాల్పనిక సాహిత్యాధ్యయనం ఏమై వుండేదో ఇప్పుడు చెప్పడం కష్టం! అంతేకాదు. ప్రేమ్‌చంద్ హిందీనుంచి తెలుగులోకి దిగుమతి కాకపోయుంటే హిందీలో కథలు, నవలలూ కూడా ఉంటాయా అని అనుమానంవచ్చి వుండేది. ఎన్నో అపరాథపరిశోధక కథలు, చవకబారు (# Sexton Blake#) సెక్స్‌టన్ బ్లేక్ లాంటి అనామక రచయితని కాపీకొట్టి మనకు దిగుమతి చేయబడ్డ అనువాదాలు -- అన్నీఇంగ్లీషునుంచి తెలుగులోకి తర్జుమా అయి మా రోజుల్లో విచ్చలవిడిగా వేడివేడి పకోడీల్లా గ్రంథాలయాల్లో దొరికేవి. ఆ రోజుల్లో అవన్నీ చదివేసే వాళ్ళం! ( అవికాకుండా, హిందీలోను, హిందీ నుంచి అనువదించబడిన బూతు పుస్తకాలు సరేసరి!) అందాకా ఎందుకు?
కాలతీతం, సార్వజనీనం శ్రీ తెన్నేటి సూరి రచనలు
డా. తెన్నేటి శ్యామకృష్ణ
1940ల నాటి సంగతి, మన తెలుగు ప్రాంతాలు మద్రాస్ ఉమ్మడి ప్రావిన్స్‌లో భాగంగా చలామణి అవుతున్న రోజులు. మన తెలుగు వారి దిన పత్రిక ఆంధ్ర పత్రిక ఒక దివిటీలా ఉజ్జ్వలంగా వెలుగుతూ తెలుగు వార్తలను అందించడం మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికి ఒక ఆలంబనగా నిలిచిన రోజులు. నిత్యం ఉదయంపూట మద్రాసు హైకోర్ట్ ముందు లాన్స్‌లో కూర్చుని లాయర్లంతా ఆ దినం ఆంధ్ర పత్రిక వెలువడగానే అదొక అలవాటుగా సంపాదకీయం చదివేసినాక తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి ఉద్యుక్తులయ్యే రోజులవి ... ఆంధ్ర పత్రికను నడిపించిన సారధి శివలెంక శంభు ప్రసాద్ గారైతే, దాని సహాయ సంపాదకునిగా, సాహిత్య విభాగ సారధిగా, ఆయనకు కుడి భుజంగా నిలిచినవారు శ్రీ తెన్నేటి సూరి..
శాస్త్ర విజ్ఞాన సాహిత్యం
వేమూరి వేంకటేశ్వరరావు
“శాస్త్ర విజ్ఞాన సాహిత్యం” అంటే “విజ్ఞాన శాస్త్రాలకి సంబంధించిన సాహిత్యం.” ఇది విరుద్ధోక్తి అనే అలంకారానికి ఉదాహరణ. అనగా రెండు విరుద్ధమైన అర్థాలు వచ్చే మాటలని ఒకే సందర్భంలో వాడడం. సాహిత్యం, శాస్త్రం నూనె, నీళ్లల్లా కలవవు.
సాహిత్యం అనగానే మన మనస్సులలో స్ఫురించేవి కవితలు, కథలు, నాటకాలు, నవలలు, వ్యాసాలు, వగైరా. వీటన్నిటిలోను సాధారణంగా సమాజంలోని సమస్యలు ఇతివృత్తాలుగా వస్తూ ఉంటాయి: ప్రేమలు, దోపిడీలు, దుర్మార్గాలు, మూఢ నమ్మకాలూ, మానసిక సమశ్యలు, వగైరా..
తెలుగు పత్రికలు - మారుతున్న భాషా ధోరణులు
డా. బూరుగుపల్లి వ్యాస కృష్ణ
ఆధునిక జీవితాల్లో పత్రికలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. మనిషి ఆలోచనా విధానాన్ని, జీవిత గమనాన్ని మార్చగలిగిన శక్తి పత్రికలకు ఉన్నదని అనటంలో అతిశయోక్తి లేదు. పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ గా, నిరంతర సమావేశాలు జరిగే ప్రజా పార్లమెంటుగా అభివర్ణిస్తారు.
పత్రికలకు సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే, బ్రిటిష్‌వారు తమ వలస ప్రాంతాల్లో పత్రికలపట్ల ఉదారంగా ఉన్నట్లు కన్పించినా , తమను విమర్శించే పత్రికలపై కొంత కక్షపూరితంగానే వ్యవహరించేవారు. సంస్థానాలలో మాత్రం ఇందుకు భిన్నంగా పత్రికల స్థాపనకు అవకాశం ఇవ్వటం జరుగలేదనే చెప్పవచ్చు. కొన్నిసంస్థానాలలో సాహిత్య పోషణ జరిగినా అది పత్రికా పోషణగా చెప్పలేము.
మార్క్సిజాన్ని కధాసాహిత్యంలో ప్రవేశపెట్టిన చాగంటి సోమయాజులు
డా. చాగంటి కృష్ణ కుమారి
చాసో స్వయంగా తను మార్క్సిష్టు దృక్పధంతోనే కధలు రాసాననీ దానికే మొదటినుండీ కట్టుబడి వున్నాననీ చెప్పేవారు. ఈ దృక్పధం వారికి ఎప్పుడు, ఎలా అలవడిందో దానిని కధలలోవారు ప్రవేశపెట్టిన తీరెలా వుందో పరిశీలించి చూద్దాము.
కధా శిల్పిగా పేరు పొందిన చాసో 1915 జనవరి 17వ తెదీన ఉత్తరాంధ్రా శ్రీకాకుళం లో పుట్టి 1994 జనవరి 2 న చెన్నైలో చనిపోయారు. వీరి బాల్య, కౌమార దశలలోని ప్రాపంచిక, దేశీయ పరిస్థితులను పరిశీలించి చూస్తే 1930- 1940 దశకం అతర్జాతీయంగా ఆకొన్న దశకం(Hungry decade). భారతదేశం ఆంగ్లేయుల పాలనలో ఉంది.